Sunday, February 1, 2026

 చిన్నకథలు - పెద్ద అర్థాలు 
కథ: గులాబీ జోళ్ళు
రచన : తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
°°°°°°°°°°°°°°°°°°
కృష్ణకుమారికి ఎనభై ఏండ్లు ఉంటాయి . చుట్టాలపై గాని, స్నేహితులపై గాని,  తెలిసిన వాళ్ళపై గాని, దూరం నుండే  ఆత్మీయతలు కురిపిస్తుంది. ఎవ్వరితో కూడా దగ్గరగా కలిసి జీవించడం ఆమెకు ఇష్టం ఉండదు. జీవించాల్సి వస్తే ఒక్క పూటకే అసహనానికి గురవుతుంది. 

ఈ ఊరు నుండి ఆ ఊరికి ఎంత దూరం ఉందో, ఆ ఊరు నుండి ఈ ఊరికి కూడా అంతే దూరం ఉంటుంది అన్నట్టుగా ఆమెకు ఎవరూ నచ్చరు... ఆమెను కూడా ఎవరూ మెచ్చరు.. అందుకే... కింది అంతస్థులో కొడుకు కుటుంబం ఉంటుంది.  పై అంతస్థులో తాను ఒంటరిగా ఉంటుంది. ఒకటే కాంపౌండ్ అయినా ఒకరితో ఒకరికి సత్సంబంధాలు తక్కువ.  ఆమె ఆడ పిల్లలకు ఎప్పుడో పెళ్ళిళ్ళయి, మనుమలు మనుమరాండ్రు కూడా పెద్ద వాళ్లయిపోయారు. వాళ్ళ రాకపోకలు కూడా తక్కువే.

అస్సలు ముచ్చటకు వస్తే... వాళ్ళ ఇంట్లో చెప్పులు పెట్టుకునే ఇనుప అల్మారా ఒకటి వృధాగా పడి ఉన్నది. తాళాలు ఎక్కడో పడిపోవడం వల్ల  గత పదహైదు ఏండ్ల నుండి ఆ  చెప్పుల అల్మారా సడి సప్పుడు కాకుండా ఉన్నది. ఒకానొక రోజు కృష్ణకుమారి  కొడుకు రమణ, రెండవ తాళాలు తయారు చేసే వ్యక్తిని   పనిగట్టుకు వెంటేసుకొచ్చి  అల్మారా తెరిపించాడు.  వాస్తవానికి ఎప్పుడో ఆ పని చేయాల్సింది. కానీ అందులో ఉన్న చెప్పులు ఎవ్వరికీ పెద్దగా అవసరం లేకపోవడం.. పనుల్లో బడి నిర్లక్ష్యం చేయడం.... ఈ రెండు కారణాలు వల్ల వల్ల 15ఏండ్ల తర్వాత గాని,  ఆ అల్మారకు మోక్షం లభించలేదు. కాగా  అల్మరా తెరిచే సమయానికి కృష్ణకుమారి  ఇంట్లో లేదు.

అల్మారాలో పాత చెప్పులు జతలు చాలా బయటపడ్డాయి. వాటిల్లో ఒక గులాబీ రంగు జోళ్ళు ఆ ఇంటి మనవరాలు వైష్ణవికి తెగనచ్చేసాయి. ఆ పిల్ల వయసు  15 ఏండ్లు. అంటే ఆ పిల్ల పుట్టినప్పుడో... అంతకు ముందు ఎప్పుడో తెచ్చుకున్న చెప్పులు అన్నమాట. అవి ఎప్పుడు తెచ్చుకుంటేనేం... నచ్చిన ఆ జోళ్లను ఆ పాప ఎంచక్కా తొడుక్కుంది. 

