@ యమ కూపం @
తను శవమై..
ఒకరికి వశమై..
తనువు పుండై..
ఒకడికి పండై..
ఎప్పుడూ ఎడారై.
ఎందరికో ఒయాసిస్సై .
వేశ్య గురించి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఈ కవిత ఎంతలోతైనది.
ఆడదాని శరీరమే కేంద్రంగా
ఆది కాలం నుంచి నేటి వరకు జరిగిన వ్యాపారాన్ని కొలవాలంటే ...
సముద్రపు లోతును అంగుళాలతో కొలువడమే అవుతుంది.
అయితే అంతటి లోతును
ఒక ఊరు కేంద్రంగా సాగిన వ్యాపారంతో కొలిచి చూపిన పుస్తకం యమకూపం.
రష్యాలోని యామ్‌స్కాయాలోని సాగిన వేశ్యా వ్యాపారంతో మొత్తం ఈ వ్యవస్థను కళ్లకు కట్టేలా రాసిన పుస్తకం యమకూపం ..
యామా ది పిట్ పేరుతో అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన నవలను తెలుగులోకి యమకూపం పేరుతో రెంటాల గోపాలకృష్ణ అనువదించారు.
విలాసిని.. వేశ్య, గణికాంగన, లంజ, ముండ, కాల్‌గర్ల్.. కాలాలు, పేర్లు వేర్వేరు కావచ్చు. వ్యభిచారం చేసే ఆడదానికి సమాజం ఇచ్చిన బిరుదులు అవి. రంగు రంగుల చీరలు, వగలు పలికించే ఒంపులు, ఇక ఇకలు, పకపకలు.. లెక్కలేని తనం.. సిగ్గుమాలిన తీరు ఆ మహిళలకు అదనపు అభరణాలు.. అయితే ఇవన్నీ పైకి కనిపించే దృశ్యాలు.
మరి ఒక్కసారి తెర తొలగించి వారి మనస్సును తాకాలంటే యమకూపం (yama kupam) నవల చదవాల్సిందే
ఆ రంగుల వెనుక కనిపించని చీకట్లు ఎన్నో, ఒంపుల వగల వెనుక వంచనకు గురైన సెగలెన్నో, ఇకఇకలు, పకపకల వెనుక పెళ్లుమని పగిలిపోయిన ప్రేమలెన్నో, లెక్కలేనితనం వెనుక కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయిన మనస్సులెన్నో, సిగ్గుమాలిన తనం వెనుక నుగ్గునుగ్గయిన జీవితాలెన్నో…
ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంది. కన్నీటి ప్రవాహం ఉంది.. కడుపు నింపుకొనేందుకు పడుపు వృత్తి నెంచుకునే క్రమంలో ఆ శరీరాలు, మనస్సును ఎంత చిత్రవధననుభవిస్తాయో తెలుసుకుంటే గుండె చెరువవుతుంది. మనస్సు ముక్కలుముక్కలై శిథిలాలుగా మారిపోతుంది.
– గ్రీష్మ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
No comments:
Post a Comment