Monday, August 10, 2026

 స్వామి చూపుతో కళ్ళు తెరుచుకున్నాయి 

1990 ప్రారంభంలో, కుంభకోణంలోని కమర్షియల్ టాక్స్ విభాగంలో పనిచేసే రమణి మరియు అతని స్నేహితులు ఈసారి విహారయాత్రకు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. చివరకు అందరూ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రమణి పరమాచార్య స్వామివారి భక్తుడు కావడంతో, ముందుగా కంచికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకుని, అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరుదామని సూచించాడు.

రమణి నిర్ణయాన్ని అందరూ అంగీకరించినా, అదే విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి మాత్రం అది నచ్చలేదు. ఎందుకంటే అతను ద్రవిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడైన ఒక నాస్తికుడు. అందరితో ఎంతో చనువుగా, మంచిగా మెలిగేవాడు. అయితే దేవుడు గానీ, సన్యాసులు గానీ ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్కడి నుండి వెళ్లిపోవడం లేదా ఎదుటివారిని హేళనగా మాట్లాడడం చేసేవాడు.

బెంగళూరుకు వెళ్లేముందు కంచి మఠానికి వెళ్లడానికి అతను విముఖత చూపించాడు.
“మన కుటుంబ సభ్యుల కోసం కంచిలో చీరలు కొనడానికి వెళ్దామంటే సరే. కానీ కంచి మఠానికి వెళ్లి ఒక సన్యాసిని చూద్దామంటే మాత్రం అది మన సమయాన్ని వృథా చేయడమే. సరాసరి బెంగళూరుకే వెళ్దాం,” అని వాదించాడు.

కానీ అతని స్నేహితులు అభ్యంతరం చెప్పారు.
“నీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము. నీ ఇష్టాన్ని మేము కాదనము. కానీ మహాస్వామివారిని దర్శించుకునే అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రయాణం మహాస్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించే యాత్రగా మారుతోంది,” అని చెప్పారు.

మరొక స్నేహితుడు, “మేమందరం మఠంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని త్వరగా తిరిగి వస్తాము. మాతోపాటు నిన్ను కూడా రమ్మని మేము బలవంతం పెట్టము. నువ్వు దయచేసి మన కారులోనే ఉండు. మేము త్వరగా తిరిగి వస్తాము,” అని ధృఢంగా చెప్పాడు.

ఆ నాస్తికుడు అందుకు ఒప్పుకున్నాడు.

విహారయాత్ర రోజు అందరూ వ్యానులో కుంభకోణం నుండి బయలుదేరి కంచి మఠానికి చేరుకున్నారు. మహాస్వామివారి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వచ్చారు. ఎందరో దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా, అంతకంటే ఎక్కువ మంది దర్శనం కోసం లోపలికి వెళ్తున్నారు.

అనుకున్న ప్రకారం రమణి మరియు అతని మిత్రబృందం మఠంలోకి వెళ్లడానికి సిద్ధపడుతూ, ఆ నాస్తికుడిని వ్యానులోనే ఉండమని చెప్పి మఠం వైపు నడిచారు. వెంటనే, “నేను కూడా వస్తాను,” అన్నాడు ఆ నాస్తికుడు.

వెంటనే వారు, “ఏమిటి! నువ్వు కూడా మాతోపాటు వస్తావా? ఎందుకు?” అని ఆశ్చర్యంగా అడిగారు.

“చూడండి, అంతమంది జనం మఠంలోకి వెళ్తున్నారు అంటే, నాకు కాస్త కుతూహలంగా ఉంది. లోపల ఉన్న ఆ ఆకర్షణ ఏమిటో చూడాలని ఉంది,” అని కొద్దిగా హేళనగా అన్నాడు.

“కానీ ఇక్కడ ఒక నియమం ఉంది. మఠంలోకి వెళ్లాలంటే చొక్కా, బనియన్ తీసి వెళ్లాలి,” అని రమణి చెప్పాడు.

అందుకు అతను, “ఛీ! నేను అలా చేయను. నేనేమీ ఆయన దర్శనం కోసం రావడం లేదు. నువ్వే కాదు, ఇక్కడ ఉన్న ఎవరికీ నా చొక్కా, బనియన్ విప్పమని చెప్పే అధికారం లేదు,” అని బదులిచ్చాడు.

ఎవరూ మరేమీ మాట్లాడకుండా, “స్వామివారి ఇష్టానుసారమే అంతా జరుగుతుంది,” అనుకుంటూ ముందుకు నడిచారు.

వారందరూ పొడవుగా ఉన్న భక్తుల వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నారు. స్వామివారిని దర్శించుకోబోతున్న ఆనందంతో ముందుకు కదులుతూ, దగ్గరకు చేరుకోగానే రమణి మరియు అతని మిత్రులు తమ పైవస్త్రాలను తొలగించారు. కానీ ఆ నాస్తికుడు మాత్రం వారి చర్యను పట్టించుకోకుండా అలాగే ముందుకు సాగుతున్నాడు. చుట్టుపక్కలవారు వింతగా చూస్తున్నా, అదేమీ లెక్కచేయకుండా ఒక సాధారణ సందర్శకుడిలా వ్యవహరిస్తున్నాడు.

కొద్ది క్షణాల్లోనే స్వామివారి ముందుకు రాగానే, స్వామివారు ఒక్క చూపు చూశారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఆ నాస్తికుడు వెంటనే తన చొక్కా, బనియన్ తీసివేసి నేలపై పడి పూర్తి శరణాగతితో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

ఈ చర్యకు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఏమి జరిగిందో అర్థం కాకపోయినా, అతనిలో వచ్చిన ఈ హఠాత్ పరిణామానికి ఎంతో సంతోషించారు.

ఇంతలో స్వామివారు ఆ నాస్తికుడిని తెరిపార చూసి, మందహాసం చేస్తూ ఆశీర్వదించి, బత్తాయి పండు, కుంకుమ, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. అలాగే నవ్వుతూ ఆ కొత్త భక్తుణ్ణి అనుగ్రహిస్తూ రెండు చేతులు పైకెత్తి సంపూర్ణంగా ఆశీర్వదించారు.

విచిత్రమేమిటంటే, రమణి మరియు అతని మిత్రులకు కేవలం దర్శనం మాత్రమే లభించింది; విశేష ప్రసాదం మాత్రం దొరకలేదు.

వారందరూ వ్యానును చేరుకోగానే, ఆ పూర్వపు నాస్తికుని ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగును చూశారు. అతడు విభూతి, కుంకుమను నుదుటన రాసుకుంటూ ఉండగా, అతని చేతి నుండే వారు కూడా తీసుకుని ధరించారు.

అతనిలో కలిగిన ఈ మార్పును చూసి రమణి అతని దగ్గరకు వెళ్లి,
“నీకు ఏమైంది? నువ్వు ఒక నాస్తికుడివి కదా! నీ పైవస్త్రాలను ఎందుకు తీశావు? స్వామివారికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేశావు? అన్నిటికంటే ముఖ్యంగా నీ నుదురు మొత్తం విభూతి, కుంకుమతో అలంకరించుకున్నావు. ఇదంతా ఎలా జరిగింది?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.అందుకు అతడు, “నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. స్వామివారి ముందుకు రాగానే వారిని చూశాను. వారి చూపులు నా హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయి, నాలో ఎన్నో మార్పులు కలిగించాయి. నా ప్రమేయం లేకుండానే నా పైవస్త్రాలను తీసివేసి, వారి పాదాలపై పడ్డాను” అని చెప్పాడు.

ఈ నాస్తికుడిని ఆస్తికునిగా మార్చిన మహాస్వామివారి గొప్పతనాన్ని తలచుకుంటూ, అక్కడి నుండే స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు.

--- “మహా పెరియవా” సంకలనం నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం 
కాంచీశ్వరీ రుచిర చిత్కళయా  సుదీప్తం 
దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment