🌺 *మహిషి* 🌺
*భూలోకంలోకి వెళ్లి జీవించడానికి ఒక జంట త్రిమూర్తుల తేజస్సులు నుండి వెలువడి , అవి క్రమంగా కలిసి ఒక పురుషాకృతిని దాల్చాయి దేవీమాతలు ముగ్గురు నుండి తేజస్సులు వెలువడి కలిసిపోయి స్త్రీ ఆకృతిని పొందాయి వాళ్లవైపు ప్రసన్నంగా చూసారు త్రిమూర్తులు ‘‘ఆహా అసమాన సౌందర్యంతో అలరారుతున్నారు శ్రీ మహావిష్ణువు వాళ్లవైపు చూస్తూ* *‘‘సుందరదత్తుడు, లీలావతి అనబడే మీరిద్దరూ దంపతులై భూలోకంలో ధర్మమార్గాన జీవించండి గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఆదర్శప్రాయంగా గడపండి’’ అని ఆదేశించాడు. ‘‘మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను’’* *అంటూ నమస్కరించి భూలోకాన్ని చేరుకున్నారు*
*మానుష్యాకృతులు పొందిన ఆ ఇద్దరూ సుందర దత్తుడు, లీలావతి బదరికారణ్య ప్రాంతం చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఇతర మునిగణాలతో పాటు జీవించసాగారు అక్కడకు చేరిన కొద్దికాలంలోనే తమ సత్ప్రవర్తనతో అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు* *‘‘ఈ జంటను చూస్తుంటే ఎంతో ముచ్చటవేస్తున్నది ఆ యువకుడు పేరుకు తగ్గట్లే సుందర రూపంతో మనందరికీ దత్తుడై పుత్రుడికన్నా ఎక్కువగా గౌరవాభిమానాలు చూపుతున్నాడు* *అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ, దైవకార్యాలు ఏ కొరతా లేకుండా నెరవేరస్తున్నాడు లీలావతి కూడా అతనికి తగిన పత్నిగా , ఆదర్శ గృహిణిగా జీవిస్తున్నది పెద్దలంటే గౌరవం* , *అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ సహాయపడుతుంటుంది. వీళ్లిక్కడికి రావడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది కదూ?’’* *అంటూ మెచ్చుకునేవాళ్లు అక్కడ నివశిస్తున్న మునిగణాలు*
ఆ ప్రశంసలు అతిశయోక్తులు కావు నిజంగానే దత్తుడు , లీలావతి మనసా వాచా కర్మణా ఎన్నడూ ఎవరినీ నొప్పించకుండా మసలుకునేవారు కాలం వేగంగా గడిచిపోసాగింది. తమకున్న దానిలో పరులకు ఉపకారం చేస్తూ, ఎవరినీ నొప్పించకుండా సంతోషంగా కాలం గడుపుతున్న ఆ దంపతుల జీవితం హఠాత్తుగా అనుకోని మలుపు తిరిగింది
ఒక రోజు..‘‘లీలావతి ఒకసారి ఇలారా నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి’’ లోపల పనిలో వున్న లీలావతి భర్త పిలుపు విని బయటకు వచ్చింది. ఆశ్రమం ముందున్న అరుగుమీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దత్తుడి ఆమె రావటం చూసి ‘‘ఇట్లా కూర్చో లీలా’’ అన్నాడు ప్రక్కకు జరుగుతూ. ‘‘ఏమిటి చెప్పండి’’ అంటూ ప్రక్కన కూర్చుంది, భర్త ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. ‘‘ఈవేళ ఉదయం నుండి ఎందుకో ఏదో ఆలోచిస్తూ గంభీరంగా వున్నారు ఏ విషయం గూర్చి ఆలోచిస్తున్నారు చెప్పండి ? ’’ అడిగింది లీలావతి. ‘‘చెబుతాను. జాగ్రత్తగా విను. మనకు వయస్సుమీద పడుతున్నది. ఈ గృహస్థాశ్రమాన్ని త్యజించి సన్యసించి తపస్సులో కాలం గడపాలన్న సంకల్పం నాలో చోటుచేసుకుంది..’’ అతని మాట పూర్తికాకుండానే ‘‘ఏమిటండీ వింతగా మాట్లాడుతున్నారు ? మనకు సంతాన భాగ్యం కూడా కలగలేదింకా నాకు సంసారిక సుఖాలమీద ఇంకా మోహం తీరలేదు. మీరు సన్యసించి తపస్సుకు వెళ్లడమేమిటి?’’ అన్నది ఆందోళనగా చూస్తూ
‘‘పిచ్చిదానా సంతానం మోక్షసాధనకు అవరోధమని గ్రహించే భగవంతుడు మనకా బంధాలను అనుగ్రహించలేదు. భార్యా, పిల్లలు అనే సంసార బంధాలలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ గృహస్థాశ్రమం మీద నాకు విరక్తి కలిగిందని చెబుతున్నాను గదా ఐహిక సుఖాలు శాశ్వతం కావు. యవ్వనం క్షణభంగరమైనది వయస్సు పెరుగుతున్నకొద్దీ మనస్సు నిలకడపొంది ఐహిక సుఖాలవైపు గాక శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అందుకే నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు. ఇద్దరం తపస్సుకు తరలి వెళదాం పద" అన్నాడు దత్తుడు శాంత స్వరంతో నచ్చచెబుతూ ‘‘ఊహూ మీ మాటలు నాకెంత మాత్రం సమ్మతం కావు నాధా భార్య కోరిక తీర్చి ఆమెను సంతోషపెట్టాల్సిన బాధ్యత భర్తదన్న విషయం మర్చిపోతున్నారు మీరు. నా తనివితీరి తృప్తి చెందేవరకు నన్ను మీరు సుఖాలలో ఓలలాడించక తప్పదు’’ అంటూ భర్తను గట్టిగా పెనవేసుకుంది లీలావతి
దత్తుడు నిర్వికారంగా ఆమెను జరిపి లేచి నిలబడ్డాడు చిన్నగా నిట్టూర్చి ‘‘భర్త అడుగుజాడలలో నవడం ఉత్తమ సతీ ధర్మమనే విషయాన్ని మరచి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు సుమా నా నిర్ణయం మారదు. నేను తపస్సుకు తరలి వెళుతున్నాను. నా మార్గానికి అడ్డురాకు’’ అన్నాడు, కోపం, విసుగు కొద్దిగా ధ్వనించాయి ఆ మాటలలో.
‘‘మిమ్మల్ని నేను వెళ్లనివ్వను. ఇంతకాలం మీ ప్రేమానురాగాలలో పరవశిస్తూ ప్రేమసామ్రాజ్యాన్ని పట్టమహిషిలా పాలిస్తూ వస్తున్నాను. నా ఆనందాన్ని భంగపరిచి మీరెలా వెళతారో అదీ చూస్తాను. ఇలా చూడండి’’ భర్తలో కోరిక కలిగించాలన్న ఉద్దేశ్యంతో వక్షోజాలమీది ఆచ్ఛాదన వస్త్రాన్ని తొలగించి గట్టిగా కౌగిలిలలో బిగించబోయింది లీలావతి. ఆ చర్యకు దత్తునిలో అణచివుంచిన కోపావేశాలు పొంగివచ్చాయి
‘‘లీలావతి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువాంఛతో నా మార్గానికి అడ్డుపడుతున్న నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగవు. మరుజన్మలో రాక్షస కులంలో మహిషిగా జన్మించి నీ పశువాంఛను తీర్చుకో’’ అంటూ శపించాడు కఠినంగా చూస్తూ లీలావతి కళ్లు ఎరుపెక్కాయి.
