Home
Shorts
You
Hari Raghav
40 minutes ago
#EXISTENTIALISM #RELIGION #ABSURD #OCD
13 సంవత్సరాల రోహిత్ భయం భయంగా ఉన్నాడు. తన భయానికి కారణం వినాయక చవితి నాడు చందమామను చూడడం. ఎవరెన్ని సార్లు చెప్పినా తన భయం పోవడం లేదు. ఆ రోజు వినాయక పూజ జరిగేటప్పుడు పూజారి చదివిన కథలో ఆ రోజు చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు వస్తాయి అని చెప్పారు. పాలలో చంద్రుడిని చూసినందుకు శ్రీ కృష్ణుడంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదు. ఇక తనెంత? కథ విన్నట్లయితే ఆ పాపం పోతుందట. కానీ తను కథ కూడా పూర్తిగా వినలేదే!!
అలాగే 37 సంవత్సరాల అనుపమ తను ఎక్కడ ఎరుపు రంగు చూసినా భయపడుతుంది. అది ఎవరన్నా అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అయినా రక్తమేమో అని భయం. ఆ విధంగా ముట్టును ముట్టుకుని తను స్నానం చెయ్యకుండా అన్ని పనులూ చేసెయ్యడం పాపం అని భయపడుతుంది. ఎందుకొచ్చిందో తెలియదు గత కొద్ది సంవత్సరాలుగా తనకు ఈ భయం వచ్చింది. గత 7 నెలలుగా ఆ భయంతో ఏ పని చెయ్యలేక పోవడం, నిద్రపోలేక పోవడం వల్ల జీవితం అస్తవ్యస్తం అయ్యింది.
48 సంవత్సరాల కనక రాజు వ్యాపారవేత్త. పుట్టుకతో హిందువయిన కనకరాజు చిన్నప్పుడే బాప్టిజం పుచ్చుకున్నాడు. తను ఎక్కడ హిందూ పూజలు జరిగినా దూరంగా ఉంటాడు. ప్రసాదం ఎట్టి పరిస్థితులలోనూ ముట్టుకోడు. ఒకరోజు అర్థరాత్రి 2 గంటల సమయంలో కనకరాజు విపరీతంగా కక్కుకుంటున్నాడు. ప్రక్క ఫోర్షన్ లో ఉంటున్న వారు నిద్రభంగం అయ్యి ఏమయ్యిందో కనుక్కుందామని వచ్చారు. కనకరాజు భార్య అంత అర్థరాత్రి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. విషయం ఏంటంటే ఆ రోజు కనకరాజు తన కజిన్ ఇంట్లో డిన్నర్ చేసాడు. ఆ రోజు తన కజిన్ తండ్రికి సంవత్సరీకం చేసాడు. పూజకు సంబంధించిన ఏవీ ముట్టుకోకుండా కేవలం భోజనం మాత్రమే చేసాడు కనకరాజు. కానీ రాత్రి హఠాత్తుగా ఒక ఆలోచన అతనిని భయపెట్టింది. అది తనకు గారెలలో వడ్డించిన కొబ్బరి చట్నీ ఎక్కడిది? పూజకు కొట్టిన కొబ్బరి చిప్పలనుండి కానీ చెయ్యలేదు కదా???
28 సంవత్సరాల రవికాంత్ నాస్తికుడు. నాస్తికత్వ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గునే రవికాంత్ కి గత సంవత్సర కాలంగా ఒక సమస్య వచ్చింది. అది ఎక్కడ దేవుడి విగ్రహం కనిపించినా తెలియకుండా బూతులు నోటినుండి వెలువడతాయి. కొన్నిసార్లు పైకి ఉచ్చరిస్తూ ఉంటాడు. అది గత రెండు నెలలుగా ఉధృతి దాల్చి మరో రూపంలోకి మారింది. ఎక్కడ దేవుడి విగ్రహం కనిపించినా దానిని పగలగొట్టాలి, దాని పైన మూత్రం పొయ్యాలి అని అనిపిస్తుంది. ఊరికి చివర కొండల మీదకు పోయి ఎవరూ లేని సమయంలో అక్కడున్న దేవుడి విగ్రహాల మీద తన ప్రవర్తన చూపించాడు. తరువాత ఊరిలో వారు ఆ ప్రవర్తనకు కోపోద్రేకులు కావడం చూసాడు. అదృష్టం ఏంటంటే ఆ పని చేసింది అతనే అని ఊరిలోని వారికి తెలియక పోవడము. కానీ అతని ఆలోచనలు మాత్రం కంట్రోల్ కావడం లేదు. తనెక్కడ మళ్ళీ అలా చేస్తాడో అని భయపడి పోతున్నాడు.
50 సంవత్సరాల విశ్వేశర్ ఒక సినీ దర్శకుడు. చాల భక్తి శ్రద్ధలు. శివుడి పూజలు బాగా చేస్తాడు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక మాసం భక్తి శ్రద్దలతో చేస్తాడు. స్నానం, మడి, పూజ తప్పక పాటిస్తాడు. తను ఏ పని చేసినా శివుడికి కనీసం 2 నిమిషాలు ప్రార్థించిగాని మొదలుపెట్టడు. కానీ గత 7 నెలలుగా తనకు ఎక్కడ చూసిన శివుడిని చూసినట్లు అనిపిస్తుంది. తను చెత్త బుట్టలో ఎమన్నా పడేద్దాం అంటే అందులో శివుడు కనిపిస్తాడు. ఎక్కడన్నా ఉమ్మి వేద్దామంటే అక్కడ శివుడు కనిపిస్తాడు. చివరికి మల మూత్రాలు విసర్జించడం కూడా అతనికి కష్టంగా మారిపోయింది.
