Thursday, October 2, 2025

 భగవాన్ రమణులు
భక్తుడు: “ఒక వ్యక్తికి పలువురు ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చునా?”
మహర్షి : గురువు ఎవరు? ఎన్ని చెప్పినా సరే చివరకు గురువు ఆత్మయే. మనస్సు యొక్క పరిణితిని బట్టి ఆత్మ బయట గురువుగా వ్యక్తమౌతుంది. పురాతనుడూ, ప్రసిద్ధుడూ అయిన అవధూత యోగి (దత్తాత్రేయులు) తనకు ఇరవై నలుగురు కంటే ఎక్కువ గురువులు ఉన్నారని చెప్పారు. ఎవని నుండి మనము ఏదైనా నేర్చుకొనగలమో అతడే గురువు. అవధూతకు (దత్తాత్రేయులుకు) ఉన్నట్లు ఒకప్పుడు
జడము (అచేతనము) కూడా గురువు కావచ్చు. ఈశ్వరుడూ, గురువూ, ఆత్మ అన్నీ ఒకరే.
ముముక్షువు (మోక్షము కోరేవాడు) ఈశ్వరుని (భగవంతుని) సర్వవ్యాపకునిగా భావించి, ఈశ్వరునే గురువుగా గ్రహిస్తాడు. కొంత కాలానికి భగవంతుడే వానికొక సశరీర గురువును సమకూరుస్తాడు. సాధకుడు ఆ మనుష్యునే సర్వమయునిగా గ్రహిస్తాడు. చివరకు ఆ సాధకుడు గురువు అనుగ్రహం వలన తన ఆత్మయే (అంటే తనే) సత్యవస్తువనీ, దానికి అన్యముగా ఏదీ లేదనీ తెలుసుకుంటాడు.    

No comments:

Post a Comment