సాయంకాలానికి  కృష్ణకుమారి వచ్చేసింది. వచ్చీ రాగానే మనవరాలి కాళ్లకు చెప్పులు చూసింది. అవి తనవిగా గుర్తు పట్టేసింది. అల్మారా తెరిచారని పసిగట్టేసింది. అంతేకాదు, తన చెప్పులు తన అనుమతి లేకుండా మనవరాలు తొడుక్కోవడం ఒప్పుకోలేక పోయింది. అట్లాగే తను లేకుండా చెప్పుల ఆల్మరా తెరిపించడం  అస్సలు సహించలేకపోయింది.కొడుకు మీద అంతెత్తు ఎగిరింది. అక్కడ ఒక నేరమో ఘోరమో జరిగిపోయినట్టుగా చాలా సేపు రుసరుస లాడుతూనే ఉండిపోయింది. 
******
మరునాడు -
ఏదో పని మీద  పై అంతస్తుకు  వెళ్ళింది  వైష్ణవి.  అక్కడే మొక్కల వద్ద తచ్చర్లాడుతూ ఉన్న కృష్ణకుమారి, పాపను చూడగానే  ఉక్రోషం ఆపుకోలేక పోయింది.
'' ఒకరి వస్తువుల్ని అడక్కుండా ముట్టుకోవద్దనే డిసిప్లిన్ మీ అమ్మ నేర్పించలేదా?'' గద్దించ్చినట్టుగా అడిగింది.
''..... '' ఆ పాప ఏం మాట్లాడలేదు.
'' ఆ చెప్పులు నాకు  చాలా ఇష్టం. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న.వాటిని ఎవ్వరు తొడుక్కున్న నేను ఒప్పుకోను.నా చెప్పులు ఒకరు తొడుక్కోవడం నాకు నచ్చదు కూడా.. ''
''.....'' అప్పటికి ఆ పాప పాపం ఏం మాట్లాడలేదు.
''  ఇంకెప్పుడు నా చెప్పులు తొడుక్కోవద్దు. అల్మారాలో పెట్టేసేయ్. నీకు ఎప్పుడైనా తొడుక్కోవాలి అనిపిస్తే నా పర్మిషన్ తీసుకో. కాసేపు వేసుకుని వదిలేద్దువు గానీ... '' కఠినంగా పలికింది కృష్ణకుమారి గొంతు.
''సరే " ఈసారి తలాడించింది వైష్ణవి.
తర్వాత కృష్ణకుమారి ఏం మాట్లాడలేదు. తనలో తాను -"  ఛీ ఛీ...ఏం పెంపకమో ఏంటో " గుణుక్కుని, 
'' ఆ!  ఇక వెళ్ళు! వెళ్ళి ఇదంతా మళ్ళీ మీ ఇంట్లో చెప్పమాకా...''   చేయి ఆడిస్తూ  రాగం తీస్తూ అంది..
చప్పుడు చేయకుండా వైష్ణవి  కిందకు వచ్చేసింది.
ఆ సంభాషణ మొత్తం కింద వాకిట్లో ఉన్న  కోడలుకు స్పష్టంగా కాకపోయినా, అర్థం అయ్యేవిధంగా మొత్తం వినిపించింది.
*******
ఇంక ఆరోజు సాయంత్రం నుండే  అల్మరాలో పెట్టి ఉన్న   ఆ  గులాబీ జోళ్ళు కనిపించడం లేదు.  తాను వాటిని తొడుక్కోక పోయినా కూడా వైష్ణవికి ఏడుపు వచ్చింది.  పాప ఏడుస్తుంటే నాయనమ్మ కృష్ణకుమారి చూసింది కూడా. కానీ కిమ్మనలేదు. అంతా గమనిస్తున్న ఆ ఇంటి కోడలికి మాత్రం అంతా అర్థం అయ్యింది. కానీ నోరు మెదపలేదు.తనలో తానే కోపాన్ని వెల్లగక్కుకుంది. అయినప్పటికీ ఆవేశం చల్లారలేదు. తన తోబుట్టువుకి ఫోన్ చేసి, విషయం చెప్పుకుని, కొంత ఉపశమించింది 
******
వారం రోజులు గడిచిపోయాయి. వైష్ణవి పాప చెప్పుల కోసం వెదుకుతూనే ఉంది. అట్లాంటి చెప్పులు కావాలని తన డ్యాడీని వెంటేసుకుని షాపులు కూడా తిరిగింది. కానీ దొరకలేదు. అట్లా - ఒకరోజు మనసు చిన్నబుచ్చుకుని బయట వాకిట్లో ఉయ్యాల  మీద కూర్చుని ఉంది. సరిగ్గా అప్పుడే  మేడపై నుండి నాయనమ్మ దిగుతూ కనిపించింది. ఆమెతో పాటుగా ఆమె తొడుక్కున్న గులాబీ రంగు చెప్పులు కూడా కనిపించాయి. పాపకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. నోట మాట మరిచి నాయనమ్మనే చూస్తూ ఉండిపోయింది. 

కృష్ణకుమారికి వయసు ప్రభావంతో పాదాల వేళ్ళు వంకర్లు  తిరగడం వల్ల  చెప్పులు సరిగ్గా అమరలేదు.బలవంతంగా పాదాలను చెప్పుల్లో ఇముడ్చుకుంది. ఒక్కో అడుగు వేస్తూ గేటు దాటిందో లేదో చెప్పు ఒకటి తెగింది. అస్సలే పాత చెప్పులు.  మన్నిక ఏముంటుంది? అయినప్పటికీ కొంపలు మునిగినట్టుగా  " అయ్యో దేవుడా " అని గట్టిగా నొచ్చుకుంటూ మనవరాలి వైపు తిరిగిచూస్తూ....
''   వైషూ నేను అర్జన్టుగా వెళ్ళాలి. నీ చెప్పులు ఉంటే పట్రా... '' కేకేసింది. 
అదివిన్న కోడలు ఇంట్లోంచి గభాల్న బయటకు వచ్చి పరిస్థితి గమనించి - ''దానికి అన్నీ మీ లక్షణాలే అత్తయ్య గారూ.. తన చెప్పులు ఒకరు తొడుక్కోవడం పాపకు నచ్చదు"'  సున్నితంగానే అయినా కొట్టినట్టుగా చెప్పింది. 
అంతే... !
కృష్ణకుమారి నోట్లోంచి మళ్ళీ మాటలేదు...
_____________________________________
[  ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడో కనుమరుగై పోయింది.  ప్రస్తుతం  మిగిలిన ఒంటరి కుటుంబాల్లో మరో చీలిక ఏర్పడుతూ... తల్లిదండ్రులకు సంతానానికి మధ్య అడ్డుగోడలు కనిపిస్తున్నాయి.  ఒకే కుటుంబానికి చెందిన ఆత్మీయుల మధ్య ప్రేమలు లోపిస్తున్నాయి నశిస్తున్నాయి. ఇందుకు కారణం వేగవంతమైన జీవితాలు, ఆ జీవితాల్లో పొసగని న్యూ జెనరేషన్ కోడళ్ళు మాత్రమే కాదు,  కృష్ణకుమారి వంటి ఓల్డ్ జెనరేషన్ చాదస్తం మనస్తత్వాలు కూడా కారణం. "అత్తల ఆరళ్ళు - కోడళ్ళ సతాయింపులు" అనే కాన్సెప్ట్ లో  బలమైన వేధింపులే కాదు ఇటువంటి సిల్లీ అంశాలు కూడా ఉంటాయనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇట్లాంటి విషయాల్లో కొన్ని వాస్తవాలు  కఠినంగానే కాదు,విచిత్రంగానూ ఉంటాయి.]
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment