Saturday, May 30, 2026

 మానవునికి వివేచన చేయగల శక్తియున్నది, వివేకమున్నది. అయినప్పటికి విలువైన కాలమును, కృషిని భౌతిక విషయలంపటుడై తనకేదో సుఖము కలుగునని భ్రమతో చరించుచున్నాడు. శరీరమునకు నొప్పి కలిగించువాడైనను శరీరమును కోయు వైద్యుని విశ్వసించుచున్నాడు. తనకు బాహిరమైన వస్తువేదియు మానవునికి సర్వకాలము ప్రీతిగా నుండదు.
ఉదాహరణకు తీపివస్తువులను చూడుడు. అతిమూత్రవ్యాధి ఉండినవానికి తీపి వస్తువులు పనికిరావు (డయెబెటిస్), పూర్వము ప్రీతికరములైనప్పటికి. శ్రీ శంకర భగవత్పాదులు *"యస్మాత్ యావత్ ప్రియంస్యాత్ ఇహ హి విషయతస్తావ దస్మిన్ ప్రియత్వం యావత్ దుఃఖంచ యస్మాత్ భవతిఖలు తతస్తావదేవ అప్రియత్వం"* అనిరి. అయితే తనయందు తనకున్న ప్రేమస్వాభిమానము యితర అనురాగాదుల కంటే బలమైనది. వాటిని త్రోసి రాజనగలది.
యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయితో "ఆత్మ ప్రీతికొరకే అన్ని వస్తువులు - భార్య, పిల్లలు, ఐశ్వర్యము ప్రియమగుచున్నవి" అని ఉపదేశించెను. ఇతరులపై చూపబడు ప్రేమ వారికి సమ్మతము కాకపోవచ్చును. పంచదశి గ్రంథమున దీనికి ఉదాహరణము చూపబడినది. "గడ్డము మీసములున్న తండ్రి ప్రీతితో బిడ్డను ముద్దిదుకొనగా బిడ్డకు గడ్డము మీసములు గ్రుచ్చుకొని బాధ కలిగింపవచ్చును. అప్పుడు బిడ్డ యేడ్చును. తండ్రి బిడ్డను లాలించుచు మరింత గాఢముగా ముద్దిడుకొనగా బిడ్డకు బాధ అధికమగును. తండ్రికిగల సంతోషము బిడ్డకు లేదు. ఆత్మహత్య చేసికొనువాడు కూడ ఆత్మనాశనమును కోరి చేయుటలేదు ఆ పని. ఏదో బాధను, విపత్కరస్థితిని, ఆందోళనను తప్పించుకొనుటకే చేయుచున్నాడు. 
ఇక మనము నిజమైన సుఖమేమిటని విచారణ చేయకూడదా? ఆత్మకు నిజమైన సుఖమేమిటని విచారణకు ముందు ఆత్మ, అహం, నేను, అనగా భావమేమిటో తెలియవలెను. ఆలోచన సాగగా దేహేంద్రియ అంతఃకరణాదులు ఆత్మకాదని, ఆత్మ సత్- చిత్ -ఆనందమని స్పష్టమగును. జాగ్రత్స్వప్నములందు ఒక వస్తువును చూచుటకు చూచువాడు, చూడబడునది రెండును కలవు. వస్తువు మారుచుండవచ్చును, చూచువాడతడే. గాఢనిద్రనుండి మేల్కొని "నేను హాయిగా నిద్రపోతిని, ఏమియు తెలియలేదు" ఆనవచ్చును. ఇది ఒక అనుభవమునకు జ్ఞాపిక, అనుభవిత మారుటలేదు. కాబట్టి ఆత్మ ఉనికిగలిగినదై, చైతన్యవంతమై ఆనందరూపమగుచున్నది. ఇది అనుభవమునకు తెచ్చుకొనుటకు అడ్డుపడుచున్నది అవిద్య. ఆత్మ పూర్ణగుప్తముకాదు, సుస్పష్టమునుకాదు. తెలిసీ తెలియని స్థితి. పూర్తిగా తెలియనిచో దానిని గురించిన విచారణ సాధ్యమగునా? పూర్తిగా తెలియబడినదైనచో ఈ విచారణ మరెందుకు?
చెఱువు నీటిపై నాచు వ్యాపించినచో దానిని కాస్త తొలగించి అడుగు చూచుటకు వీలు లేదు, పూర్తిగా తొలగింపవలెను. అదేవిధముగా అవిద్య విషయమున దానిని పూర్తిగా తొలగించినప్పుడే ఆత్మజ్ఞానలాభము. అందుకు గురూపదేశము కావలెను. గురువు తెలిసినవాడై ఉండవలెను. సాధనమార్గముల విశ్లేషణ చేయగలవాడై యుండవలెను. ఆత్మజ్ఞానికి సాంద్రానందలాభము కలిగి ఇంద్రియసుఖముపై రుచిలేనివాడై యుండాలి. నిరంతరము ఆత్మవిచారము చేయవలెను. లౌకిక భౌతిక విషయ వాసనాలంపటత్వలౌల్యములు కాదు.

*- శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు.*

No comments:

Post a Comment