60 సంవత్సరాల నళిని గారికి నిద్రపట్టక భయపడుతుంది. బాధ పడుతుంది. ఒంటరి మహిళ అయినా ఆమె ఆధ్యాత్మికతతో ఎక్కువ సమయం గడుపుతుంది. పూజలు చెయ్యడం, దానధర్మాలు చెయ్యడం తనకు నిత్యకృత్యం. అయితే తన కోపాన్ని అధిగమించుకోలేక పోతుంది. ధ్యానం ద్వారా తన సహచరులందరూ కోపాన్ని అధిగమించ గలిగారు. తను మాత్రం ధ్యానం ఎంత చేసినా కోపం తగ్గక పోగా ఇంకా పెరిగిపోతుంది. ఇదే విధంగా కొనసాగితే తనకు మోక్షం లభించదు. ఇక ఈ జీవితాన్ని ఇక్కడితో చాలించి మరు జన్మలో ఫ్రెష్ గా మోక్ష సాధన ప్రారంభించు కోవాలని అనుకుంటుంది.
32 సంవత్సరాల శ్రీనివాస మూర్తి ఒక జర్నలిస్ట్. తనకు ఎక్కడ ఒక చావు వార్త విన్నా వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేస్తూనే ఉంటాడు. 29 సంవత్సరాల గణేష్ తను నిద్ర లేచేటపుడు ఎవరన్నా తుమ్మితే ఆ రోజు మొత్తం భయం భయంగా గడుపుతాడు. 39 సంవత్సరాల లక్ష్మి అమావాస్య రోజు డబ్బులు వేరే వారికి ఇవ్వాలంటే భయం. చివరికి పిల్లలకు జ్వరం వచ్చినా ఆ రోజు హాస్పిటల్ కి తీసుకువెళ్ల కుండా మరుసటి రోజు వరకూ వేచి ఉంటుంది.
పైవన్నీ కూడా గత సంవత్సర కాలంలో నేను కౌన్సిలింగ్ ఇచ్చిన OCD కేసులలో కొన్ని. ఇవి కొన్ని మాత్రమే ఇటువంటివి అనేకం. ఆచారం, మడి, మైల, అంటు, ముట్ట, శకునాలు, గ్రహణాలు ఇలా అనేకం మనుషులను పట్టుకుని పీడిస్తున్నాయి. అవి చివరికి OCDలు గా మరి జీవితాలను దుర్భరంగా చేస్తున్నాయి. వీటిని 'రిలీజియస్ OCD' అంటారు. ఈ మతం ఆ మతం అని తేడా ఉండదు. అన్ని మతాల వారికీ ఈ OCDలు వచ్చే అవకాశం ఉంది. కేవలం మతస్తులకే కాదు నాస్తికులకు కూడా ఈ OCD వస్తుంది.
కేవలం 'రిలీజియస్ OCD' మాత్రమే కాదు. కెరీర్ OCD, బాడీ బిల్డింగ్ OCD, సోషల్ స్టేటస్ OCD, ఫేస్బుక్ OCD, టిక్-టాక్ OCD, మెడిటేషన్ OCD, కమ్యూనిజం OCD ఇలా అనేక రకాల OCDలతో ప్రజలు సఫర్ అవుతున్నారు. ఏదయితే విశ్వాసం తీవ్రరూపం దాల్చి ఆ వ్యక్తి నిద్రకు దూరం చేసి జీవితాన్ని దుర్భరం చేస్తుందో దానిని OCDగా భావించవచ్చు. కాబట్టి ఏదన్న విశ్వాసాన్ని పిల్లలతో కలిగించే ముందు అది తరువాత వారిలో ఎటువంటి రూపం తీసుకుంటుందో గమనించాల్సి ఉంటుంది. సమాజం, మీడియా ఎలాగూ కొన్ని విశ్వాసాలను రుద్దుతోంది. కనీసం తల్లిదండ్రులైనా శ్రద్ధ వహించాలి. జీవితం ఉన్నది జీవించడానికి తప్ప కట్టుబాట్లు, విశ్వాసాలు, కేజ్రీనెస్ కోసం వ్యర్థం చేసుకోడానికి కాదు.
ఏదయితే మనిషి ఇమ్మిడియట్ లైఫ్ కి సంబంధం లేదో దానికి అవసరానికి మించి ప్రాముఖ్యత ఇవ్వడం వలన OCDలు వస్తాయి. దీనికి ఆ వ్యక్తి జీవితంలో ఎదురుకున్న అనేక రకాల ఒత్తిడిలు కూడా కారణం. మందులు OCDల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి. దీర్ఘకాలంగా మందులు వాడడం వలన అనేక అనర్థాలకు అవకాశాలుంటాయి. ఎగ్జిస్టెన్షల్ థెరపీ OCDల నుండి బయట పడానికి ఉన్నటువంటి మంచి మార్గం.
#HariRaghav 03.09.2019
No comments:
Post a Comment