ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒకసారి మహర్షి దర్శనానికి మైసూరు మహారాజుగారు వచ్చారు. ఎన్నో పళ్ళాలలో ఎన్నో పదార్థాలు తెచ్చి మహర్షికి సమర్పించారు.
మహారాజుగారు పది నిమిషాలు నిలబడి అలాగే మహర్షి వంక చూస్తూ వుండి చప్పున మహర్షి కాళ్ళు పట్టుకున్నారు. ఆయన కళ్ళ వెంబడి ధారలు మహర్షి పాదాలకి అభిషేకం చేశాయి.
"భగవాన్! నన్ను ఓ మహారాజా! అని కూచోపెట్టారు. అందువల్ల నేను మీవద్ద ఒక సేవకుడినయ్యి మీ సేవ చేసే భాగ్యం నాకు లేకపోయింది. ఇక్కడ వుండటానికి వీలులేదు. మళ్ళీ మిమ్ము చూడటానికి రానూలేను. ఈ పది నిమిషాల్లో నాకు సంపూర్ణ అనుగ్రహం దయచెయ్యండి!" అని మహర్షితో ఎంతో దీనంగా వేడుకున్నారు. అంతే. వెళ్ళిపోయారు.
తరువాత కొద్ది రోజులలో తిరువాన్కూరు మహారాణి వచ్చారు ఆశ్రమానికి. ఆమెకోసం రోడ్లన్నీ బందోబస్తు చేశారు. ఆమె వచ్చి మహర్షిని ఎన్నో ప్రశ్నలడిగి వెళ్ళింది.
ఆశ్రమ భక్తులు, మహర్షితో "భగవాన్! తిరువాన్కూరు మహారాణి వచ్చారు కదా!ఏమన్నారు?" అని అడిగారు. అందుకు మహర్షి "ఆ, ఆ! ఏదో వచ్చిందిలే! ప్రశ్నలు అడిగి వెళ్ళింది! అంతకన్న ఏముంది?" అని సెలవిచ్చారు.
మరి "మైసూరు మహారాజుగారు కూడా వచ్చారు కదా! మరి వారు ఏమన్నారు భగవాన్?" అని ఆశ్రమ భక్తులు అడిగారు.
అందుకు “ఆహా ! వారికేమి? పండిన పండు. వారి మాటలూ, నమ్రతా, ఆపుకోలేని వారి దుఃఖమూ ..... సరి సరి" అని ఎంతో కదిలిపోయి మాట్లాడారు మహర్షి.
No comments:
Post a Comment