*🙏🕉️⚛️మహా త్రిపురసుందరీ!!!*
*గొప్పదైన త్రిపుర సుందరీ అయిన అమ్మ.*
*అమ్మవారిని మూడు రకాలుగా ఆరాధిస్తారు–*
1. విగ్రహంగా
2. షోడశి మంత్రంగా
3. శ్రీచక్రయంత్రంగా
విగ్రహం, మంత్రం, యంత్రం – అనే ఈ మూడు పురములలోనూ (స్థానాలలోనూ) ఏకకాలంలో వ్యాపించి ఉండి, తన ఉపాసకులకు వరాలను ప్రసాదించే దివ్యశక్తి కాబట్టే అమ్మకు ‘మహాత్రిపురసుందరీ’ అని పేరు.
శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణంలోని మూడు కోణాలకు సంబంధించిన సుందరదేవతలు–
1. కామేశ్వరీ
2. వజ్రేశ్వరీ
3. భగమాలినీ
ఈ ముగ్గురు సుందరుల ఉద్భవానికి మూలకారణమైన ‘బిందు’స్వరూపిణీ అయిన అమ్మవారిని ‘మహా త్రిపురసుందరీ’ అంటారు.
మన శరీరంలో కుండలినీ శక్తి మూలాధారం నుంచి సహస్రారానికి పయనించే క్రమంలో మూడు ముఖ్యమైన ముడులు (గ్రంథులు) అడ్డుగా ఉంటాయి–
1. బ్రహ్మ గ్రంథి.
2. విష్ణు గ్రంథి.
3. రుద్ర గ్రంథి.
యోగి అయినవాడు తన సాధన ద్వారా ఈ మూడు గ్రంథులను (మూడు పురాలను) ఛేదించుకుని వెళ్తాడు. ఆ గ్రంథి త్రయాన్ని దాటించే చైతన్యశక్తియే ‘మహాత్రిపురసుందరీ’.
అందం – బాహ్యమైనది.
సౌందర్యం – ఆంతరమైనది.
కంటికి కనిపించేది – అందం. హృదయానికి అనుభూతమయ్యేది – సౌందర్యం.
ఎవరిని, దేనిని చూస్తే అలౌకికమైన ఆనందం కలుగుతుందో అది సౌందర్యం అంటే.
రమణులు పెద్ద అందగాడేమీ కాదు,
కానీ వారి సన్నిధిలో కూర్చొన్న ప్రతి ఒక్కరూ అలౌకికమైన ఆనందాన్ని అనుభవించారు. అదీ సౌందర్యం అంటే.
అరుణాచలం అంటే తెలియనివారికి అదొక రాళ్ళగుట్టే. తెలిసినవారు తదేకంగా ఆ కొండలోని తత్త్వాన్ని ఆస్వాదిస్తూ తన్మయులౌతుంటారు. అదీ సౌందర్యం అంటే.
షిర్డీబాబా తన గురువుగారి ముఖారవిందాన్ని చూస్తూ అలా గంటలు గంటలు గడిపేసేవారట. అదీ సౌందర్యం అంటే.
మన కన్నతల్లి పెద్ద అందగత్తె కాకపోయినా అమ్మను ప్రేమిస్తాం. అదీ సౌందర్యం అంటే.
ఎవరి తల్లి వారికి మహాత్రిపురసుందరీ.
సూర్యోదయ సౌందర్యం.
పండువెన్నెల సౌందర్యం.
గిరిశిఖర సౌందర్యం.
గంభీర కడలి సౌందర్యం.
నదీప్రవాహం సౌందర్యం.
పసిబిడ్డ నవ్వు సౌందర్యం.
వీణానాదం సౌందర్యం.
సృష్టే ఇంత సుందరంగా ఉన్నప్పుడు,
సృష్టికి మూలం అయిన అమ్మ ఇంకెంత సౌందర్యవతి అయి ఉండాలి?
శ్రీ రామకృష్ణ పరమహంస ఆకాశంలో ఎగురుతున్న తెల్లటి కొంగల బారును చూసి, ఆ సహజ సౌందర్యానికి మైమరచిపోయి సమాధి స్థితికి వెళ్ళిపోయారు.
సృష్టిలోని సౌందర్యాన్ని చూసి సృష్టికర్తను దర్శించగలగడమే అసలైన ఉపాసన.
త్రిపుర అంటే త్రిపుటి.
జాత–జ్ఞాన–జ్ఞేయములు.
సృష్టి–స్థితి–లయాలు.
ఇచ్ఛా–జ్ఞాన–క్రియాశక్తులు.
సత్వ–రజస్–తమోగుణాలు.
బ్రహ్మ–విష్ణు–రుద్రులు.
పాతాళ–భూలోక–స్వర్గలోకములు.
కర్త–కర్మ–క్రియలు.
భూత–వర్తమాన–భవిష్యత్తులు.
స్థూల–సూక్ష్మ–కారణ శరీరాలు.
ఇళా–పింగళా–సుషుమ్నా నాడులు.
దేవతలు–మానవులు–దానవులు.
ఆ, ఉ, మ – ఓంకారం.
ఇలా ఈ జగత్తంతా త్రిపురాలతో నిండి ఉంది.
ఈ త్రిపురలోనే సౌందర్యముంది.
ఆ సౌందర్యమే చైతన్యం.
ఆ చైతన్యమే జీవునిలోని శక్తి.
ఆ శక్తికే ‘మహాత్రిపురసుందరీ’ అని పేరు.
జాగ్రత్, స్వప్న, సుషుప్తులు – అవస్థలు.
ఈ మూడు అవస్థలనూ (త్రిపురాలను) దాటిన తరువాత వచ్చే తురీయ (నాలుగవ) అవస్థే అమ్మవారి నిజస్వరూపం.
ఎవరైతే అహంకారాన్ని వీడి, ఆత్మచింతనలో రమిస్తారో వారికి మాత్రమే దర్శనమిచ్చే అత్యంత నిరంజనమైన తత్త్వం అమ్మది.
మన శరీరంలో–
శిరస్సు – జ్ఞానశరీరం.
కంఠం నుండి నాభివరకు – ఉపాసనాశరీరం.
నాభి నుంచి పాదాల వరకు – కర్మశరీరం.
ఈ మూడు శరీరాలు మూడు పురాలు.
ఈ పురాలకు అధిష్ఠానదేవతయే ‘మహాత్రిపురసుందరీ’.
కంచిపీఠంలో పీఠాధిపతులచే నిత్యమూ ఆరాధింబడుతున్న చంద్రమౌళీశ్వరుని పట్టమహిషి పేరు మహాత్రిపురసుందరీ.
నిష్కల్మషమైన ప్రేమతో, కరుణతో అంతరంగాన్ని నింపుకున్న గురువాక్కులో ఒక తెలియని మాధుర్యం, ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు వెల్లివిరుస్తాయి. ఆ తేజస్సే ‘మహాత్రిపురసుందరీ’.
No comments:
Post a Comment