255 వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకము 43
శుద్ధమద్వయమాత్మానం భావయంతి కుబుద్ధయః|
నతు జానంతి సమ్మోహత్ యావజ్జీవమనిర్వృతా||
ఆత్మశుద్ధమని అద్వితీయమని ధ్యానించే మూడులు ఆత్మానుభవాన్ని పొందజాలరు. ఆత్మను సాధించాలనే భ్రమతో అసంతృప్తితో జీవితమంతా గడిపేస్తారు.
బుద్ధితో మన తాదాత్మ్యం అతిబలీయమైనది .ధ్యానంలో ప్రగతి సాధించి శాస్త్రాన్ని కొంతవరకు అర్థము చేసుకున్న సాధకుడు కూడా బుద్ధినే తానుగా భ్రమిస్తూ బుద్ధిలోని భావాలతో శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మను అద్వయంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తనచే చూడబడే బుద్ధి తాను కాదనే సత్యాన్ని విస్మరిస్తాడు. ఆ బుద్ధితో ఆత్మను దర్శించ గోరినంత కాలము అది బుద్ధిలో కోరికగానే మిగిలిపోయి అశాంతికి లోనవుతాడు. అపార ప్రేమతో ఉపనిషత్ ఋషులు ఆత్మ తత్వాన్ని అతిప్రయాసతో సూచించగలిగారు. ఆ పదజాలాన్ని బుద్ధితో గట్టిగా పట్టుకొని ధ్యానము పేరుతో వల్లే వేసినంతమాత్రాన అవి సూచించే ఆత్మ తత్వం చేరలేము. సత్యములోనికి జాగ్రృతం అవటానికి ధ్యానము నిస్సందేహంగా సాధన మార్గమే కానీ ఆత్మానుభవంలో ఉండటమే అసలైన లక్ష్యం ఆ గమ్యాన్ని చేరటానికి మార్గాన్ని ఎప్పటికైనా విడవక తప్పదు.
వివేకయుక్తము నిషితము తీక్షణము అయిన బుద్ధిలేని వారు ఎంతగా శాస్త్ర అధ్యయనం చేసిన తమ అంతరంగంలో ఆత్మను దర్శించాలని సాధించాలని అనుకుంటూనే ఉంటారు. మనలో ఉంటూ సర్వాన్ని విషయాలుగా చూచే చైతన్యమే ఆత్మ, ఈ ఆత్మ ఎన్నటికీ విషయీకరింపబడదు, విషయి, విషయంగా మారటము అసంభవము. ఇలా అనడంలో ఆత్మ విచారణ చేయకూడదని అర్థము లేదు, నిజానికి ఆత్మ విచారణ చేయటం ఒక్కటే మనసును తన సహజ ధోరణి నుండి మళ్లించే ఏకైక మార్గం. అయితే గమ్యం మాత్రం నేను ఆత్మగా మారటం కాదు, నేనే ఆత్మను అని అనుభవములో ఉండటమే.
బ్రహ్మగా మారడం ఒక స్థితి కాదు... అదే అసలైన సహజ స్థితి ఉన్నదే అది. ఆత్మను ధ్యానముతో సాధించాలనే భమే మూడులను ఆ అనుభవం నుండి దూరంగా ఉంచుతుంది. జీవితాంతము వారు ధ్యానిస్తూనే ఉంటారు. అయినా వారిలోని అశాంతి తొలగిపోదు. వారి మనోబుదుల ప్రభావముతో బంధింపబడే ఉంటారు..🙏🙏🙏
No comments:
Post a Comment