Thursday, September 25, 2025

 4️⃣7️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  

మనసులో ఒక థాట్ వస్తుంది. దానిని మనం అలానే ఉంచం. అలా అలా పెంచుతాము. దాని గురించి విపరీతంగా ఆలోచిస్తాము. మధిస్తాము. దానిని ఇది వరకు వచ్చిన ఆలోచనలతో ముడిపెడతాము. మనం భగవంతుడిని గురించి క్షణం కూడా ఆలోచించము కానీ మనలో చెలరేగే భావాల గురించి తదేకంగా ధ్యానం చేస్తుంటాము. భగవంతుడి గురించిచేసే ధ్యానం మంచి ఫలితాలను ఇస్తే, విషయ వాంఛల గురించి చేసే ధ్యానం దుష్పలితాలను ఇస్తుంది. మనకు భగవంతుని మీద ధ్యానం కుదరడం లేదంటే దాని అర్ధం మనకు విషయ వాంఛల మీద ఉన్న ఆసక్తి ఈశ్వరుడిమీద లేదు.

ఆ ప్రకారంగా విషయ వాంఛల గురించి, ప్రాపంచిక విషయముల గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి, వాటి మీద అటాచ్ మెంట్ అంటే సంగమము అంటే ఆసక్తి పెరుగుతుంది. మనం ఏ విషయం మీద నైనా ఎక్కువగా ఆలోచిస్తే ఆ విషయం మీద ఆసక్తి, సంగమం పెరుగుతుంది. దానికి అతుక్కుపోతారు. అదే లోకంగా ఉంటారు. దీనికి ముఖ్య ఉదాహరణ ప్రకటనలు. చూడంగా చూడంగా వినంగా వినంగా దానికి అతుక్కుపోయి అది కొంటే కానీ నిద్ర పట్టని స్థితికి చేరుకుంటారు. ఈ ప్రకారంగా ఒక విషయాన్ని గురించి ఆలోచించి ఆలోచించి, దాని మీద ఆసక్తి పెంచుకొని, తుదకు ఆ వస్తువు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది లేకపోతే నేను సుఖంగా ఉండలేను, ఎలాగైనా ఆ వస్తువు నాకు కావాలి అనే నిశ్చయానికి వస్తారు. దానినే కోరిక అంటారు.

ఆ కోరిక ఎలాంటిదంటే ఆ వస్తువు మీ దగ్గర ఉన్నట్టే ఊహించుకుంటారు. అది మన ఇంట్లోనే ఉన్నట్టు దాని వలన ఎంతో ఆనందం పొందుతున్నట్టు ఊహల్లో తేలిపోతారు. ఎలాగైనా ఏం చేసైనా సరే ఆ వస్తువు నాకు కావాలి నా కోరిక తీరాలి అనే స్థితికి చేరుకుంటారు. బాగా ఉన్నవాళ్ల పిల్లలు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. బైకులు దొంగిలిస్తుంటారు. కొంతమంది తమ గరల్ ఫ్రెండును పబ్ తీసుకువెళ్లడానికి దొంగతనాలు చెయ్యడానికి కూడా వెనుకాడరు. ఇది మనం వింటూనే ఉంటాము. ఇది ఒక విపరీత స్థితి. ఈ స్థితికి చేరుకున్న తరువాత ఆ కోరిక అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోరిక తీరకపోతే నేను సుఖంగా ఉండలేను, బతకలేను అనే స్థితికి చేరుకుంటారు.

అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే చెప్పేదేముంది. అంతా మంచే జరుగుతుంది. కాని కోరికలు అన్నీ తీరవు కదా. తీరని కోరికలే ఎక్కువ. ఆ ప్రకారంగా విపరీతంగా ఊహించుకున్న కోరికలు తీరక పోతే విపరీతమైన కోపం వస్తుంది. ఒక వేళ ఆ కోరిక తీరిందనుకుందాము. దాని వెంట మరొక కోరిక పుట్టుకొస్తుంది. ఎందుకంటే దొరికినదానితో తృప్తి చెందడం మానవ లక్షణం కాదు. ఉన్నదానిని పక్కన బెట్టి లేనిదాని కోసం పాకులాడటం మనకు పుట్టుకతో వచ్చిన గుణం. కాబట్టి కోరికలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవి తీరకపోతే కోపం రావడం సహజం. ఆ కోపం మన మీద కాదు. ఎవరిమీదనో కోపం. వాడి వల్ల నాకు ఇలా జరిగింది. వీడి వల్ల నాకు ఇలా జరిగింది. అని వాడి మీదా వీడి మీద కోపం వస్తుంది. కొంతమందికి అకారణ కోపం. దానికి ఒక కారణం ఉండదు. చిరుబురులాడుతుంటాడు. అసహనంగా ఉంటాడు. పలకరిస్తే కస్సుమంటాడు. చేతిలో ఏది ఉంటే అది విసిరికొడతాడు. కోపం అంటూ వేరే ఏమీ లేదు. అనుకున్న కోరిక తీరకపోతే, అనుకున్నది జరగకపోతే, తాను అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరిగితే, తనకు నచ్చని వాడిని చూస్తే, కలిగే స్థితి కోపము. ఒక ప్రవాహం పోతూ ఉంటుంది. అది ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఏదైనా అడ్డుతగిలితే ఎగిసిపడుతుంది. అలాగే అనుకున్నది నెరవేరకపోతే, మనకు నచ్చనిది జరిగితే, కోపం వస్తుంది.

క్రోధం వచ్చిన తరువాత జరిగే పరిణామము... మానవుడు తాత్కాలికంగా వివేచనా శక్తి కోల్పోతాడు. విచక్షణ ఉండదు. మంచి చెడు గుర్తించడు. ఎవరిని తిడుతున్నాడో ఏం తిడుతున్నాడో చూడడు. నోటికి ఎంతవస్తే అంత అనేస్తాడు. దానినే మోహము అంటారు. అంటే ఆ కోపానికి వశుడు అవుతాడు. ఆవేశానికి లోను అవుతాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తాడు. శంకరుల వారు కోపం వచ్చినవాడి గురించి చెబుతూ అటువంటి వాడు గురువును కూడా ఆక్షేపిస్తాడు. నీకేం తెలుసు అంటాడు. తల్లిని కూడా కొట్టడానికి పోతాడు.

ఇటువంటి స్తితికి చేరుకున్నప్పుడు మానవుడికి బాహ్య స్మృతి ఉండదు. ఒకవిధమైన ట్రాన్స్లో ఉంటాడు. ఊగి పోతుంటాడు. అంటే మంచి చెడు తెలుసుకొనే స్మృతి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో మరిచిపోతాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాడు. వాడు నా యజమాని, వాడు నా తండ్రి, నా అన్న, నా బంధువు, నా భార్య అనే స్పృహ (జ్ఞాపకం) కూడా ఉండదు. ఎవరినీ లెక్కచేయడు. ఆ స్థితి నుండి మానవుడు ఇంకా దిగజారి తన బుద్ధిని కోల్పోతాడు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని నిర్ణయించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా పని చేయదు. పక్కకు తొలిగి ఉంటుంది. ఎందుకంటే చెప్పినా వినే స్థితిలో లేడు.

బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో వాడి పతనం ప్రారంభం అవుతుంది. అప్పుడు మానసిక పతనం శారీరక పతనం కింద మారుతుంది. కొట్టడం తిట్టడం, చంపడం నరకడం లాంటివి చోటుచేసుకుంటాయి. దానితో పోలీసుస్టేషన్లు జైళ్లు, పరువుబోవడం, అంటే మానవుని పతనం మొదలవుతుంది. ఇదీ సంగంతో మొదలయి తుదకు సర్వనాశన స్థితికి చేరుకున్న మానవుని పతనావస్థ.

ఈ పతనావస్థను తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి అనే విషయం తరువాత రెండు శ్లోకాలలో చెబుతున్నాడు భగవానుడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P124

No comments:

Post a Comment