*ఎన్ని ఉగాదులేగినవొ!*
కాలమనేది మహా మహిమాన్వితమైనది.
కాలమే దైవమన్నారు పెద్దలు. ‘ఇయ్యది నిచ్చెనంచు గణియించిరి కొందరు...’ కాలాన్ని నిచ్చెనతో పోల్చారు పాశ్చాత్యులు. కాలమనేది ఒక చక్రం అన్నారు మనవాళ్లు.
ప్రభవ, విభవ... అంటూ మొదలయ్యే కాలచక్రం 60 ఆకులకు ఎన్నో అంతరార్థాలు స్ఫురించే పేర్లను నిర్ణయించారు. రాజస తామస సాత్త్విక ప్రవృత్తుల లక్షణాలను వాటిలో ధ్వనింప చేశారు. కొన్నిపేర్లు అందమైనవి. కొన్ని వికృతమైనవి.
అలాగే ఎంతగానో ప్రోత్సహించేవి, హెచ్చరించేవీ ఉన్నాయా అరవైలో. ‘పరా’ అనేది వాగ్రూపాల్లో ఒకటి. కాలచక్రంలో నలభయ్యో పేరు- పరాభవ! ‘పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవమ్’ అంది శాస్త్రం.
‘అధర్మస్య పరాభవః’ అని హెచ్చరించింది. ధర్మాన్ని తప్పి చరిస్తే ఈ ఏడాది భంగపాటు తప్పదంది. ధన, అధికార మదం తలకెక్కిన వారందరికీ వర్తించే సూత్రమిది!
‘అవలోకింపగ రాజకీయములు అసహ్యం బౌచు వ్యక్తిత్వ వైభవమున్ కూకటివేళ్లతో నిపుడు కూల్పంజొచ్చె...’ అంటున్నారు కవి రసరాజు.
‘ఓ పరాభవ వర్షమ్మ! పరాభవింపుమిక ఆ వైరుధ్య కాకృత్యముల్!’ అని ప్రార్థిస్తున్నారు. కాలానుకూలంగా కార్యాన్ని సాధించుకోవాలంటారు పెద్దలు.
పండితులు రాబోయే కాల స్వభావాన్ని ముందుగానే వివరిస్తుంటే- ప్రజలంతా ముందుచూపుతో వ్యవహరించేందుకు వీలుగా ఈరోజు పంచాంగ శ్రవణం ఓ ఆచారంగా ఏర్పడింది.
పేర్లలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. నలభయ్యవది పరాభవ కాగా అరవై- అక్షయ! మధ్యలో ఇరవై ఏళ్లు జీవితంలో చాలా కీలకమైనవి.
పరాభవాలను తట్టుకుంటూ స్థిరమైన వ్యక్తిత్వాన్ని, దృఢమైన దృక్పథాన్ని రూపొందించుకునే వయసది. అలా తనను తాను తీర్చిదిద్దుకున్న వ్యక్తికి అక్షయమైన భవిష్యత్తు సొంతం అవుతుంది.
శిశిరంలో శిథిలమైన పచ్చని శోభను నిలువెల్లా తిరిగిచ్చే ఆకుపచ్చని ఆమని రుతువులో వస్తుంది తెలుగు ఉగాది. మోడైన బతుకు మళ్లీ చివురిస్తుందన్న హామీనిస్తుంది.
ఇప్పుడు అట్టడుగున అణగారిపోతున్నా- ఒకనాటికి శిఖరాన్ని అందుకుంటామన్న ఆశావహ దృక్పథాన్ని మనలో రగిలించేందుకే కాలాన్ని తిరిగే చక్రంతో పోల్చారు- పెద్దలు!
కాబట్టి పేరు వినగానే కలవరపడటం కాదు- కష్టసుఖాలను సమానంగా భావించాలన్నది పరాభవ ఉగాది సందేశం. మంచి రోజులు తప్పక వస్తాయన్న భరోసా- దాని సారాంశం.
‘తనువు నిలువెల్ల కాఠిన్యమునకు నెలవు. మనసు మాత్రము మాధుర్యమునకు కొలువు’- అది చెరకుగడ స్వభావం. ‘మొద్దుబారిన జిహ్వ ముద్దార పిలువంగ ఉద్దీపనం బిచ్చు ఊత- పులుపు’- అది పుల్లమామిడి లక్షణం.
‘జగతి రక్షణకు తా దిగమ్రింగుకొనినట్టి విశ్వనాథుని కంఠ విషము చేదు’ అని గుర్తుచేసేది వేప. చేదు తీపి పులుపు వగరు... వగైరా విభిన్న రుచులన్నీ- ఉగాది పచ్చడికే కాదు, ఎగుడు దిగుళ్ల రూపంలో- జీవితానికీ అన్వయిస్తాయి.
సుఖాల్లో ఎగిరెగిరి పడరాదని, కష్టాల్లో కుంగిపోరాదని సూచిస్తాయి. స్థితప్రజ్ఞను అలవరుస్తాయి.
ఆరుద్ర చెప్పినట్లు ‘చెరసాల బ్రతుకులో ‘చె’చెరపగానే- రసాల బ్రతుకులై రాజిల్లునవియే’ అని ధైర్యం చెబుతాయి. ముందుకు నడిపిస్తాయి.
No comments:
Post a Comment