*ఎవరు నిజమైన పండితులు*
కఠినమైన అభ్యాసంతో సంపాదించుకున్న అపార వేద శాస్త్ర ఙ్ఞానసంపద ద్వారా చంచలస్వభావం కలిగిన మనసును స్థిరత్వానికి చేరువ చేస్తారు పండితులు.
సత్యాన్ని గ్రహించడానికి, యదార్థాన్ని దర్శించడానికి, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి నిరంతరం మనసును అన్వేషణ మార్గంలో నడిపిస్తారు.
ఆ దారిలో ఇతరులను కూడా నడిపించి చేరాల్సిన గమ్యానికి తనతోపాటు వారిని కూడా చేరువ చేసేవారే... నిజమైన పండితులు. సకల శాస్త్రాలను, వేదాలను ఆపోసన పట్టి వాటి సారాన్ని గ్రహించిన వారిని విద్వాంసులు, ప్రావీణ్యులు అంటారు.
వీరు తాము నేర్చుకున్న, సంపాదించుకున్న ఆ జ్ఞాన సంపదను తాము సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల మేలు కోసం కూడా వినియోగించినప్పుడు మాత్రమే వారు పండితులు అనిపించుకుంటారు.
అంతేకానీ అన్ని శాస్త్రాలను, వేదాలను తెలుసుకున్నప్పటికీ వాటిని ఆచరించనివారు, ధర్మాన్ని విస్మరించి ప్రవర్తించే వారు ఎన్నటికీ పండితులు కాలేరు. రావణాసురుడే అందుకు ఉదాహరణ.
రావణుడు అన్నీ తెలిసిన వాడైనప్పటికీ నేర్చిన జ్ఞానానికి భిన్నమైన ప్రవర్తనతో నడుచుకున్నాడు. అందుకే రాక్షస రాజు అనిపించుకున్నాడే కానీ పండితుడిగా పేరు తెచ్చుకోలేదు.
కానీ రావణుడు శత్రువే అయినప్పటికీ... సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగిన వాడు, ఈశ్వర అనుగ్రహం పొందిన వాడు కాబట్టి మరణించిన తరవాత అతనికి జరగాల్సిన ఉత్తరక్రియలన్నీ ధర్మశాస్త్ర ప్రకారం జరిపించమని ఆదేశించిన రాముడు పండితులకే పండితుడు అనిపించుకున్నాడు.
సంపాదించుకున్న జ్ఞానంతో వాస్తవాన్ని అంగీకరించడం, ధర్మం పట్ల స్థిరంగా ఉండటం, మంచి పనులు చెయ్యడం పండితుల లక్షణం.
వక్రమార్గంలో ప్రయాణం చేయనివారు, తాము నిర్వర్తించాల్సిన కార్యాల్లో ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండేవారు... పండితులు. కాలగమనంలో వచ్చే మార్పులు, భయాందోళనలు, కలిమిలేములు మొదలైన వాటిని వారు తాము పూర్తి చెయ్యాల్సిన కార్యాలకు విఘ్నాలుగా భావించరు.
తలపెట్టిన పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని మధ్యలో మానరు. కాలాన్ని వ్యర్థంగా గడపరు. కోరికతో కాకుండా కర్తవ్యంగా భావించి పురుషార్థాలను సాధిస్తారు.
గౌరవం పొందినప్పుడు పొంగిపోకుండా, అవమానం జరిగినప్పుడు కుంగిపోకుండా ప్రపంచాన్ని సమదృష్టితో చూస్తారు. మేలుచేసే వాటిలో దోషాలు వెదకకుండా వాటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటారు.
ఇవే కాదు, ధృతరాష్ట్రుడితో పండిత లక్షణాల గురించి చెబుతూ విదురుడు - అన్ని శాస్త్రాలను, వేదాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి ద్వారా సంపూర్ణంగా భౌతిక తత్వాన్ని అర్థం చేసుకుని
ఆ వ్యామోహాలకు లొంగనివారు, పెద్దల పట్ల మర్యాదలను మరువనివారు, ఎవరినీ కించపరుస్తూ పరుష వాక్యాలు పలుకనివారు, తర్కంలో నిజాయతీగా వాదించేవారు, అవసరమైన చోటే తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రశాంతంగా మౌనంగా నదిలా ప్రవహించే మనస్తత్వంతో నడుచుకునేవారే... పండితులు అనిపించుకుంటారని వివరిస్తాడు.
No comments:
Post a Comment