7️⃣4️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*27. ప్రకృతే: క్రియ మాణాని గుణై: కర్మాణి సర్వశ:l*
*అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతేల్*
*28. తత్వవిత్తు మహాబాహోూ గుణకర్మవిభాగయో:l*
*గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతేll*
ఓఅర్జునా! మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ మూడు గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను. నా వలననే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు. కాని గుణముల యొక్క తత్వమును కర్మల యొక్క స్వభావమును తెలిసిన జ్ఞాని, ప్రకృతిలో ఉన్న మూడు గుణములు తనలో ఉన్న మూడు గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకొని, ఆ గుణముల యందు, వాటి ప్రభావమునందు ఎటువంటి ఆసక్తి చూపించడు. నిర్తిప్తతగా ఉంటాడు.
ఈ శ్లోకంలో పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ, అసలు అజ్ఞాని ఈ విధంగా కామ్య కర్మలు, సకామ కర్మలు, స్వార్ధముతో కూడిన కర్మలు చేయడానికి కారణం ఏమిటి అనే విషయం చెబుతున్నాడు. ఈ ప్రకృతి సత్వ, రజస్, తమోగుణములతో నిండి ఉంది. మానవుడు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే కాబట్టి మానవునిలో కూడా ఈ మూడు గుణములు ఉన్నాయి.
అందువలన మానవుడు ఈ మూడు గుణముల కలయికతో కూడిన ప్రభావంతో సమస్త కర్మలు చేస్తున్నాడు. అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరమే నేను. ఈ కర్మలు అన్నీ నేను, నా కోసం చేస్తున్నాను అనే అహంకారంతో కర్మలు చేస్తున్నాడు. ఎవరి అంతః కరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో, అటువంటి వాడు, 'ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరం, నేనే ఈ కర్మలు చేస్తున్నాను ఈ కర్మల ఫలితం నేను అనుభవిస్తున్నాను. నాకు ఈ కర్మల వలన సుఖం ఆనందం కలుగుతూ ఉంది' అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు. నేను ఈ కర్మలు అన్నీ చేస్తున్నాను అనే అహంకారం అతనిలో పాతుకుపోతుంది. వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని, ఏమీ తెలియని వాడు అని అంటారు.
దీనిని కొంచెం వివరంగా తెలుసుకుందాము. ఈ ప్రకృతిలో ఇరవైనాలుగు తత్వాలు ఉన్నాయి. పంచ భూతములు, పంచ తన్మాత్రలు, పది ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ ఇరవై నాలుగు తత్వములు, ప్రకృతిలో ఉన్న మూడు గుణములకు లోబడి పనిచేస్తుంటాయి. మనకు కనపడే ప్రపంచము, మన దేహము, మనస్సు, బుద్ధి, సమస్తము ప్రకృతి నుండి పుట్టినవే. ప్రకృతి నుండి పుట్టిన ఈ దేహము, ఈ రూపము, ఇంద్రియములు, మనస్సు వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తున్నాడు. ఆత్మ ఏ కర్మాచేయదు. చేయవలసిన అవసరం లేదు. అది చైతన్యస్వరూపము. కాబట్టి ఈ కర్మలకు అన్నింటికీ దేహము, ఇంద్రియములు, మనస్సు, కారణము, ఇక్కడే ఒక చిక్కు. ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహము అని అనుకుంటున్నాడో, ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను నేనే వీటికి కర్తను అనే భ్రమలో ఉంటాడో, అప్పుడు ఆ కర్మల వలన లభించిన ఫలితములను అనుభవిస్తున్నాడు. వాసనలను మూటగట్టుకుంటున్నాడు. మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఇది అజ్ఞానము యొక్క లక్షణము. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేహమే నేను ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనడం అజ్ఞాన లక్షణం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉంది. అజ్ఞాని అన్నీ తానే చేస్తున్నాను అని అనుకుంటాడు. దాని వలన వచ్చే సుఖదు:ఖాలను అనుభవిస్తుంటాడు. జ్ఞాని తాను ఆత్మ స్వరూపుడను. ఈ దేహం నాది కాదు, ఈ కర్మ దేహం చేస్తూ ఉంది నేను కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. కర్మల వలన లభించే సుఖదుఃఖాలకు అతీతంగా, నిరంతరం ఆనందంలో ఉంటాడు.
ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాము. మనకు బయటకు పది ఇంద్రియములు కనిపిస్తున్నాయి. కాని కనిపించకుండా మనసు, బుద్ధి ఉన్నాయి. ఈ రెండు కలిసి అహంకారము అని అంటారు. ఇది మనకు కనిపించదు కానీ మన వ్యక్తిత్వం ద్వారా వ్యక్తం అవుతుంది. దీని కన్నా శ్రేష్టమైనది మరొకటి ఉంది. అదే మన అసలైన తత్వము ఆత్మ తత్వము. దానినే చైతన్యము అని కూడా అంటాము. ఈ ఆత్మకు దేహానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ ఆత్మ మనలో ఉన్న మనస్సుకు, బుద్ధికి, ఈ రెండింటితో కూడిన అహంకారానికి, పంచ తన్మాత్రలకు, పది ఇంద్రియములకు చైతన్య శక్తిని ఇస్తుంది. అన్నీ పనిచేసేటట్టు చేస్తుంది. ఉదాహరణకు, మనం ఒక దీపం వెలుగులో ఎన్నో వస్తువులను చూస్తుంటాము. దీపం వెలుగు వస్తువుల మీద పడి వాటిని సమానంగా ప్రకాశింపచేస్తుంది. కాని దీపానికి వస్తువులకు ఎటువంటి సంబంధము లేదు. దీపము మంచి వస్తువులను, చెడ్డ వస్తువులను రెండింటినీ సమానంగా ప్రకాశింపచేస్తుంది. ఆ దీపము వెలుగులో మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, అక్రమాలు, అన్యాయాలు, నేరాలు చేసినా, తన ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. అలాగే ఆత్మకూడా. దేహము, ఇంద్రియములు, మనస్సు తమ పనులు తాము నిర్వర్తించడానికి ప్రాణశక్తిగా ఉపయోగపడుతుంది కానీ వాటితో ఎటువంటి సంబంధము పెట్టుకోదు. విలక్షణంగా ఉంటుంది. సత్ స్వరూపము ఆత్మ అయితే అసత్ స్వరూపము మనస్సు, బుద్ధి, శరీరాలు.