‘‘నాది పశువాంఛనా? నేను మహిషిగా జన్మిస్తానా? అయితే నా మాట కూడా వినండి. మహిషినైనా మిమ్మల్ని విడువను. ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు, వెళ్లండి. వెళ్లి తపస్సుతో ఏం సాధించుకుంటారో అదీ చూస్తాను’’ అంటూ విసురుగా ఆశ్రమంలోకి వెళ్లిపోయింది. ‘‘ప్చ్ పరమేశ్వరా మీరు రాత్రి స్వప్నంలో ఆదేశించినట్లు తపస్సుకు తరలివెళ్లిపోవాలనుకుంటే లీలావతి ఈ విధంగా ప్రవర్తిస్తుందనుకోలేదు.
ఆమెకు చెప్పి పొరబాటు చేసి వుంటే నన్ను మన్నించండి ఆమెకు సద్బుద్ధిని అనుగ్రహించండి’’ అని మనస్సులో ప్రార్థించి గబగబా అక్కడినుండి వెళ్లిపోయాడు దత్తుడు భర్త వెళ్లిపోవడంతో లోపల నుండి గమనించిన లీలావతి దుఃఖోద్వేగంతో ప్రాణత్యాగం చేసింది.
పాతాళలోకంలో- దానవరాజు దనువు కుమారులు రంభ , కరంభులు దీర్ఘ సమాలోచనలో మునిగి వున్నారు ‘‘అన్నా ఎంతో కాలానంతరం నా భార్య గర్భవతై పుత్రికకు జన్మనివ్వడం సంతోషం కలిగించినా , పుట్టగానే ఆ బాల మహిషి రూపంలో కనిపించడం, అంతఃపుర కాంతలందరినీ భయభ్రాంతులను చేయడం అన్నీ నాకెందుకో అశుభ సంకేతాలుగా అనిపిస్తున్నాయి. మన దానవ పతాకాన్ని మూడు లోకాలలో ఎగరవేసే పుత్రుడు కలగడానికి ఏం చేయాలో గురు శుక్రాచార్యుల వారిని సంప్రదించడం మంచిదని తోస్తున్నది నాకు, ఏమంటావు ? ’’ అన్నాడు కరంభుడు.
అన్నగారివైపు చూస్తూ రంభుడు గంభీరంగా తలవూపాడు. ‘‘నిజమే కరంభా నాకు కలగకపోయినా నీకైనా పుత్రుడు కలుగుతాడని ఆశతో ఎదురుచూస్తూ వచ్చాను ఇప్పుడీవిధంగా జరిగింది. శుక్రాచార్యులను కలుసుకుని కర్తవ్యం ఉపదేశించమని అడుగుదాం పద’’ అన్నాడు రంభుడు తమ్ముని ఆలోచనకు అంగీకారం సూచిస్తూ వాళ్ల ఆంతర్యం గ్రహించినట్లుగా ఆ సమయానికి శుక్రాచార్యులే అక్కడకు రావటం వాళ్లకు ఆనందం కలిగించింది.
‘‘ప్రణామాలు గురుదేవా మీ రాక మాకెంతో సంతోషదాయకమైంది. ఆసీనులు కండి’’ అంటూ ఆయనకు మర్యాద చేసి పుత్రిక విషయం ఆయనకు తెలియచెప్పారు. ‘‘ఈ విషయం దివ్యదృష్టితో తెలుసుకునే ఇట్లా వచ్చాను రంభ , కరంభులారా ఈ శిశువు కారణజన్మురాలు దానవుల పేరు ప్రతిష్ఠలు ఈమెవల్ల జగత్ప్రసిద్ధం కాగలవు మొదట మహిషి రూపంలో కనిపించింది గనుక ఈమె మహిషి అనే పేరుతోనే ప్రసిద్ధురాలౌతుంది’’ అని తెలియచెప్పాడు శుక్రాచార్యుడు.
No comments:
Post a Comment