*సాయంకాలమైంది*
రచన - *గొల్లపూడి మారుతిరావు* గారు
భరించరాని దుఃఖం మనిషిని ఆవరించినప్పుడు రెండు జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడయినా అవుతాడు. నిర్మలమైన అంతఃకరణ గల వ్యక్తి ఊహించని మలుపులో ఏకోన్ముఖుడవుతాడు. అంటే దిక్కుతోచని దశలో బలమైన దిక్కు వైపు మనస్సుని మళ్ళించుకుంటాడు. అది అతని కర్మ పరిపాకం. సంస్కారం. అంతకన్నా కారణం మరొకటి ఉండదు. అంతులేని దుఃఖంలో తాగుబోతులైనవారూ ఉన్నారు. అద్భుతమైన కావ్యాన్ని సృష్టించినవారూ ఉన్నారు. రెంటికి ప్రాతిపదిక వేదనే.
**********************************************
మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింపజేస్తుంది
**********************************************
అవినీతికి సాకు కావాలి. అభిరుచికి అవకాశం కావాలి. మందు తాగేవాడు మనస్తాపం నుండి ఆటవిడుపు కావాలంటాడు. సిగరెట్టు కాల్చేవాడు చికాకుల ముడులు విప్పుకున్నానంటాడు. మహా సంగీత విద్వాంసుడు కావాల్సిన వాడికి మంచి గురువు అవకాశం. ఉత్తమ ప్రవర్తనకి మహాత్ముడి దర్శనం అవకాశం.
*********************************************
పేదవాడు తప్పు చేస్తే కులం తప్పు వేస్తుంది. *జరిమానా* కట్టమంటుంది. మధ్యతరగతి వాడు తప్పు చేస్తే అతి విలువయినది పోతుంది. దాని పేరు *పరువు*. దాని అవసరం మధ్యతరగతి మనిషికి ఎంతయినా ఉంది. గొప్పవాడు తప్పు చేస్తే దానికి *వినోదం* అని ముద్దు పేరు పెడుతుంది సమాజం.
*********************************************
బాగా చదువుకున్నవాళ్లంతా దేశం వదిలిపోవాలా ?
ఇది వ్యవస్థని అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరు ఎవరిని అడగాలో తెలీక చాలా తరాలుగా సామర్ధ్యాన్ని, తెలివితేటల్ని పై దేశాలకి పంపించేస్తూ మనం నష్టపోతున్నాం. ఈ తండ్రి అడిగే ప్రశ్నకి ప్రభుత్వమో, విద్యారంగమో, వృత్తిరంగమో సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న చాలా మంది తండ్రుల మనస్సుల్లో విచికిత్సకి చిన్న నమూనా.
**********************************************
అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చిపోయే భారతీయులు ఇక్కడ గడిపే రోజులన్నీ తూకంగా, లెక్కగానే గడుస్తాయి. విమానంలోంచి దిగినప్పటి నుంచీ లెక్క ప్రారంభమవుతుంది. ఈ సమయం వాళ్ళని దాదాపు మూడేళ్ళు ఊరించే సమయం. మూడేళ్ళుగా ఎన్నో కలలతో భద్రంగా దాచుకున్న సమయం.
దీనిలో మొదటి పదిరోజులూ ప్రయాణం అలసట నుంచి సెటిల్ కావడానికీ - ముద్దులూ, కౌగిలింతలూ, ఫోన్ కాల్సూ, భోజనాలూ, విరోచనాలూ, మందులూ, "ఐ యామ్ నాట్ వెల్, ఐ యామ్ ఆన్ డైట్ " లకి ఖర్చయిపోతుంది. తర్వాతి పది రోజులూ ప్రయాణాలకీ, తీసుకెళ్ళాల్సిన సామాన్లకీ, అమెరికా జీవితాన్ని వీలైయినంత ఇండియనైజ్ చెయ్యడానికీ ఖర్చు చేస్తారు.
అమెరికా నుండి వచ్చేప్పుడు అంతా సిల్వర్ చెంచాలూ, సిగరెట్టు పెట్టెలూ పంచుతారు. వెళ్ళేవాళ్ళు అందరికి ఎమ్మెస్ భజగోవింద శ్లోకాలు, విష్ణు సహస్రనామం పంచుతారు. ఇండియన్ దేవుడు అమెరికాలో విశ్వరూపం దాల్చినట్టు ఇంకెక్కడా ఉండడు.
మరొక పాపులర్ వస్తువు ఒకటి ఉంది. ఆంధ్రదేశంలో చాలా మంది చెయ్యరు కానీ అమెరికాలో ఏకాదశికీ, పున్నమికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వారున్నారు. వాటికి ప్రత్యేకంగా కాసెట్లున్నాయి. మంత్రాల మధ్య విఘ్నేశ్వరుడి మీద అక్షింతలు వెయ్యండి, "మమ అనుకోండి" లాంటి పురోహితుడి సూచనలు కూడా ఉంటాయి.
ఇండియాకి వచ్చేప్పుడు అమెరికా వెర్రిని ఇండియాలో పంచటానికి కావలసినంత సామాగ్రి ఉంటుంది. వాకీటాకీలు, కీ చైన్లు, కంప్యూటర్ డిస్క్ లూ, రకరకాల నినాదాల బనీన్లు, సగం చిరిగిన జీన్ ప్యాంటులూ, చిన్న సైజు విస్కీ సీసాలు, సిగరెట్ పాకెట్లు...వెళ్లేప్పుడు అమెరికా పెట్టెల్లోకి పసుపు, మిరియాలు, కంచి పట్టు చీరలు, తేనె సీసాలు, ఊరగాయ డబ్బాలు, మొలతాళ్లు, యజ్ఞోపవీతం వేసుకునే మంత్రాల కేసెట్, షిర్డీ సాయిబాబా విబూది, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ, పవిత్ర గంగా జలం చేరతాయి.
ఆ ఇరవై రోజుల్లో అమెరికా పైత్యాన్ని అంతా దిగుమతి చేసి ఇండియా సంప్రదాయం మరో మూడేళ్ళకి సరిపడా మూటగట్టుకుని పోతారు. ఇది ఈ తరంలో అమెరికా వెళ్ళిన ఇంకా ఇండియాని మరచిపోని, మరిచిపోలేని, మరిచిపోలేదని తమని తాము సమర్ధించుకోవడానికి యాతన. వారు దూరమైనదేదో వారికి తెలుసు.
అమెరికా భారతీయుల అద్భుత దృశ్యం ప్రతిసారీ అమెరికా వెళ్ళేటప్పుడు వారి వీడ్కోలు సంఘటన.. అందరూ భోరుమని ఏడుస్తుంటారు. మళ్ళీ ఎప్పుడో... ఎలాగో..! అందరి మనసుల్లో అదే ఆలోచన.. జీవితమంతా దూరమవడానికి సిద్ధపడి.. మరో దేశంలో స్థిరపడిన భారతీయులు అప్పుడు తాత్కాలికంగా వేరవడానికి పడే విచిత్రమయిన యాతన అది.
**********************************************
తండ్రితో కొడుకు లంకె నెలకి రెండు టెలిఫోన్ కాల్స్, బోలెడన్ని డాలర్లు.. తండ్రికి అవసరం లేని డాలర్లు..
కొడుకంటే ఎవరు ? జీవితాంతం ప్రతి పదిహేను రోజులకీ భూగోళానికి అటు వైపు నుంచి ఆత్రంగా వినిపించే ఓ 'గొంతు'!
**********************************************
జీవితంలో చాలా అదృష్టాలు ప్రపంచంలో ఎక్కడ వెదుక్కున్నా దొరుకుతాయి.. జర్మనీలో, ఇంగ్లాండులో, సింగపూర్ లో.. కానీ జీవితంలో విలువైన బాంధవ్యాల గుర్తులు కావాలంటే మనం మళ్ళీ రూట్స్ దగ్గరకే పోవాలి.
ప్రఖ్యాత షెహనాయ్ విద్యాంసుడు *బిస్మిల్లాఖాన్*కాశీవాసి* ఆయన్ని అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించారట. అన్నీ సమకూరస్తామన్నారట. "అన్నీ ఇస్తారు సరే.. అక్కడ గంగానదిని ఇవ్వగలరా ? " అన్నారట ఆయన..
అమెరికాలో అన్నీ దొరుకుతాయి. దూరమైన తల్లితండ్రుల ఆఖరి చూపు దక్కదు. మనసారా భోరుమనడానికి దుఃఖమనే ఐశ్వర్యం దొరకదు. ఇవి పోగొట్టుకున్నప్పుడే గుర్తుకొచ్చే విషయాలు.
ఎక్కడ శ్రీ కూర్మం.. ఎక్కడ పిట్స్ బర్గ్... జ్ఞాపకాల దారాలు ఎంత పొడుగు.. ఆత్మీయతల పీటముళ్ళు ఎంత బలమైనవి..! హోటల్ కిటికీలో కూర్చుని అమ్మా అంటూ భోరుమన్నాడు. ఓదార్చడానికి ఎవరూ లేరు. బంగారపు జీవితాన్ని దాదాపు 30 సంవత్సరాల పాటు పంచి ఇచ్చిన అమెరికా ఆ ఒక్క విలువయిన క్షణాన్నీ ఇవ్వలేకపోయింది.
No comments:
Post a Comment