మనోబుద్ధిఅహంకారాలు నశిస్తే అసలైన తత్వము ప్రకాశిస్తుంది. ఈ మనో బుద్ధి అహంకారాలు అడ్డం ఉన్నంతవరకు మన అసలు స్వరూపము మనకు తెలియదు. ఈ అహంకారము మనలను ఆవరించి ఉన్నంతవరకు అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన మనలో కలుగుతుంది. ఈ దేహమే నేను అని అనుకుంటాడు. దేహానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇతరుల దేహాలతో మిత్రత్వము శత్రుత్వము పెంచుకుంటాడు. సుఖము దుఃఖము అనుభవిస్తుంటాడు. సంసార సాగరంలో పడి మునుగుతూ తేలుతూ ఉంటాడు. వాడిని అహంకార విమూఢుడు అని అన్నాడు పరమాత్మ. అంటే మూర్ఖులలో పరమ మూర్ఖుడు అని అర్ధము. ఈ మూఢత్వము, అహంకారము అంతరిస్తే, ఆత్మజ్ఞానము కలుగుతుంది.
ఆత్మ తత్వము తెలిసిన జ్ఞానికి గుణములు వాటి ద్వారా చేసే కర్మల యొక్క విభజన స్వభావము బాగుగా తెలుసు, జ్ఞానికి కూడా శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటి వలన వచ్చే నేను అనే అహంకారము ఉంటాయి. కాని అది సాత్వికాహంకారము. ఆ సాత్వికాహంకారము జ్ఞానికి అలంకార ప్రాయంగా ఉంటుంది కానీ జ్ఞానిని మోహంలో ముంచదు. పాములు ఈశ్వరుడికి అలంకారము. వేయిపడగల పాము విష్ణువుకు పడక అదే విధంగా భయంకరమైన మోహానికలిగించే అహంకారము జ్ఞానికి అలంకారంగా శోభనిస్తుంది. ఆ జ్ఞాని లోపల ఉన్న సత్వరజస్తమోగుణములు ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమోగుణములతో ప్రవర్తిస్తుంటాయి. కాని, జ్ఞాని ఆ గుణముల వలన కానీ, ఆ గుణముల చేత చేయబడే కర్మల వలన గానీ ప్రభావితుడు కాదు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. చూపు వేరు చూచే వస్తువు వేరు చూచే శక్తి వేరు. కేవలం కళ్లు ఉన్నంత మాత్రాన చూడలేడు. లోపల చూచే శక్తి ఉండాలి. అది చూడు అనే ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ గుణముల వలనకలుగుతుంది. అందువలన చూడాలనే ప్రేరణ, చూచే శక్తి, కళ్లు, కలిసి పనిచేస్తేనే ఒక వస్తువును చూడగలము. దానికి ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయం తెలుసుకోవాలి. చూచేది శరీరము చూడబడేది ప్రకృతి లో ఉండే వస్తువు.
ఇవి అన్నీ వేరు నేను కాదు, అని తెలుసుకున్న వాడు ఆ కార్యమునకు లోబడడు. ఆ చూచిన వస్తువును కోరుకోడు. దానితో సంగమము పెట్టుకోడు, అనాసక్తంగా నిర్వికారంగా చూస్తుంటాడు. కాని అజ్ఞాని ఆ వస్తువు మీద మమకారంతో ఆసక్తితో చూస్తుంటాడు అదే తేడా. ఆ సంగమము మమకారమే లేకపోతే ఆత్మజ్ఞానము దానంతట అదే వస్తుంది. అలా కాకుండా దేహమే నేను, అన్నీ నేనే చేస్తున్నాను నేను చూస్తున్నాను, అది బాగుంది. అది నాకు కావాలి అనే ఆసక్తి కలవాడు సంసారములో పడి కొట్టుకుంటూ ఉంటాడు.
కాబట్టి ప్రపంచములో కనపడే ప్రతి వస్తువు మీద మమకారము ఆసక్తిని వదిలాలి. ఎంత వరకు అవసరమో అంతవరకే సమకూర్చుకోవాలి. అనవసరమైన వాటి జోలికి పోకూడదు. ఇది చాలదు ఇంకా కావాలి అనే బుద్ధి వదిలిపెట్టాలి. ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకోవాలి. తనలో ఉన్న గుణములు బయట ప్రకృతిలో ఉన్న గుణములతోకూడి విహరిస్తున్నా, బాహ్యప్రపంచములో ఉన్న విషయములు ఎంత ప్రలోభపెడుతున్నా వాటి ప్రలోభాలకు లోను కాకూడదు. దానికి ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము కావాలి. ఈ సంసార చక్రము నుండి బయట పడటానికి ఇదే చక్కటి ఉపాయము.
(సశేషం)
*🌹 యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P187
No comments:
Post a Comment