మంకీ ట్రాప్
" సార్! హాల్లో కుర్చీలు అవీ వేసాను సార్! వాళ్ళు వచ్చే టైం అయ్యిందండి మీరు లోపలికి వెళ్ళిపొండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్!" అన్నాడు పద్మనాభం.
పద్మనాభం మా ఆఫీస్ అటెండర్. నాకు నమ్మిన బంటు. రోజూ ఉదయాన్నే మా ఇంటికొచ్చి పన్లు చేసి పెడుతుంటాడు. ఈరోజు జనవరి ఫస్ట్. కొత్త సంవత్సరాది కావడంతో రైస్ మిల్లర్లు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు. నేను పుట్టి పెరిగిన ఉళ్లోనే గత మూడేళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది. ఇంటి ముందు, వెనుక పెద్ద ఖాళీ స్థలం, రకరకాల చెట్లు, పెద్ద మెయిన్ గేట్. గేటు చప్పుడయితే ఎవరొచ్చారో ఇంట్లోంచే చూడొచ్చు.
లోపలికి వచ్చేసి టెడ్ రూం లో కూర్చున్నాను. మరో పది నిముషాలకు పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి...ఎవరో వచ్చినట్లున్నారు.
"కూర్చొండి సార్! సార్ పూజ చేసుకుంటున్నారు. వచ్చేస్తారు." అన్నాడు.
ఆ వచ్చినాయన కూర్చున్నట్లున్నాడు. పద్మనాభం లోపలికి వచ్చి కప్పు తో కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాడు. మరో పది నిముషాల్లో నలుగురైదుగురు వచ్చినట్లున్నారు. పద్మనాభం లోపలికి రావడం, కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్లడం చేస్తున్నాడు. మరో పది నిముషాలు తర్వాత పద్మనాభం నా దగ్గరకు వచ్చాడు.
"సార్! చాలామంది మిల్లర్స్ వచ్చారు సార్!" అన్నాడు.
" బయట ఎన్ని కార్లున్నాయి?" అన్నాను.
"ఓ పది పన్నెండు ఉంటాయి సార్!"
"సరే నువ్వెళ్లు. నేను వస్తాను" అన్నాను.
అప్పటికి పట్టు పంచె కట్టుకుని నుదుట విభూది, కుంకుమ పెట్టుకున్నాను. మెడలో రుద్రాక్షలు తో బయటకు వచ్చాను.
అందరూ లేచి నుంచుని "నమస్కారం సార్! హ్యాపీ న్యూ ఇయర్ సార్!" అన్నారు ఒకేసారి.
"నమస్కారం ..నమస్కారం.. మీ అందరికీ హాపీ న్యూ ఇయర్. లేటు ఆయినట్లుంది. మిమ్మల్సి వెయిట్ చేయించాను." అన్నాను నొచ్చుకుంటూ.
"పర్వాలేదు సార్!" అన్నారు వాళ్ళు.
ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్లు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, డైరీలు, జీప్ బ్యాగ్లు ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు
అవన్నీ "వద్దు...వద్దు... ఎందుకండీ ఇవన్నీ?" అంటూనే తీసుకున్నాను.
వాళ్ళు మరోసారి వంగొంగి నమస్కారం పెట్టి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజన సమయం దాకా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఆ వచ్చినవాళ్ళు ఇచ్చిన గిఫ్టులు అన్నీ హాల్లో ఓ ప్రక్కన కుప్పలా పెట్టాడు పద్మనాభం.
'పద్మనాభం! నువ్విక భోజనానికి పోయిరా. ఆ గిఫ్ట్స్ లో నీకు కావలసినవి తీసుకుని వెళ్లు. "అన్నాను.
పద్మనాభం మొహమాట పడుతూనే ఏవో రెండుమూడు తీసుకుని స్కూటర్ లో పెట్టుకుని వెళ్ళాడు. ప్రతీ జనవరి ఫస్ట్ కి ఇలాగే హడావుడి ఉంటుంది. ఇదే సీన్ రిపీట్ అవుతుంది. నా పరిధి లో ఓ నలభై చిన్న, పెద్ద రైస్ మిల్లులున్నాయి.
