Thursday, November 20, 2025

 *కనిపించే దేవుడు* 

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా! కటికచీకటి, నక్కల ఊళలు, గుడ్ల గూబల అరుపులతో భయంకరంగా వున్న ఈ శ్మశానంలో వైఫల్యాలు పొందుతూ కూడా పట్టు విడవని ລໍ వజ్రసంకల్పం మెచ్చదగిందే. కాని ఒకవేళ నీ ప్రయత్నంలో విజయం సాధించినా, ధీర వ్రతుడు లాగా వివేకం సహనం లేనివాడివైతే, ఫలితం నీకు దక్కకుండా పోతుంది. ఇందుకు ఉదాహరణగా అతడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను." అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వకాలంలో గోదావరి నదికి సమీపంలో ఉన్న దట్టమైన అడవిలో అనే ఒక మహాముని ఉండేవాడు. ఆయన భగవంతుడిని దర్శించుకోవాలనే తపనతో తీక్షణంగా తపస్సు చేసేవాడు.

ఆయన తపస్సు ఎంత కఠినమైనదంటే వర్షాలు కురిసినా, ఎండలు మండినా, తుఫానులు వచ్చినా ఆయన తన స్థానాన్ని వదలలేదు. ఆయన చుట్టూ కాలక్రమేణా పెద్ద చీమల పుట్ట పెరిగింది. ఆయన ముఖం, మెడ భాగం తప్ప శరీరమంతా చీమల పుట్టతో కప్పబడింది. ఆ చీమలు ఆయన శరీరమంతా తిరుగుతున్నా, ఆయన కళ్ళు తెరవకుండా స్థిరంగా తపస్సు కొనసాగించాడు.

అంతటి ఉగ్రతపస్సు చేస్తున్న ఆ మహాముని శిరస్సుపై ఒక పావురం _వచ్చి గూడు కట్టుకుంది. అది గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగి, వాటికి ఆహారం తెచ్చి పెట్టినా ముని మాత్రం కనులు తెరవలేదు. పక్షి రెట్టలు ఆయనపై పడినా, ఆయన అలాగే ఉండిపోయాడు.

ఆ అడవికి సమీపంలో ధర్మయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఆయన నిత్యం ఇతరులకు సహాయం చేస్తూ, పరోపకారంలోనే దేవుడిని చూసేవాడు.

ఒకసారి వాళ్ళ గ్రామంలో తుఫాను వచ్చింది. గ్రామస్తులు పనులు లేక ఆకలితో అల్లాడారు. ధాన్యం ఉన్నవాళ్ళు భవిష్యత్తు ఆలోచించి దాచుకుంటే, ధర్మయ్య మాత్రం మారు ఆలోచన చేయకుండా తన దగ్గరున్న వాటిని అందరికీ పంచి పెట్టాడు. తుఫాను తగ్గాక కూడా అందరూ అతను చేసిన దానం గురించి గొప్పగా చెప్పుకున్నారు.

ఒకసారి సంతకు వెళ్లే దారిలో వృద్ధుడైన ఒంటరిగా వున్న ఒక అంధుడు దారి తప్పి ఇబ్బంది పడుతూ కనిపించాడు. ధర్మయ్య తన గొర్రెలను అక్కడే విడిచిపెట్టి, ఆయనకు భుజంపై చెయ్యి వేసి, సురక్షితంగా ఆయన ఇంటి వరకు చేర్చాడు. అప్పటికి చీకటి పడుతున్నా, తన గొర్రెలను వెతుక్కునే కష్టం గురించి ఆలోచించకుండా, ఆ వృద్ధుడికి సేవ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాడు.

ఒక రోజు ధర్మయ్యకు చెందిన ఒక చిన్న గొర్రెపిల్ల తప్పిపోయింది. దానికోసం వెతుక్కుంటూ ధర్మయ్య అడవిలోకి వచ్చాడు. అక్కడ పుట్టలు కప్పబడి, పక్షి గూడుతో తపస్సు చేసుకుంటున్న ధీరవ్రతుడిని చూశాడు. అంతటి కఠిన తపస్సును ఆటంక పరచకూడదని, ఆ ముని కళ్ళు తెరిచే వరకు అక్కడే నిరీక్షించి నిలబడ్డాడు.

 కొంతసేపటికి ముని కనులు తెరిచాడు.

"అయ్యా! మీరు ఏమి చేస్తున్నారు?" అని వినయంగా అడిగాడు ధర్మయ్య.

