కాఫీ కబుర్లు సంఖ్య 1177 (మే 01 - 2026) -- శ్రమ -- జీవితంలో ఏదీ ఊరకనేరాదు. నిత్యం శ్రమించాలి. ప్రతీ పనిలోను ఎంతోకొంత శ్రమ ఉంటుంది. ఏం సాధించాలన్న శ్రమతో కూడిన కష్టం ఉంటుంది. శ్రమ అంటే లేబర్. అసలు మానవుల పుట్టుకలే లేబర్ పెయిన్స్ తో మొదలవుతాయి. విద్యార్ధి దశలో కష్టపడి చదివే శ్రమ ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రమోషన్స్, లాభాలు రావాలంటే కష్టించి పనిచేయాలి. పిల్లల్ని చక్కగా పెంచి ప్రయోజకులను చేయడంలో శ్రమ ఉంటుంది. శ్రమ లేని దశ ఉండదు. జీవితంలో రాణించాలన్నా, ఏదైనా సాధించాలన్నా, మనకి మంచిపేరు రావాలన్నా, పదిమందిలో గుర్తింపు గౌరవం పొందాలన్నా శ్రమ పడాలి. శ్రమతో రాజీ పడకూడదు. కళాకారులకు ఎంతో నైపుణ్యం శ్రద్ధ శ్రమ లేకపోతే ఎదగలేరు. శ్రామికుల సంగతి చెప్పనక్కర్లేదు. ఆ పేరులోనే శ్రమ ఉంది. శ్రమించని వ్యక్తికి చరిత్రలో చోటు లేదు. కష్టపడి శ్రద్ధగా శ్రమిస్తే ఫలితం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఐతే కొంతమందికి శ్రమించే తత్వం ఉండదు. ఈజీ లైఫ్ కోరుకుంటారు. అరవై దాటాక ప్రశాంతత తో కూడిన సౌకర్య వంతమైన జీవితం గడపాలంటే యాబై ఏళ్ళు నిరంతరం మనం శ్రమించాల్సిందే. శ్రమించకపోతే కీర్తి డబ్బు పేరు ప్రఖ్యాతులు లభించవు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. అలాగే మెదడు చురుగ్గా ఉండాలంటే మానసిక శ్రమ పాజిటివ్ తరహాలో ఉండాలి. చాలామంది విజ్జుల జీవిత చరిత్రలను విజయగాథలను పరిశీలిస్తే వారు ఎంత శ్రమ పడివుంటారో అన్న విషయం మనకి తెలుస్తుంది. జీవితాన్ని సవాలుగా తీసుకోవాలి. చేసే ప్రతి పనిలో ప్రతిభ ఉండాలంటే శ్రద్ధ శ్రమ అవసరం. శిఖరాలను అధిరోహించకపోయినా ఫర్వాలేదు గానీ కొండలను ఎక్కే విధంగా మన ప్రయాణం సాగించాలి. మనం శ్రమిస్తేనే కదా మనలో శక్తిసామర్థ్యాలు బయటకు వచ్చేవి. మనమేమిటో మనం నిరూపించు కోవాలంటే శ్రమనే నమ్ముకోవాలి. పదిమందికి ఉపయోగపడే విధంగా మనం శ్రమపడితే జీవితం చరితార్ధ మవుతుంది. ఆడుతుపాడుతూ పనిచేసు కుంటూపోతే శ్రమ తెలియదు. ఈరోజు మే డే గనుక శ్రమదినం, పారిశ్రామిక దినం గనుక ఇన్ని శ్రమ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేం. అందరం శ్రమకోర్చి కష్టపడి మంచి ఫలితాలు సాధిద్దాం. అందరికీ మే డే శుభాకాంక్షలు.. ------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
No comments:
Post a Comment