8️⃣5️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణాl*
*కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చll*
ఈ కామము ఎన్నటికీ తీరదు. అన్ని కోరికలు తీరాయి అనే మాట ఎవడి నోటా రాదు. కామాగ్ని, అగ్నిమాదిరి ఎప్పుడూ మండుతూ ఉంటుందే కానీ అరిపోదు. ఇది సాధకునికి ప్రబల శత్రువు. ఎందుకంటే ఈ కామము సాధకునిలోని జ్ఞానమును కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే, ఇంక సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది.
ఈ శ్లోకంలో సాధకుల గురించి చెబుతున్నాడు. జ్ఞానిన: అంటే జ్ఞానులకు, సాధకులకు అని అర్థము. సాధకులకు ఈ కామము నిత్యవైరి. మామూలు శత్రువులు అయితే కొంత కాలానికి మిత్రులు అవుతారు. కాని ఈ కామము సాధకునికి జన్మ శత్రువు. అనుక్షణం జ్ఞానిని ప్రాపంచిక విషయాల వైపు లాగి అథ:పతితుడిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధకులనే కాదు, ఈ కామము పండితులను, రాజులను, చక్రవర్తులను, ఋషులను, బలవంతులను, ఇంద్రుడిని ఎవరినైనా తన ప్రభావంతో పడగొడుతుంది. ఆధ్యాత్మసాధనలో ఎంతో సాధించిన వారిని కూడా ఈ కామము తన ప్రభావంతో పడగొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కామము వాటి సంబంధమైన కోరికలు పైపైన తీరినట్టు కనిపించినా లోలోపల సూక్ష్మరూపంలో పొంచి ఉంటాయి. అదును చూసుకొని దెబ్బతీస్తాయి. వివేకము చేత, ఆత్మ విచారము చేతనే ఈ కామమును జయింపవలెనే కానీ ఇతరత్రా సాధ్యము కాదు.
కాస్త తెలివి జ్ఞానం ఉన్న మనిషికి, వాడు పిచ్చివాడు కాకపోతే, తాను ఏ పని చేయబోతున్నాడో, ఆ పనికి ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది. కొంత మంది, ఆ పని వల్ల దుఃఖం వస్తుందని తెలిసీ ఆ పనే చేస్తాడు. లాటరీ తీసుకుందాము. ఛాన్సు ఒకటికి లక్ష అని అందరికీ తెలుసు. కానీ లాటరీ కొంటాము. రాకపోతే దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖము కోపంగా పరిణమించి దానిని ఇంట్లో వాళ్లమీద చూపిస్తాము. ప్రాపంచిక వస్తువులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు ఆ కోరికలు చాలా మంచివిగా, అద్భుతంగా కనపడతాయి. తీరా అవి తీరకపోయేసరికి, వ్యతిరేక ఫలితాలు వచ్చేసరికి కోపం ముంచుకొస్తుంది. తనను అందరూ మోసం చేసారు అని ఏడుస్తాడు. ఈ కోరికలు కొంపముంచాయి అని బాధ పడతాడు. ఈ తెలివి ముందే ఉంటే ఈ దుఖము ఉండదు కదా! కాబట్టి ప్రతి తెలివి కలవాడు తెలుసుకోవలసినది ఏమిటంటే కామము అంటే అలవిమాలిన కోరికలు మనకు ప్రబల శత్రువులు, దానిని దూరంగా ఉంచాలి. దాని జోలికి పోకూడదు. ఒక వేళ పోయినా అతి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కోరికలకు అంతు లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు కోరికలు తీరే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. వాటికి అంతం లేదు. కాబట్టి ఈ కామాన్ని మొదట్లోనే తుంచాలి.
మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎంత బలవంతుడో, వాడి దగ్గర ఏయే ఆయుదాలు ఉన్నాయో, వాడి వెనక ఎంత మంది బలగం ఉన్నారో తెలిస్తేనే కదా వాడితో పోరాడగలిగేది. అలాగే ఈ కామము మనకు నిత్య శత్రువు, ఈ శత్రువు ఈరోజు ఉంటాడు రేపు ఉండడు అని లేదు. ఇది ప్రచండమైన అగ్ని లాంటిది. ఎన్ని ఆహుతులు వేసినా తనివి తీరదు. వేసే కొద్దీ ప్రజ్వరిల్లుతుంటుంది. ఇప్పుడు మనం యోగపరంగా విచారిస్తే నిత్య వైరిణా అంటే ఈ కామము జీవుని జన్మ జన్మలను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. చివరకు ముక్తి కలిగే వరకూ దీని బాధ తప్పదు. అందుకే దీనిని నిత్య శత్రువు అని అన్నారు.
