7️⃣9️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*33. సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతేర్జ్నా నవానపిl*
*ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతిll*
ఎవరు ఎంతటి చదువు చదివినా, ఎంతటి జ్ఞానం సంపాదించినా, వాడు తన ప్రకృతి సహజమైన గుణములకు అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. మానవులే కాదు సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమములను అనుసరించి ప్రవర్తిస్తున్నాయి. అటువంటప్పుడు మానవునికి సహజగుణములను నిగ్రహించడం వలన, ప్రకృతి స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వలన మానవుడు ఏమి చేయగలడు? అని ఒక ప్రశ్నవేసాడు పరమాత్మ.
ఈ శ్లోకంలో జ్ఞానవానపి అంటే మానవులు తమ తమ శక్తిసామర్ధ్యాలను అనుసరించి, తెలివి తేటలను అనుసరించి విద్యాభ్యాసం చేస్తారు. పెద్ద పెద్ద డిగ్రీలు పొందుతారు. గొప్ప గొప్ప విద్యావేత్తలు, జ్ఞానులు అనిపించుకుంటారు. ఇక్కడ లౌకిక విద్యలు అంటే ధనసంపాదనకు పనికి వచ్చే విద్యలను అభ్యసించి, వాటిలో నిష్ణాతులు అనిపించుకున్న వారే జ్ఞానులు అని అర్థం. ఎంతటి పండితుడైనా, ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా, కర్మల విషయాలకు వచ్చేటప్పటికి ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. తన పూర్వజన్మ సంస్కారములను వదిలిపెట్టడు. బాగా చదువుకొని, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారు, స్త్రీలోలురుగా ఉండటం, ఏమీ చదువుకోని వాడు, కటిక పేదవాడు, నీతిమంతుడుగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి అందరూ తమ తమ పూర్వజన్మ సంస్కారములను బట్టి, ప్రకృతి స్వభావములను బట్టి ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రకృతి లక్షణాలను స్వభావాలను నిగ్రహించడం అంటే అణిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కారణం చేత నీ ప్రకృతి సహజ లక్షణమైన క్షాత్రాన్ని అణిచిపెట్టడం నీకూ సాధ్యం కాదు. దాని వలన నీకు అశాంతి తప్ప వేరేమీ మిగలదు.
ఈ శ్లోకం మనస్తత్వశాస్త్రమునకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక ప్రాధమికమైన తత్వము ఉంటుంది. అది సత్వ, రజస్, తమో గుణముల కలగలుపుగా అయిఉంటుంది. ప్రతి జీవి దానికి లోబడి ప్రవర్తించాలి. అది ప్రకృతి ధర్మము. దానిని ఎవరూ మార్చలేరు. (చాలా మంది తమలో ఉన్న అసలు లక్షణాలను దాచి పెట్టి, పైకి మాత్రం మంచి వారుగా, నీతిమంతులుగా కృత్రిమంగా నటిస్తుంటారు.) మానవుడు పైకి ఎంత కృత్రిమంగా ప్రవర్తించినా, అతని సహజలక్షణం మాత్రం అంతర్లీనంగా ఉంటుంది.
మానవుడు తన సహజ లక్షణములను అనుసరించి ప్రవర్తిస్తే అతని జీవితం తృప్తిగా నడుస్తుంది. ఆ దిశగానే అతని పూర్వజన్మ సంస్కారాలు కూడా నడుస్తాయి. కాని ఎవరైనా తన సహజ లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతని జీవితంలో ఏదో వెలితి. ఈ వెలితి అతని అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నిర్వేదం రూపంలో బయట పడుతుంది. అది తీవ్రమైతే ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుంది. దీనిని ఇక్కడ అర్జునుడికి అన్వయిస్తున్నాడు కృష్ణుడు.
అర్జునుడి స్వభావము రజోగుణముతో కూడినది. అంటే క్షాత్రము. యుద్ధం చేయడం ధర్మాన్ని కాపాడడం, ప్రజలను కాపాడడం క్షత్రియుని ధర్మం, అర్జునా! నీ ధర్మం నీవు చేస్తే నీ జీవితంలో పరిపూర్ణత లభిస్తుంది. దానిని వదిలిపెట్టి నీవు అన్నట్టు భిక్షాటన చేస్తాను సన్యాసిని అవుతాను అంటే అది నీ ప్రకృతి సహజ లక్షణాలకు విరుద్ధము. నీలో ఉన్న క్షాత్రము నిన్ను ఆ పని చేయనివ్వదు. ఒకవేళ నీవు చేసినా, నీకు అశాంతి తప్పదు. ప్రకృతి సిద్ధమైన లక్షణాలు ఇలా ఉంటే, నేను నా ప్రకృతి లక్షణాలను నిగ్రహిస్తాను అంటే ఏమి ప్రయోజనము? దాని వలన నీకు ఏం లాభం. నీ క్షేత్రాన్ని నిగ్రహించి, వేరే లక్షణాలు అవలంబించినందు వలన, నీకు అశాంతి తప్ప మరేమీ మిగలదు. కాబట్టి నీ ప్రకృతి సహజమైన లక్షణాలను అణిచిపెట్టడానికి ప్రయత్నించవద్దు. అని బోధించాడు కృష్ణుడు.
కాని ఇక్కడ అందరికీ ఒక సందేహము వచ్చే అవకాశం ఉంది. అది ఏంటంటే, ప్రతి వ్యక్తి, అతడు జ్ఞాని అయినా సరే, అజ్ఞాని అయినా సరే, తన సహజ లక్షణములను అనుసరించి, సత్వ రజస్తమోగుణములను అనుసరించి, పూర్వజన్మ వాసనలను అనుసరించి ప్రవర్తించవలసిందే కానీ, వేరే మార్గంఏమీలేదు అంటున్నారు. మరి చెడు లక్షణములు ఉన్న వాడు బాగుపడే అవకాశమే లేదా! వాడు జన్మజన్మలకు అలా ఉండి పోవలసిందేనా! అని అందరికీ సందేహమురావచ్చు. దానికి సమాధానమే ఈ కింది శ్లోకము.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P196
No comments:
Post a Comment