వాళ్లకు నిత్యం నాతో పని. వాళ్ళ మిల్లుల్లో బియ్యం నేను నాణ్యత పరీక్షించి అనుమతి ఇస్తేనే గాని గవర్నమెంట్ కు ఇవ్వవలసిన వారి లెవీ కోటా ఇవ్వలేరు. అలా ఇస్తే గానీ బయట అమ్ముకోడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు. బయట మార్కెట్ లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటే గానీ వాళ్లకు లాభాలు రావు. అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం.
మరో ఆరునెలలు సాఫీగా గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మానేజర్ నుంచి ఫోన్ వచ్చింది.
"నమస్తే సార్!" అన్నాను.
'ఏం నమస్కారామయ్యా? నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వు వెళ్లిపోతే నాకు ఎంత ఇబ్బంది. కాస్త హెడ్ ఆఫీస్ కు వెళ్లి మేనేజ్ చేసుకుని ఆపించుకోక పోయావా?" అన్నాడు.
నిజంగా నేను పాక్ అయ్యాను. ఎక్కడ గోదావరి జిల్లా ?ఎక్కడ అనంతపురం?
'మీరుండగా నాకు భయమేమిటి సార్! మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్!" అన్నాను.
"ఎం డి గారు వెంటనే రిలీవ్ చెయ్యమని సీరియస్ గా చెప్పారు. నీ ప్లేస్ లో రామరాజు ను వేశారు. సరే! నువ్వెళ్లి జాయిన్ అవ్వు. నేను మళ్లీ ట్రై చేసి తీసుకొస్తాను లే." అని ఫోన్ పెట్టేసాడు.
ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది. ప్యామిలీ ఇక్కడే ఉంచి రిలీవ్ అయ్యి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను.
"మీరు అంత దూరం వెళ్లిపోతే ఎలా? అత్తయ్యగారు కి వంట్లో బాగుండటం లేదు కదా! "అంది శారద.
"పర్వాలేదు...డాక్టర్ సూర్య భాస్కరం వచ్చి అమ్మను చూస్తూ ఉంటాడు లే. నేను పది పదిహేను రోజులకోసారి వస్తూ ఉంటాను. ట్రై చేసుకుని రెండు మూడు నెలల్లో వెనక్కి వచ్చేస్తాను లే" అన్నాను.
నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్స్ కు చెప్పినట్లు న్నాడు. మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేసారు.
" సార్! ఈవార్త నిజమేనా? మీరు వెళ్లిపోతే ఎలా సార్? మా ప్రెసిడెంట్ గారు ఎం డి గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు" అన్నాడు జిల్లా సెక్రెటరీ.
"ఆ పని చెయ్యకండి. ఒకసారి బయటకు వెళ్లి వస్తే మరో మూడు నాలుగేళ్ల దాకా మళ్లీ కదపరు" అన్నాను.
వాళ్ళు చాలా బాధ పడుతూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జ్ తీసుకోవడం, నన్ను రిలీవ్ చెయ్యడం జరిగి పోయింది. ఇంట్లో కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి, పద్మనాభాన్ని రోజు వచ్చి చూస్తూండమని చెప్పి అనంతపురం బయల్దేరాను.
అనంతపురం ఆఫీస్ చాలా చిన్నది. స్టాఫ్ కూడా చాలా తక్కువ. వాళ్ళకి గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం. ఆ గౌరవం తో నాకు పెద్దగా పని కూడా చెప్పడం లేదు. జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో గౌరవం తో చూడటంతో నేను ఇంటికి రావాలి అనుకున్నప్పుడల్లా వచ్చి వెళుతున్నాను. ఇట్టే ఆరు నెలలు గడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మాత్రం రాలేదు. ఇంకో వారం రోజుల్లో జనవరి ఫస్ట్ వస్తోంది. ఆరోజుకు నేను వెళ్లకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంత ఎంతగానో అభిమానించే మిల్లర్స్ అంతా ఇంటికొచ్చి నేను రాలేదని బాధ పడతారు. అందుకని ఓ వారం రోజులకు లీవ్ లెటర్ పడేసాను.
