Wednesday, October 22, 2025

 *మార్గదర్శకులు మహర్షులు -9*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి


*కపిలమహర్షి -2*

రావణుడు గొప్ప శివభక్తుడే. ఆయన లోకాలన్నీ తిరుగుతూ దేశదేశాలు పర్యటన చేస్తూ అనేకమందిని చూస్తూ, ఎక్కడన్నా పండితులు, భక్తులు ఉన్నారంటే వారితో వాదానికి కూడా దిగుతూ ఉండేవాడు. మహాపండితుడు. వేదవేదాంగవేత్త. తపస్వి. యోగి.

అప్పుడు దక్షిణసముద్రతీరంలో కపిలుడు ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉండగా, రావణుడు అతడిని చూసాడు. రావణుడికి ఉండేటటువంటి అహంకారాన్ని అణచటానికి వాగ్వివాదములలాంటివేమీ లేకుండా కపిలుడు తన విశ్వరూపాన్ని రావణుడికి చూపించాడు. రావణుడు ఆయనను అవమానించి, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడదామని దగ్గరికి వెళితే,
ఆయన మూసుకున్నటువంటి కళ్ళలోంచి అగ్నిశిఖలు బయటికి వచ్చాయి. రెండు బాహువుల లోంచి వందలాది ఆయుధము లు బయటికి వచ్చినట్లు కనిపించింది రావణుడికి. ఆయన శరీరంలో మరుత్తులు వసువులు, రుద్రరూపాలు చిత్రాతిచిత్రంగా భయంకరంగా కనబడ్డాయి. 

అంతేకాకుండా మరికొంత జాగ్రత్తగా చూస్తే, ఆయన హృదయంలో లక్ష్మీదేవి కొలువై కనబడింది. ఆయనను చూస్తుంటే ఆయన శరీరంలోపల ఎముకలు, వాటిలో మరుద్గణములు ఉన్నట్లు కనిపించింది. ఆయన కళ్ళల్లో సూర్యచంద్రులు, ముఖ మందు బ్రహ్మరుద్రాదులు అంతా కనబడ్డారు.

అప్పుడు రావణుడు, “ఈ ఋషులు మాయచేస్తారా! నేనే రాక్షసుణ్ణంటే నాకంటే వీళ్ళకు మాయలు ఎక్కువ తెలుసులా ఉంది. నన్నేదో భ్రాంతితో భయపెడదామని అనుకుంటున్నాడు ఆయన! ఇవన్నీ చూపిస్తున్నాడు. నేనేమీ భయపడేవాడిని కాను” అనుకున్నాడట. జ్ఞానమనేది వెంటనే రాదుకదా! అవివేకం వృద్ధిపొందు తూ ఉంది. అహంకారం ఉన్నచోట, ఏదైనా అహంకారాన్నే వృద్ధిచేస్తుంది. కానీ ఆ అహంకారాన్ని చంపగలిగిన శక్తి ఇంకొకటి లేదు. అహంకారం ఉండేవాడికి, యౌవనం అహంకారాన్ని వృద్ధి చేస్తుంది. అందులో కాస్తంత అందము, చందము ఉంటే వాడు దానివలన మరీ విర్రవీగిపోతాడు. కాస్త తెలివితేటలుంటే, అది ఆజ్యం పోసినట్లు ఇంకా అంతఎత్తున పెరుగుతుంది. భగ్గున మండుతుంది అహంకారం. కాస్త విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడంటే, అహంకారానికి ఆజ్యంపోసినట్లు ఇంకా పెద్దగా అగ్నిశిఖవలె మండుతుంది. ఏ మంచి వస్తువు లభించినా అంతే! భగవంతుడు స్వయంగా వచ్చి ఎదురుగా ఉంటే కూడా అతడిని తన అహంకారంతో అవమానించే ప్రయత్నంచేస్తాడు. ఇలాంటి అహంకారానికి ఈ సృష్టిలో మందులేదు. దాన్ని దురహంకారం అని అంటాము.

రావణుడికి అస్త్రసంపద అఖండంగా ఉందికదా! ఈ కపిలుడి మీదికి తన అస్త్ర శస్త్రములన్నీ ప్రయోగించాడు. అప్పుడు తన నిజ స్వరూపంతో మామూలుగా - మనిషిగా కపిలుడు మునిగా కనబడుతూ, దివ్యరూపాన్ని ఉపసంహరించుకుని లేచి - "ఓరి మూర్ఖుడా! నన్ను జయిద్దామని అనుకున్నావా! ఇది తీసుకో" అని ఒక పోటు పొడిచాడు పిడికిలితో, ఆ దెబ్బకు రావణుడు మూర్ఛపోయాడు. ఇతర దైత్య వీరులందరూ కూడా ఆయనమీదికి వచ్చారు. కపిలుడు వాళ్ళను హూంకరించే టప్పటికి వెళ్ళిపోయారు. అప్పుడు కపిలుడు తన తపస్సుకు భంగంలేకుండా ఉంటుందని ఒక కొండగుహలోకి వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు.

మూర్ఛతేలిన తరువాత రావణుడు తన అస్త్రశస్త్రములతో అతడిని జయిద్దామని లోపలికి వెళ్ళాడు. అక్కడ అనేకమంది దేవతలు, మహా వీరులు, దేవర్షులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా శంఖచక్రాది లక్షణములు కలిగి విష్ణువువలె చతుర్భుజు లై ఉన్నట్లు ఆయనకు కనిపించింది. ఇంకా లోపలికివెళితే అనేకమంది స్త్రీలు గాన నాట్యములతో సేవిస్తున్నారు ఆయనను. ఒక అపురూప సౌందర్యనిధి అయిన స్త్రీ ఆయన పాదసేవ చేస్తూ కనిపించింది. కపిలమహర్షి కనులుమోడ్చి విష్ణుమూర్తి లాగా నిద్రిస్తూ ఉన్నట్లు పడుకున్నాడు.

రావణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అనుమానం, క్రోధం అవమానించే టటువంటి దుర్బుద్ధి కొంచెం తగ్గి, సందేహం కలిగింది. విస్మితుడయ్యాడు. ఆశ్చర్యం కలిగింది. “నీ అపురూపచరిత్ర ఏమిటి? నీవు ఎవరివి?" అని అడిగాడట.

అప్పుడు కపిలుడు, “నేనెవరినో నీవు తెలుసుకోవయ్యా రావణా!” అని రావణుడి వధ భవిష్యత్తులో జరుగబో తోందని గ్రహించినవాడు కాబట్టి నోరు తెరిచి నోట్లో తన విశ్వరూపమంతా చూపించాడు. భూనభోంతరాలు, నక్షత్ర మండలము, లోకాలు, జీవులు, దేవతలు, అన్నీ ఒక్కమారు నోట్లో చూపించాడు. అప్పుడు అతడు విశ్వాత్ముడు అనే విషయం రావణుడు గ్రహించి; భయము, భక్తి రెండూ ఒక్కసారిగా కలిగి అతడిలో మార్పు వచ్చింది.

రావణుడు కపిలుడితో, "మహాత్మా! విశ్వాత్ముడు, పరమాత్ముడు ఎవరయితే ఉన్నారో ఆ సర్వాంతర్యామివి నీవే. నీలో అన్నీ ఉన్నాయి. నీవంటివాడి చేతిలో చనిపోవటంకంటే భాగ్యం మరొకటి లేదు" అని స్తోత్రంచేసి "నేను నా అంతఃకరణలో నిన్నే వెతుక్కుంటూ సమస్త లోకాలన్నీ తిరుగుతున్నాను. ఎవరియందు నేను శాశ్వతంగా ప్రవేశించాలో, ఎవరు నన్ను ఇంహరించి శాశ్వతంగా తనలోకి తీసుకుంటాడో అటువంటి వాడికోసం నేను
వెతుకుతున్నాను" అని స్తోత్రంచేసాడు. 

రావణుడు వైకుంఠంలో చిరకాలం నుంచీ విష్ణుసేవ చేస్తున్నవాడు. పరమభక్తాగ్రేసరు డు. శాపగ్రస్తుడై భూలోకానికి వచ్చినా, ఆ లోపల మూలలక్షణంగా అక్కడ బిందు స్థానంలో అతడికుండే టటువంటి విష్ణుభక్తి - మళ్ళీ విష్ణుపదం చేరదామనుకునేటటు వంటి ఆకాంక్ష ఆతడి మనసు, బుద్ధి, చిత్రాలకు తెలియకుండా లోపల ఉంది. అది అప్పుడప్పుడు ఆ చిత్తాన్ని ప్రేరణచేసి వెతికిస్తూ ఉంది పరమాత్మను. ఈయన దర్శనమవటంచేత ఆతడికి ఆ మాట లోపలినుంచీ వచ్చింది.

కానీ విష్ణుమాయచేత వెంటనే, కపిలుడు అంతర్థానమయిపోయాడు. గుహలో ఎవరూ లేరు. చాలాసేపు దీర్ఘాలోచనచేసి కాసేపు ధ్యానంచేసుకొని వెళ్ళిపోయాడట రావణుడు. అతనికి వాస్తవ పరిస్థితి అర్థంకాలేదు.

కపిలమహర్షి అవతారంలో ఆయన లోకానికి ఇచ్చింది 'సాంఖ్య తత్త్వము'. ఆ సాంఖ్యతత్త్వము భక్తియోగానికి కూడా ప్రాముఖ్యత నిచ్చింది. అంటే భక్తిని ప్రతిపాదించాడాయన. భక్తి అనేది మార్గమేనని ఆయన చెప్పటంచేత, కపిల మహర్షియొక్క అవతారము భక్తికి ప్రామాణ్యత నిచ్చినట్లయ్యింది. భక్తికి ప్రామాణ్యత ఏమిటి? కపిలమహర్షి యొక్క సాంఖ్యయోగమే భక్తికి ప్రామాణ్యత నేర్పరచింది.

ఇంకొక విషయమేమిటంటే, స్మతులన్నిటినీ ప్రమాణంగా తీసుకున్నాడాయన.. వాటికి ప్రామాణ్యాన్నిచ్చాడు. ఈశ్వరుడియొక్క అవతారమైనటువంటి కపిలుడు, సాంఖ్య తత్త్యాన్ని చెప్పటంచేత, భక్తిమార్గం కూడా చెప్పటంచేత ఆయా మార్గాలకు లోకంలో ప్రామాణికత రూఢి అయింది.

స్యూమరశ్మికి ఆయనచేసిన బోధవలన, వేదప్రామాణ్యబుద్ధి ఆయనయందుందని చెప్పవచ్చు. తండ్రితో తానే స్వయంగా చెప్పినట్లు, అవతారం ఎత్తి మునివేషం తీసుకున్నటువంటి పరమేశ్వరుడే కపిల మహర్షి. ఆయన స్మరణ ముక్తికి హేతువవుతుంది.
🪷
(రేపు మరొక మహర్షి గురించి చదువుదాం)
*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment