Sunday, February 1, 2026

 దైవనిర్ణయం:

ధర్మపురిలో సోమన్న, భీమన్న అనే ఇద్దరు బీదవాళ్ళు ఉండేవారు. అదే ఊరిలో సాంబశివుడనే ధనవంతుడు ఉండేవాడు. రోజూ సోమన్న, భీమన్న అతని దగ్గరకు వెళ్ళేవారు. ప్రతిరోజూ సాంబశివుడు వారికి భోజనం పెట్టి పంపించేవాడు. వెడుతూ వెడుతూ భీమన్న "దేవుడు గొప్పవాడు" అంటే, సోమన్న "తమరు చాలా గొప్పవారు మహాప్రభో" అని సాంబశివుడిని పొగిడే వాడు.

అలా కొన్ని రోజులు గడిచాయి. సాంబశివుడికి భీమన్న దేవుణ్ణి పొగడడం నచ్చలేదు. ఒకరోజు "రోజూ నీకు ఆహారం పెట్టేది నేను, నువ్వు నన్ను పొగడక దేవుడు గొప్ప వాడు అంటావేం" అన్నాడు. దానికి భీమన్న "ఈ ప్రపంచంలో దేవుని ఇష్టం లేనిదే ఏమీ జరగదు, మీ చేత మాకు భిక్ష ఇప్పించేది ఆ దేవుడే. అందుకే అలా అంటున్నాను" అన్నాడు.

"అయితే ఈ రోజు నుండి దేవుడు నీకు భిక్ష ఎలా ఇస్తాడో పరీక్షిద్దాం" అన్నాడు భీమన్న నమ్మ కాన్ని పరీక్షిద్దామన్న ఉద్దేశంతో సాంబశివుడు, 

ఒక రోజు ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకొని దాని నిండా వెండి నాణాలు నింపి దాన్ని యథావిధిగా అతికించాడు. మరుసటి రోజు భిక్షకు వచ్చినప్పుడు ఆ గుమ్మడికాయను సోమన్నకిచ్చాడు. భీమన్నకు ఏమీ ఇవ్వలేదు. సోమన్న ఆ గుమ్మడికాయను ఒక వ్యాపారికి అమ్మాడు. భీమన్న ఆ రోజు భిక్ష దొరకలేదని వేరే దారిలో వెళ్ళాడు. సోమన్న గుమ్మడికాయ అమ్మిన వ్యాపారి దగ్గరకు వెళ్లి భిక్ష అడిగాడు. వ్యాపారి ఆ గుమ్మడికాయను భీమన్నకిచ్చాడు. భీమన్న ఇంటికి వెళ్లి ఆ గుమ్మడికాయను కోయగా అతనికి వెండి నాణాలు దొరికాయి.

మరునాడు ఇద్దరూ సాంబశివుని ఇంటికి వెళ్లారు. సాంబశివుడు "నిన్న ఏం జరిగింది?" అని అడిగాడు. సోమన్న "నిన్న మీరిచ్చిన గుమ్మడికాయకు మంచి ధర పలి కింది. ఆ డబ్బుతో తృప్తిగా భోజనం చేశాను" అన్నాడు.  భీమన్న "నిన్న నాకు ఒక వ్యాపారి భిక్షగా ఒక గుమ్మడికాయనిచ్చాడు. ఇంటికెళ్లి దాన్ని కోయగా వెండి నాణాలు దొరికాయి" అన్నాడు. భీమన్న మాటలతో సాంబశివుడికి కనువిప్పు కలిగగింది. తాను ఎంత చేసినా దైవనిర్ణయం లేనిదే ఏ పనీ జరగదనీ, దేవుని కంటే  ఎవరూ గొప్పకాదనీ తెలుసుకున్నాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
7386587623
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment