*చీకటిలో చిరుదివ్వె*
ఈత రానివాడు నీటిలో పడితే మునిగిపోక తప్పదు. కానీ చిన్న కర్రపుల్ల పట్టు దొరికినా దాన్ని ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం మాత్రం మానడు. పుట్టిన ప్రతి జీవీ మనుగడ కోసం పోరాడుతూనే ఉంటుంది... ఉండాలి కూడా. సవాళ్లు ఎదురైనప్పుడు అంధకారంలోకి అగాధాల్లోకి కూరుకుపోయినట్లు అనిపించడం సహజం. ఆ సమయంలో చిన్న ఆధారం దొరికినా ఊరటనిచ్చి మనోధైర్యాన్ని పెంచుతుంది. సన్నని వెలుగు రేఖలాంటి ఆ మనోధైర్యమే మనుగడకు తిరిగి ప్రాణం పోస్తుంది.
రావణుడు తనను అపహరించి తీసుకునిపోతున్నప్పుడు సీతాదేవి దుఃఖంతో కుంగిపోయింది. ‘నా స్వామికి నా జాడ తెలియచేసే మార్గమేదీ కనిపించడం లేదు!’ అని దీనంగా విలపించింది. చుట్టూ అంధకారం అలముకున్నట్టయి మనోధైర్యాన్ని కోల్పోయింది. కానీ రావణుడితో పోరాడి శ్రీరామకార్యంతో తన సర్వస్వాన్ని పరిత్యాగం చేయడానికి సిద్ధపడిన జటాయువు, సీతమ్మ మనసును చుట్టుముట్టిన దుఃఖమనే చీకటిని చీల్చే చిరుదివ్వెగా కృతార్థుడయ్యాడు.
ఒక మూగ వ్యక్తి రోజూ నదిని దాటివెళ్లి అటువైపు ఉన్న అడవిలో కట్టెలు కొట్టి తెచ్చుకునేవాడు. ఒక రోజు ఓ చెట్టును నరకబోయేంతలో పొదల చాటున మాటువేసిన ఎలుగు వచ్చి దాడి చేసింది. ఆపద నుంచి తప్పించి ఆదుకోమని అరుద్దామంటే అతడికి మాట రాదు. అక్కడికి దగ్గర్లోనే ఓ వేటగాడు వేటాడుతున్న శబ్దాలు వినబడుతున్నాయి. కానీ ప్రాణాపాయం గురించి అరచి చెప్పేందుకు అవకాశం లేక ఆ వ్యక్తి కుంగిపోయాడు. ఇంతలో అతడు ఏ చెట్టునయితే నరకబోయాడో, ఆ చెట్టుతొర్రలో తన గుడ్లను పొదిగి, ఆహారాన్వేషణకు వెళ్లిన ఓ పక్షి తిరిగి వచ్చింది. పరిస్థితి అర్థమై గుండ్రంగా పైన తిరుగుతూ గట్టిగా అరచి గోల చేయసాగింది. ఆ పక్షి కూతలకు వేటగాడు గబగబా అటువైపు వచ్చాడు. ఎలుగు పైకి బాణాలు వేశాడు. అది పారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే- వేటగాడి వల్ల తనకు ప్రమాదం ఉందని తెలిసినా ఆ పక్షి, ఎలుగు బారినుంచి ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేసింది. అదే సమయంలో తనకూ తన పిల్లలకూ ఆశ్రయం ఇచ్చిన చెట్టును కాపాడుకోగలిగింది.
ఆపత్కాలంలో ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మపై భారం వేసి కాపాడమని అర్థిస్తే, సన్నటి వెలుగురేఖనైనా ప్రసరింపజేస్తాడు. ఆ వెలుతురులో మనం కష్టం నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి. మనోధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసినవాడే ఏ ఆపద నుంచైనా గట్టెక్కగలుగుతాడు. పిరికితనాన్ని జయించి, నిబ్బరంతో నిలబడిన వారికే మనుగడ సుగమం అవుతుంది. చుట్టూ అంధకారం అలముకున్నా సరే, మనసులో చీకట్లు కమ్ముకోకుండా అదుపు చేసుకోగల శక్తిని ఆ భగవంతుడే ఇస్తాడు. కావాల్సిందల్లా మన మీద మనకి, ఆయనమీద మనకి... నమ్మకమే!.
~వేలూరి ప్రమీలా శర్మ
No comments:
Post a Comment