Monday, October 27, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

    'శ్రీరామకృష్ణ మఠం' ప్రతినెల ప్రచురించే 'శ్రీరామకృష్ణ ప్రభ' అనే మాస పత్రికలో ఒక వ్యాసం చదువుతున్నారు మహర్షి. 
    
   కొత్తగా కనుగొన్న ఒక కాంతి కిరణాన్ని మహర్షి వర్ణించారు. ఆ కాంతిని ప్రసరింపజేస్తే, ప్రసరింప చేసేవాడు కనిపించడు కాని ప్రసరింప చేసేవాడు ఆ దృశ్యాన్ని చూడగలడు. అట్లాగే సిద్ధపురుషులు కూడ. 
   
    సిద్ధ పురుషులు దివ్యకాంతి స్వరూపులు. సిద్ధుపురుషులు ఇతరులను చూస్తారేగాని ఇతరులు ఆ సిద్ధపురుషులను చూడలేరు.
      
    తర్వాత మహర్షి యథాలాపంగా ఒక కథను ఇలా సెలవిచ్చారు ....
       
   గోరఖ్ నాదన్ ఉత్తర భారతదేశ యాత్ర చేస్తూ  మత్స్యేంద్రుని కలుసుకున్నాడు. వారు ఇరువురు తమ తమ యోగసిద్ధులను ప్రదర్శించారు. 
    
   గోరఖ్ నాదన్ తన ఖడ్గంతో తన చేతిని తెగవేయబోతే కత్తి మొక్కవోయిందేగాని చేతికి ఇసుమంతైనా గాయం కాలేదు. దీన్ని కాయసిద్ధి అని అన్నారు.
    
    అదేవిధంగా మత్స్యేంద్రులు ఆ కత్తిని తనపై ప్రయోగించమన్నాడు. ఎన్నిసార్లు ఎన్నిదిశలుగానో కత్తి వారి దేహాన్ని ఈ కొసనుంచి ఆ కొసకు గాలిని నరికినట్లు నరికిందిగాని మత్స్యేంద్రుల దేహంలో ఎటువంటి గాయమూ కనబడలేదు. 
    
   గోరఖ్ నాధుల ఆశ్చర్యం హద్దులు దాటింది. ఆతడు తక్షణం మత్స్యేంద్రునికి శిష్యుడు అయ్యాడు.

No comments:

Post a Comment