Wednesday, October 22, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఆశ్రమానికి వచ్చిపోయే ఒక డాక్టర్ గారి భార్య, తన బిడ్డను కడుపులో మోసేటపుడు, ఏదో తెలియని వ్యాధి ప్రభావం వలన తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉండేది. ఇక ఆమె బ్రతకదని తెలిసి ఆమెను ఊరునుంచి ఆశ్రమానికి తీసుకువచ్చారు. 

  ఆశ్రమంలో వంటచేసే సేవకురాలికి దేశవాళీ మందుల వాడకం తెలుసు. ఆమె నాడిని పరీక్షించి, కొన్ని నిమిషాల్లో కళ్ళు మూస్తుందని భావించి, మహర్షి చెంతకు వెళ్ళి 'భగవాన్! మన డాక్టర్ గారి భార్య చనిపోయింది!' అని అన్నది. 

     అందుకు మహర్షి "ఆమె పోయిందని నీకెలా తెలుసు?" అని అన్నారు. అందుకు ఆశ్రమ సేవకురాలు "నేను ఆమె నాడి చూసాను భగవాన్. ఆమె ఖచ్చితంగా చనిపోయిందని తెలుసు" అని అన్నది.

  మహర్షి, తన అరచేతిని చెంపమీద ఉంచుకొని “అవునా! ఆమె పోయిందా!" అని అన్నారు.

  ఆమె బంధువులంతా ఏడుస్తూ ఊరినుంచి పరిగెత్తుకొచ్చారు. ఆమె భర్త(డాక్టర్) మాత్రం
మహర్షి ఫోటో ముందు కూర్చుని మహర్షిని ప్రార్థిస్తున్నాడు.

   అటువంటి విచారంలో, అయోమయ అవస్థలో ఆమె కళ్ళు తెరచి, చుట్టూ వుండే ఉద్వేగ వాతావరణాన్ని గమనించి, ప్రశాంతంగా “ఏమిటి ఇదంతా?' అని ప్రశ్నించింది.

    చివరకు మహర్షి అనుగ్రహముతో బ్రతికి బట్టకట్టిందని తెలుసుకొని, ఇదంతా మహర్షి కృప తప్ప మరేమీ కాదని ఆమె, ఆమె బంధువులు ఆనందించారు.

No comments:

Post a Comment