" మొన్ననే కదా వెళ్ళావు సుధాకర్! మళ్లీ వెంటనేనా?" అన్నాడు మానేజర్ రామిరెడ్డి గారు.
" తప్పకుండా వెళ్ళాలి సర్! రైస్ మిల్లర్లు కు నేనంటే అభిమానం. అందరూ జనవరి ఫస్ట్ కు ఇంటికొస్తారు. నేను వెళ్లకపోతే బాధ పడతారు" అన్నాను గట్టిగా.
ఒక్క క్షణం నా మొహం కేసి అదోలా చూసాడు.
"నీ ఇష్టం" అన్నాడాయన నవ్వుతూ.
కొత్త సంవత్సరాది కి ముందు రోజున ఇంటికొచ్చాను. నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది.
" మొన్ననేగా వచ్చి వెళ్ళారు" అంది.
"పద్మనాభం వస్తున్నాడా?" అన్నాను అడిగినదానికి సమాధానం చెప్పకుండా.
"ఆ.. వస్తున్నాడు" అంది గేటు కేసి చూస్తూ.
"నమస్కారం సార్!" అన్నాడు పద్మనాభం వస్తూనే.
"రేపు జనవరి ఫస్ట్ కదా! ఎప్పట్లాగే ఏర్పాట్లు చూడు " అన్నాను.
"అలాగే సార్!" అన్నాడు.
"కోటయ్య కాజా, మిక్చర్ కూడా తెప్పించు. ఉత్త కాఫీ ఒక్కటే ఇస్తే ఏం బాగుంటుంది?" అన్నాను జేబు లోంచి రెండు ఐదు మందల వోట్లు తీసి ఇస్తూ.
"అలాగే సార్!" అన్నాడు గానీ వాడి మొహం లో మునుపటి ఉత్సాహం లేదు.
వాడికి వయసు పెరుగుతోందేమో అనుకున్నాను. సాయింత్రం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు.
"పొద్దున్న వస్తాను సార్!" అన్నాడు.
"కొంచెం పెందరాలే రా" అన్నాను. వాడు బుర్ర ఊపి వెళ్ళిపోయాడు.
ఉదయాన్నే నాలుగు గంటలకు మెలుకువ వచ్చింది. ప్రక్కింట్లో కోడి అప్పుడే కూయడం మొదలుపెట్టింది. లేచి బ్రష్ చేసుకుని, కాఫీ తాగి, స్నానం చేసాను. పట్టుపంచే కట్టుకుని పూజ ముగించాను. టైం ఆరయ్యింది. గేటు కేసి చూస్తూ హాల్లో పచార్లు మొదలు పెట్టాను. ఆరున్నర అయ్యింది. గేటు చప్పుడయింది. పద్మనాభం గేటు తీసుకుని స్కూటర్ లోపల పెట్టుకున్నాడు. త్రాగిన కాపీ కిక్ దిగిపోయింది. శారద నాకు, పద్మనాభానికి చెరో కప్పు కాఫీ ఇచ్చింది.
" బయట కుర్చీలు అవీ వేసావా?" అన్నాను. పద్మనాభం బుర్ర ఊపాడు. గడియారం కేసి చూసుకున్నాను. ఎనిమిది అయ్యింది. గేటు చప్పుడు కాలేదు. ఎవ్వరూ వచ్చిన జాడ లేదు.
"నేను వస్తున్నట్లు వాళ్లకు తెలుసా? "అన్నాను అనుమానం గా.
"అందరికీ చెప్పాను సార్! మిల్లర్స్ అసోసియేషన్ లో కూడా చెప్పాను. సార్!" అన్నాడు.
