Wednesday, November 26, 2025

 అంతర్యామి 

# హేళన... పాపమే!...

తమకు నచ్చనివారిని, తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని అకారణంగా దూషిస్తూ ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు కొందరు. అది నిజమైన సంతోషం కాదు, తాత్కాలికమైన వికృతానందం!

శూరసేన దేశానికి రాజు చిత్రకేతువు. ఒక సందర్భంలో నారదుడి ఉపదేశం ప్రకారం అతను ఆహారం మాని సమాధిలో నియమంగా ఉంటూ నారాయణ రూపమైన విద్యను ఆరాధించాడు. ఫలితంగా అతడికి రత్న ఖచితమైన దివ్య విమానం. లభించింది. దాంట్లో ముల్లోకాలు తిరగసాగాడు. కృష్ణార్పితమైన మనసుతో చిత్రకేతువు ఎప్పుడూ గోవిందనామాలనే ఉచ్చరించేవాడు. ఎల్లప్పుడూ పద్మాక్షుణ్ని పొగుడుతూ, సేవిస్తూ, కీర్తిస్తూ పరమానందం పొందే అతడు ఒక రోజు కైలాసానికి వెళ్లాడు. బ్రహ్మ, ఇతర దేవతల సమక్షంలో ఆ వెండి కొండమీద సన్నిహితంగా కూర్చున్న శివపార్వతులను చూస్తూ పకపకా నవ్వాడు. అంతటితో ఆగక పార్వతీదేవి వింటూండగా 'లోకానికి గురువైన శివుడు ధర్మసభలో భార్యను పామరుడిలా సిగ్గులేకుండా లాలిస్తున్నా'డని అన్నాడు. తాను ఇంద్రియాలను జయించినవాణ్ని అన్న అహంకారంతో సత్వరజస్తమోగుణాలకు అతీతుడైన పరమేశ్వరుణ్ని ఆక్షేపించాడు. చిత్రకేతువు మాటలకు శంకరుడు ఏమీ అనకపోయినా భవాని మౌనంగా ఉండలేకపోయింది.

సకల శుభాలకు మూలమై సాధువులు సేవింపదగిన శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించడానికి ఇతడు ఏమాత్రం అర్హుడు కాడు. పాపాలను సంహరించేవాడు, దయ కురిపిస్తూ లోకులను ధన్యాత్ములుగా చేసే ఈశ్వరుణ్ని నిందించిన పాపాత్ముడు దండింపతగినవాడు' అని చెప్పి చిత్రకేతుణ్ని రాక్షస జాతిలో పుట్టమని శపించింది. చిత్రకేతువు తన తప్పు గ్రహించి వెంటనే విమానం దిగి దేవికి సాష్టాంగపడ్డాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ప్రకటించి, శాంతంగా శాపాన్ని శిరసావహించాడు.

అహంకారంతో మహాత్ములను అవమానించే వారు శిక్షార్హులని ఈ భాగవత కథ చెబుతోంది. కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో ఎదుటివారిని కించపరుస్తాం... హేళన చేస్తాం... ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యేసరికి జరగకూడని నష్టం జరిగిపోతుంది. పరువు ప్రతిష్ఠలు మంటగలుస్తాయి. ఆవేశపరుల్లో యుక్తాయుక్త విచక్షణ నశిస్తుంది. ఇతరులను నిష్కారణంగా అవమానించడం, ఆత్మీయులను అనుమానించడం అవలక్షణాలని తెలుసుకున్నవాడే వివేకి. వృద్ధుల అశక్తతను చూసి హేళన చేసే యువకులు తాము కూడా కాలగమనంలో అదే స్థితికి చేరుకుంటామని గ్రహించాలి. పెద్దలను అవమానించేవారు అపవిత్రులని... గర్వానికి, లోభానికి వశులై గౌరవింపదగినవారిని పరిహసించే వారు నరకానికి
వెళ్తారని మహాభారతం చెబుతోంది.

స్త్రీలు అత్యంత సౌభాగ్యశాలినులు. ఇంటికి శోభకలిగించేవారని విదురుడు చెప్పాడు. స్త్రీలందరూ జగన్మాత అంశలే కాబట్టి వారిని తల్లుల మాదిరి
భావించాలన్నారు శ్రీరామకృష్ణ పరమహంస. అటువంటి స్త్రీలపై నిందలు వేసి హేళన చేసేవారు. తప్పక శిక్షార్హులే. శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుక అని బోధించింది భాగవతం.

సదా సద్భావనలతో అందరినీ ప్రేమతో పలకరించగలిగినవారు అజాత శత్రువులై సంఘం గౌరవాన్ని పొందుతారు. మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు.🙏

No comments:

Post a Comment