Wednesday, October 22, 2025

*****స్త్రీత్వం – చెదరని పోరాటం*

 *స్త్రీత్వం – చెదరని పోరాటం*
*ప్రతి స్త్రీ జీవితం ఒక పోరాటం. చెరిపివేయబడుతున్న ఆమె ఆడతనం, నిత్యం సమాజంలోని అంధకారాన్ని ఎదుర్కొంటూనే ఉంటుంది.*

*ఆ మౌనం వెనుక మంట:*

*ఎనిమిదేళ్ల వయసులో, పక్కింటి పెద్దమనిషి గట్టిగా బుగ్గ గిల్లిన బాధను... "అమ్మ తిడుతుందేమో" అనే భయంతో ఆ పసి ఆడతనం దాచుకుంది. పాఠశాలలో, కొందరు (గురువులు క్షమించాలి) కామంతో కూడిన పంతుల వెకిలి చేష్టలను... "ఇంట్లో తెలిస్తే చదువు ఆగిపోతుందేమో" అనే భీతితో మనసులోనే అణచివేసింది.*

*బజారులోని షాపువాడు, బస్సులోని కండక్టర్, వీధి చివరన గుమిగూడిన యువకులు, ట్యూషన్ మాస్టారు కొడుకు... ఇలా లెక్కలేనన్ని వేధింపులు! ఆ అవమానాలను కన్నీటితోనే దిగమింగుకుంటూ, స్త్రీత్వం ప్రతిరోజూ బతుకుతోంది.*

*అగ్నిగుండాల నడక:*

*ఈవ్ టీజింగ్‌ను మునిపంట నొక్కి, ర్యాగింగ్‌లకు దాసోహమై, అగ్నిగుండాల వంటి ఎన్నో సముద్రాలను దాటుకుని రావాలి ఈ "ఆడతనం".*

*ఉద్యోగంలో పై అధికారి తన దుర్బుద్ధిని బయటపెడితే... ఎక్కడ నింద తనపైనే పడుతుందోనని భయపడి, గుట్టుగా మందలించి మౌనం వహించింది.*

*చివరకు, జీవిత భాగస్వామి క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని సైతం భరించడంలో... ఆమె ఇంకా భూదేవి పాత్రనే పోషిస్తోంది. నిస్సహాయతకు మించిన* *సహనంతో, పురుషుని ఆగడాలను భరిస్తూ... ఆ స్త్రీత్వం తన లోపలే కుమిలిపోతోంది.*

*ఒక మారని గీత:*

*ఇన్ని భరిస్తూ కూడా... నుదుటి గీతను రాసే హక్కు ఎప్పటికీ భర్తదే అంటూ... అతడి ఆంక్షల లక్ష్మణ రేఖను చెరపలేనంటూ... చెదరిన మనసుతోనే, చేజారిన ఆశతో అదే బ్రతుకంటుంది. ప్రతి* *వయస్సులోనూ, ప్రతి దశలోనూ "స్త్రీత్వం" ఏదో ఒక రూపంలో క్రూరంగా చిదిమి వేయబడుతూనే ఉంది.*

*పరిష్కారం – తల్లిదండ్రుల పాత్ర:*

*ఈ నిస్సహాయతకు అడ్డుకట్ట వేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ఈనాటి బిజీ ప్రపంచంలో పిల్లలను హాస్టళ్లలో వదిలేస్తున్న తల్లిదండ్రులారా... వారిపై ప్రత్యేక దృష్టి పెట్టండి!*

*పిల్లలను మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. మనసువిప్పి మాట్లాడండి. వారి సమస్యలను తెలుసుకోండి. వారిని స్నేహంతో, ప్రేమతో అర్థం చేసుకోండి.*

*అప్పుడే... ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.*

No comments:

Post a Comment