మళ్లీ వాచీ చూసుకున్నాను. తొమ్మిది అయ్యింది. అసహనంగానూ, అవమానకరంగానూ ఉంది. ఎప్పుడూ తెల్లారకుండా వచ్చేసేవాళ్లు, నాకోసం ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళు, నాకు ట్రాన్స్ఫర్ అయితే కన్నీరు కార్చినవాళ్లు ఎవరూ కనపడరే. అంతకాలం వాళ్లకు అంతగా సేవ చేస్తే కనీస హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడు... ఒక్కడురాలేదే. నాకు చాలా ఉక్రోషంగా నూ, కోపంగానూ ఉంది. ఇంతలో సెల్ రింగయ్యింది. రామరాజు నుంచి ఫోన్.
"సుధాకర్ గారూ! హ్యాపీ న్యూ ఇయర్...వచ్చారా? అన్నాడు.
"హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు! నిన్ననే వచ్చాను "అన్నాను.
"ఇప్పుడే మన రైస్ మిల్లర్లు అందరూ వచ్చి వెళ్లారు. వాళ్ళింకా జాయింట్ కలెక్టర్ గారిని, డి.ఎస్. ఓ గారిని, కలెక్టర్ గారిని కలవాలిట. హడావుడిగా వెళ్ళిపోయారు." అన్నాడు రామరాజు. ఆ లిస్ట్ లో నేను లేను.
"వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అవసరం ఉంటేగానీ ఎవ్వరినీ డిస్టర్బ్ చెయ్యరు" అన్నాను వెటకారంగా.
" అది ఎక్కడైనా అంతే. అవసరాన్ని బట్టి స్నేహం. అవకాశాన్ని బట్టి ద్రోహం. మనం మంకీ ట్రాప్ లో తెలియకుండానే ఇరుకుంటాం" అన్నాడు.
"అంటే?" అన్నాను అర్ధంకాక.
"వాళ్లకు అవసరం ఉన్నంతకాలం అభిమానం కురిపించి మనల్ని మంకీ ట్రాప్ చేస్తారు. మనం దాంట్లో ఇరుక్కుంటాం. మనకు సమాజంలో స్వంత అస్తిత్వం ఉన్నా వాళ్ళు చూపించే అభిమానం, గౌరవం అనే ట్రాప్ లో ఇరుక్కుని బయటికి రాలేకపోతే ఇలాగే ఉంటుంది. వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు. కోతి కి బోనులో చెయ్యి పట్టేంత కన్నం పెట్టి లోపల ఆహారం పెడతారు. గుప్పుడు తో తీసుకుందామంటే గుప్పుడు బయటకు రాదు. ఆ ఆహారం వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది. కానీ ఆహారం వదలదు. ఆ విధంగా మంకీ ట్రాప్ లో పడుతుంది. మనం కూడా అంతే. వాళ్ళ అవకాశవాద అభిమానం అంతా మంకీ ట్రాప్. దాంట్లోంచి బయటకు రావాలంటే రక్తహస్తాలతో రావాలి. అభిమానం, గౌరవం అనేది ఎర గా వేస్తారు." అన్నాడు రామరాజు.
"గొప్ప విషయం చెప్పారు. థాంక్యూ! ఉంటా" అని సెల్ డిస్ కనెక్ట్ చేశాను. జ్ఞానోదయమైంది. మబ్బులు విడిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది.
"పద్మనాభం! ఆ కాకినాడ కాజాలు, ఆ మిక్చర్ మీ పిల్లలకు తీసుకుపో"అన్నాను.
"ఎవరైనా వస్తే సార్?" అన్నాడు సందేహంగా,
" మన అవసరం ఎవ్వరికీ లేదు. ఎవ్వరూ రారు "అన్నాను.
పద్మనాభం సందేహిస్తోంటే స్వీటీ, హాటు బ్యాగులో పెట్టిచ్చాను.వాడు మౌనంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రే అనంతపురం బయల్దేరి వచ్చేసాను.
"ఒకసారి పుట్టపర్తి వెళ్ళిరండి సార్!" అన్నాడు నా అసిస్టెంట్ ఓబులేసు.
