*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*పుణ్యం - నైపుణ్యం*
*పుణ్యం లోకమార్గాన్ని, లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగంచేసి పుణ్యాత్ముడిగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యమున్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జతకూడితే- అది ప్రపంచానికి మేలుచేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యం ఏమో మన శక్తిసామర్థ్యాలను మెరుగు పరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి. ఈ రెండు అంశాలు భిన్నమైనవైనా ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి కలిసినప్పుడే జీవితమార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది.*
*భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ‘చేసే కార్యంలో నైపుణ్యమే యోగం’* *అంటాడు. ఇది నైపుణ్యాన్ని ధర్మపథంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. పుణ్యం మనసును పవిత్రం చేస్తే, నైపుణ్యం చేతుల్ని శక్తిమంతం చేస్తుంది. పుణ్యంతో ఉన్న దిశ, నైపుణ్యంతో ఉన్న దృష్టి కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది. ఈ రెండు లక్షణాల సమన్వయం యోగ్యుణ్ని తయారుచేస్తుంది. మన ప్రవర్తన, నైపుణ్యం, ధర్మం కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం. మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్లను నియమించుకున్నాడు. సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్తవ్యనిష్ఠ, సామర్థ్యం, దయ, ధర్మం అన్నింటి సమన్వయ మూర్తి శ్రీరాముడు. పుణ్యం, నైపుణ్యం రెండూ మనిషిని దైవత్వానికి దగ్గర చేసే మార్గాలు. ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ధ్యానం, పూజలు మాత్రమేకాదు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయ పరచి జీవించడం.*
*నైపుణ్యం నేర్పరితనాన్ని సూచిస్తుంది. కొందరి నైపుణ్యం వారిని అందలం ఎక్కిస్తుంది. కుబేరుల్ని చేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపజేస్తుంది. మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. ఒక బోరుబావిలో పడిన బాలుణ్ని రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామగ్రి తయారుచేయడానికి మేధావుల తోడ్పాటు కావాలి. ఇలాంటి వారి జీవితాలే ధన్యమవుతాయి.*
*పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. ధర్మాన్ని రక్షించే పుణ్య పురుషుల శక్తి దేశాన్ని రక్షిస్తుంది. శాంతి సౌభాగ్యాలతో వికసింప జేస్తుంది. పుణ్యపురుషులకు నైపుణ్యం తోడైతేనే లోకకల్యాణం సాధ్యమవుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో శోభిల్లుతుంది. పుణ్యంతో నైతికత, కరుణ, సేవాభావం పెరుగుతాయి; నైపుణ్యంతో సామర్థ్యం, విశ్వాసం, కార్యదక్షత మెరుగవుతాయి. ఇవి రెండూ కలిసి ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్నే మార్చే శక్తిగా మారతాయి. మన చేతుల్లోని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment