Saturday, October 18, 2025

 కర్మలని తప్పించుకోవడానికి ప్రజలు అనేక పద్ధతులని అనుసరిస్తున్నారు. పూజలు వ్రతాలు నోములు జపాలు మంత్రాలు ఉపాసనలు దానాలు ధర్మాలు ఇంకా ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నారు.
ఇందులో ఒక ధర్మసూక్ష్మం ఉంది. కర్మ ధనుస్సు నుండి ప్రయోగించబడి లక్ష్యాన్ని చేరే శరం వంటిది. అది రాకుండా ఆపడం ఎవరి తరం కాదు. దానిని ప్రయోగించింది మన చేతులతో మనమేకదా.
ఐతే ఆ కర్మ ఎంత వేగం గా మన మీదికి దూసుకు వస్తున్నదో గమనించి, దానికి వ్యతిరేకం గా మన ఇచ్చాశక్తి అనే  మరో కర్మ  శరాన్ని ప్రయోగించి దానిని ఎదుర్కొనవచ్చు. కానీ దీని వలన దుష్కర్మలు చేసిన వారందరూ ఏదో విధంగా తప్పించుకోవాలని చూడవచ్చును.
ఈ ప్రయత్నం అంత సులభంగా నెరవేరే విషయం కాదు.
ఈ జన్మ లో రాబోయే కష్టాలని అనుభవిస్తున్న వేదనలని మనకి ప్రసాదించే నవగ్రహాలని వేడుకొని తప్పించుకోవాలని అందరూ ప్రయత్నిస్తుంటారు.
దీని వలన ఈ కర్మ ఫలాలన్నే కొంత ఆలస్యం గా అనుభవించవచ్చును.  లేదా మరో జన్మ లో అనివార్యం గా అనుభవించి తీరాలి.కానీ ఈ పూజల వలనమనకి తప్పకుండాచిత్త శాంతి మానసిక స్థైర్యం కష్టాలని ఎదుర్కొనే ధీరత్వం లభిస్తాయి.
మనస్సుని నిగ్రహించుకుని ఇంద్రియాలని స్వాధేన పరచుకుని ఆధ్యాత్మికత అన్వేషణ లో ఉన్న వారికి కర్మలని జయించే అవకాశం కలుగుతుంది.
మనం చేసుకున్న దుష్కర్మలు వస్తాయి కానీ మనం వాటిని చూసే దృక్పధమే వాటి వలన మనం పొందే వేదన ని నిర్ణయిస్తుంది.
మనం దీనికి ఒక వైద్య భాష లోని మత్తు  మందు ని ఉదాహరణ గా తీసుకోవచ్చును.
అనస్తీషియా అనే మత్తు మందుని శస్త్ర చికిత్స చేర్సేటప్పుడు నొప్పి తెలియకుండ ఉండటానికి ఇస్తారు. మనం కనుక భిన్న సమస్యల్లో చిక్కుకొని వేదనల్లో ఉన్నప్పుడు, భగవచ్చింతన ,జ్ఞానం భక్తి అనే అనస్థెషియా తీసుకుంటే ఈ వేదనలు ఏవీ మనలని బాధించవు.
ఆ జ్ఞానం తో మన కర్మలని మనం చూస్తున్నప్పుడు శత్రువులకి మిత్రులకి మనం పెద్దగా తేడా కనిపించదు. మనం గతం లో బాధించిన వ్యక్తులు ప్రస్తుతం మన కళ్ళకి శత్రువులుగా  గా కనిపిస్తూ, మనం చేసుకున్న కర్మల ఫలితాలని ఒక పళ్ళెం లో పెట్టి మనకి అందిస్తున్నారు.
వారి పట్ల మనకి కృతజ్ఞత తప్ప మరింకే భావముండాలి. అలా కాకుండా వారి పైన మళ్ళీ మనం శతృత్వం ప్రకటిస్తే ఈ కర్మ వచ్చే జన్మ కి కూడా కొనసాగుతుంది.
ఈ కారణం వల్లనే కొందరిని చూడగానే క్రోధం లేదా భయం లేదా శతృత్వం మనలో కలుగుతుంటాయి. మరికొందరిని చూడగానే ప్రేమ వాత్సల్యం  పొంగి పొర్లుతుంటాయి.
గతం లో గాఢం గా ప్రేమించుకున్నవారే ఈ జన్మ లో తిరిగి  ఎంతో ప్రేమ ఆకర్షణ లకి లోనూ అవుతారు.ప్రేమ ఋణం రెండు సంబంధ బాంధవ్యాలని కలిగిస్తాయి.
అందుకే :ఋణానుబంధరూపేణ పశుపత్నీ సుతాదయ అన్నారు. భార్య పిల్లలు సంపదలు విద్యలు భోగాలు పేదరికం అన్నీ గతం లోని కర్మ రూపమే.
మనం అనుభవిస్తున్న కర్మ స్వరూపాన్ని జ్ఞాన దృష్టి తో మనం పరిశీలించాలి.
ప్రతి దుష్కర్మ వేదన బాధ శతృత్వం మనకి ఎన్నో పాఠాలని నేర్పుతున్నాయి.వేదన అనుభవించక పోతే మనం దానికి ప్రతిగా ఏ సాధన చేయం . కష్టాలు వచ్చాయని దుఖిస్తూ కూర్చుంటే వర్తమానం భవిష్యత్తు కూడా పోతాయి.
మనలో ఉన్న మానసిక నైతిక శక్తులు కూడా ఆవిరి అయిపొతాయి.పాండవులు అరణ్యాలకి వెళ్లినప్పుడు దుఖిస్తూ కూర్చోలేదు. తమ సర్వశక్తులనీ శతాధికం చేసుకున్నారు.
అర్జునుడు పరమేశ్వరుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. భీముడికి ఆంజనేయస్వామి దర్శనం కలిగింది .ఆంజనేయస్వామి స్వయం గా అర్జునుడి రధం ధ్వజం లో ప్రవేశించాడు.
ధర్మం తప్పని పాండవులకి శ్రీ కృష్ణుడు అడుగు అడుగునా తోడు నిలిచాడు. ధర్మ రాజు  శకుని తో జూదం ఆడుతున్నప్పుడు శ్రీ కృష్ణుడు తను ఆ జూదం లో పాల్గొన లేదు.వస్త్రాపహరణ సమయం లో  ద్రౌపదికి చీర మాత్రమే ఇచ్చాడు.
పాండవులు అరణ్యాలకి వెళుతుంటే శ్రీ కృష్ణుడు ఇది వారి ప్రగతికి అవసరం అని చూస్తూ ఊరుకున్నాదూ..కష్టాల్ని ఎదుర్కొనే సాహసం ధైర్యం వారికి అరణ్యాలకి వెళితేనే కలిగింది.
పాండవులు ప్రతిక్షణం దైవాన్ని మనస్సులో నిలుపుకున్నారు, ప్రచండ సాధన చేశారు. అందుకే కుంతి దేవి శ్రీ కృష్ణుడు వరం కోరుకోమని అడిగినప్పుడు నిత్యం నాకు కష్టాలే ఇమ్మని అడిగింది.          

No comments:

Post a Comment