"ఇప్పుడు బాబాగారు లేరుగా!" అన్నాను. నాకు ఎలాంటి నమ్మకాలు, సెంటిమెంట్స్ లేవు. పూజ చేస్తాను గానీ అది రోటిన్ గా.
"భౌతికంగా లేరు సార్! ప్రశాంతి నిలయం చూసిరండి." అన్నాడు.
ఓబులేసు ను తీసుకుని ఆదివారం పుట్టపర్తి వెళ్లి ప్రసంతినిలయం చూసివచ్చాను.
"సార్! మీరు ఏమని ప్రార్ధించారు?" అన్నాడు ఓటులేసు.
"జనం అందరూ సుఖంగా ఉండాలని" అన్నాను గొప్పగా.
"నేను మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నాను సార్!" అన్నాడు. ప్రక్కవాడి కి మంచి జరగాలని కోరుకోవడం ఎంత గొప్ప విషయం.
ఓబులేసు కోరిక ప్రకారం మరో పదిహేను రోజులకు మళ్లీ మా ఊరు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడం, నన్ను రిలీవ్ చెయ్యడం జరిగిపోయింది.
వెంటనే మా ఊరు వచ్చేసాను. శారద, అమ్మ చాలా సంతోషించారు. రామరాజు నేను వచ్చానని తెలిసి వచ్చాడు. అతనితో మాట్లాడి చార్జ్ తీసుకున్నాను. అతన్ని సాగనంపుదామని గేటు దాకా వెళ్ళాను. అతను బయటకు వెళ్లి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఓ నలుగురు రైస్ మిల్లర్స్ అటుగా వెళుతూ అతన్ని చూసి ఆగారు.
" నమస్కారం సార్!" అన్నారు రామరాజు దగ్గరకు వచ్చి.
నన్ను చూసి నేను బదిలీ అయి వచ్చేసానని తెలిస్తే సంతోషిస్తారు అని గేటు దగ్గర నుంచున్నాను. వాళ్ళు రామరాజు తో మాట్లాడుతున్నారు గానీ కనీసం నాకేసి చూడటం లేదు. ఐదు పది నిముషాలు అయిపోయింది. వాళ్ళు నన్ను అసలు గుర్తించడం లేదు. రామరాజు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసాడు.
"అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. రేపటినుంచీ నేను రావడం లేదు. సుధాకర్ గారే మీకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ "అన్నాడు రామరాజు. వాళ్ళు ఒక్క సారిగా నాకేసి తిరిగారు.
"అయ్యబాబోయ్! మా గురువు గారు వచ్చేశారా? చాలా సంతోషం సార్!" అంటూ రామరాజు ను వదిలేసి పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేసారు.
"మిమ్మల్ని చూడలేదు సార్! మీరు వచ్చేసారంటే మా కష్టాలన్నీ తీరినట్టే" అన్నారు... అప్పటిదాకా ఉన్న రమారాజేదో వీళ్ళని రాసి రంపాన పెట్టినట్లు.
రామరాజు చెప్పిన మంకీ ట్రాప్ కథ గుర్తుకొచ్చింది. అర్ధమయ్యిందా అన్నట్లు రామరాజు నవ్వుతూ థంప్సుప్ గుర్తు చూపించాడు. తిరిగి నేను కూడా ధంసప్ గుర్తు చూపించాను. ఈ అవసరార్ధ గౌరవాలన్నీ మన అధికార హోదాలను బట్టి ఉంటాయని అర్ధమయ్యింది.
"మీరు?" అన్నాను వాళ్ళెవరో తెలియనట్లు.
'మేం సార్! మమ్మల్ని మర్చిపోయారా? రైస్ మిల్లర్లమి" అన్నారు గేటు తీసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ.
"రేపు ఆఫీస్ కు రండి" అన్నాను అప్పుడే జ్ఞానోదయం అయినవాడిలా. చిరునవ్వుతో గేట్ మూసేసి వెనక్కి తిరిగాను.
....అయిపోయింది...
No comments:
Post a Comment