ముని. "తపస్సు చేస్తున్నాను" అన్నాడు.

"ఎందుకు తపస్సు చేస్తున్నారు?" అని అడిగాడు గొర్రెల కాపరి.

ముని చిరునవ్వుతో, "భగవద్దర్శనం కోసం" అన్నాడు.

దానికి ధర్మయ్య ఆశ్చర్యంగా, “ఎప్పుడూ కనిపించే భగవంతుడి కోసం ఇంత కఠినమైన తపస్సు ఎందుకు?" అని అడిగాడు.

ముని ఆశ్చర్యపోయి, "ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడా?” అని అడిగాడు.

గొర్రెల కాపరి ధర్మయ్య వినయంగా నవ్వి, "అవును స్వామీ! నాకైతే ప్రతిరోజూ ఆకాశంలో, పంటపొలాలలో, పారే నీళ్లలో కనిపిస్తూ ఉంటాడు. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది అంటే దేవుడు కురిపిస్తున్నట్టే కదా? ఆ వర్షం వల్ల పంటలు పండుతాయి, మనకు కడుపు నిండుతున్నది. అది దేవుడి కృపే కదా? నీళ్ల వల్ల మన దాహం తీరుతున్నది, అది కూడా దేవుడి కృపే కదా? సృష్టిలో ప్రతి జీవిని, ప్రతి వస్తువును సంతోషంగా చూసుకోవడమే దేవుడి సేవ. అటువంటి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి గాని తపస్సు దేనికి?" అని అమాయకంగా అడిగాడు.

గొర్రెల కాపరి మాటలకు ముని కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంతలో ధర్మయ్యకు తప్పిపోయిన తన గొర్రెపిల్ల ధర్మయ్య కనిపించింది.


పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని చంకలో పెట్టుకొచ్చి, ధీర వ్రతుడితో  "అయ్యా! మీ దర్శన భాగ్యం వలన నా ఈ దేవుడు దొరికాడు" అని గొర్రెపిల్లను ముద్దు పెట్టుకున్నాడు.

అప్పుడు ధీరవ్రతుడు, గొర్రెల కాపరిని చూసి, "ధర్మయ్యా! నీవు నాకంటే గొప్పవాడివి" అని వినయంగా నమస్కరించి, తన తపస్సును విడిచిపెట్టి, అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా! ధీర వ్రతుడు భగవద్దర్శనం కోసం తీవ్రంగా తపస్సు చేశాడు. అందుకోసం ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. భగవంతుడి దర్శనం అయ్యే సమయాన తన తపస్సు ఎందుకు విరమించాడు? పైగా అంతగా విద్యా జ్ఞానం లేని ఒక గొర్రెల కాపరిని "నీవు నా కంటే గొప్ప వాడివి" అని ఎందుకు అన్నాడు. అది వ్యంగ్యంగా అన్న మాటా? లేక నిజంగానే అన్న మాటా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది." అన్నాడు.

అప్పుడు విక్రమార్కుడు “బేతాళా! గొర్రెల కాపరి ధర్మయ్య మాటలు విన్న తరువాత ముని ధీరవ్రతుడు కనిపించని దేవుడి కోసం తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ, అడవుల్లో ఏకాంతంగా తపస్సు చేయడం కంటే, సృష్టిలో ప్రతిచోటా దేవుడిని కనుగొనడం, పరోపకారం చేస్తూ ప్రతి జీవిలో ఉన్న దేవుడికి సేవ చేయడమే గొప్ప విషయం, గొప్ప జ్ఞానం అన్న విషయాన్ని గ్రహించాడు. తన తపస్సు వృధా అని, నిజమైన దైవత్వం లోక సేవలోనే ఉందని మునికి జ్ఞానోదయం అయింది. అందుకే ముని ఎంతో వినయంతో, గొర్రెల కాపరిని మెచ్చు కున్నాడు. అంతే గాని అతని మాటల్లో వ్యంగ్యం లేదు. కేవలం నిజాయితీ, మెప్పు మాత్రమే ఉన్నాయి" అని సమాధానం చెప్పాడు.

ఆ విధంగా విక్రమార్కుడికి మౌన భంగం కావడంతో, బేతాళుడు ఒక్కసారిగా శవంలోంచి మాయమై, మళ్లీ తన చెట్టు ఎక్కాడు.

 *బాలసహరి*

No comments:

Post a Comment