రాజకీయాలలో నిత్య శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని నానుడి. మనకు ఇతరులతో ఉన్న శత్రుత్వము కూడా కొద్ది కాలానికి మాసి పోతుంది. కానీ ఈ కామము అనే శత్రుత్వము జన్మజన్మలకూ మాసి పోదు. దినదినప్రవర్ధమానమౌతూ ఉంటుంది. ప్రతిక్షణం కూడా జీవుని పడగొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ కామము సామాన్య మానవులనే కాదు ఋషులను, పండితులను, జ్ఞానులను, రాజులను, యతులను, స్వామీజీలను ఎవరైనా సరే ఇట్టే పడగొట్టే శక్తి కలిగింది ఈ కామము. ఆధ్యాత్మిక సాధన చేస్తూ కాస్త ఆదమరిస్తే చాలు, ఈ కామము వాడిని అమాంతం కబళిస్తుంది. భరతుని కథ దీనికి ఉదాహరణ.
కొంత మంది అంటుంటారు మేము కోరికలను జయించాము మాకు ఏ కోరికలు లేవు మేము నిస్సంగులము అని అంటుంటారు. నిజమే. కాని ఏదో ఒక బలహీన క్షణంలో వారిని ఈ కామము పడగొట్టేస్తుంది. పతనం చేస్తుంది. కాబట్టి ఈ కామము క్రోధము అనే శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వివేకము, వైరాగ్యము అనే ఆయుధములతో ఈ కామము అనే శత్రువును సమూలంగా నాశనం చేసిన నాడే మానవుడు ముక్తి పొందుతాడు.
ఈ కామమునకు తృప్తి లేదు అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. సముద్రం ఉంది. మీరు ఎన్ని బిందెలతో నీళ్లు తెచ్చి పోసినా చాలు ఇంక నిండింది అనదు. అలాగే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా సమిధలు వేసినా, ఇంక చాలు అనదు. వేసినవి అన్నీ స్వాహా చేస్తుంది. ఇంకా కావాలి అని భగభగ మండుతుంది. తృప్తి అనే పదానికి అర్థం తెలియనిది కామము. కొంత మంది అంటారు కామములు అన్నీ అనుభవిస్తుంటే ఆ కామములు కొన్నాళ్లుకు అయిపోతాయి కదా అని. అది శుద్ధ తప్పు. అనుభవించే కొద్దీ కామజ్వాలలు ప్రజ్వరిల్లుతాయే కానీ చల్లారవు. అగ్నిని ఆర్పాలంటే సమిధలు వేయడం ఆపి, నీళ్లు పోయాలి అప్పుడే ఆరి పోతుంది. ఇక్కడ కూడా వివేకము వైరాగ్యము అనే నీటితో కామాగ్నిని ఆర్పాలి కానీ, అనుభవిస్తే కామం చల్లారుతుంది అనేది ఒట్టి మాట.
జ్ఞానినా నిత్య వైరిణా అని ఎందుకు అన్నారంటే, జ్ఞానులకు ముముక్షువులకు మోక్ష మార్గంలో ఉండే వారికి అది ప్రబల శత్రువు, నిరంతర శత్రువు. అందుకే జ్ఞానులకు శత్రువు అని వాడాడు పరమాత్మ. అటువంటి జ్ఞానులనే బుట్టలో వేయగల కామము సామాన్య మానవులను బుట్టలో వేయదని నమ్మకం ఏముంటుంది. కాబట్టి కామము సామాన్యులకు ముందు మిత్రుడుగా పరిచయం అయి, తరువాత శత్రువుగా మారుతుంది. జ్ఞానులకు మొట్టమొదటి నుండి శత్రువు.
పాము ఇంట్లోకి దూరింది. అది ఎక్కడ ఉండేది తెలిస్తేనే కదా దానిని కొట్టడానికి. ఈ కామము ఎక్కడుండేదీ తెలిస్తే దానిని నిర్మూలించవచ్చు. కామం ఎక్కడెక్కడ ఉండేది, ఆ శత్రువు ఉండే స్థావరాలు ఏమిటి? అనే విషయాలను తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సశేషం)
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P208
No comments:
Post a Comment