Monday, August 10, 2026

 మనసు మన లోపలి అద్దం లాంటిది అది ఎలాగో తెలుసుకుందాం. 

అలలు లేని కొలను నిశ్చలంగా ఉంటుంది. అది అద్దంలా పనిచేస్తుంది. అందులో భౌతికమైన ప్రతిబింబాలు చూసుకోవచ్చు. కానీ మనసు అభౌతికం. అది ఆంతరంగిక మైనది. మనిషి ఉనికి అంతకన్నా సూక్ష్మాంశం. అదే అసలైన 'నేను'. ఆ నేను అహం భావంతో సంబంధం లేనిది. అది మనిషికి ప్రాథమిక, ప్రాకృతిక ప్రధాన భూమిక. ఆ స్వస్వరూపాన్ని దర్శించాలంటే, స్వీయానుభూతిని పొందాలంటే ఏం చెయ్యాలి?

మురికిపాత్రలు వంటకు పనికొస్తాయా, బురద నీళ్లు స్నానానికి ఉపయోగపడతాయా, మసక బారిన అద్దాలు ప్రతిబింబాల్ని సరిగ్గా చూపుతాయా? లేదు. అందు కని వాటిని చక్కగా శుభ్రపరచాలి. అలాగే మనసు కూడా. ధ్యానాత్మకమైన మనసు పరిశుద్ధంగా పారదర్శకంగా ఉంటుంది. పూర్తిస్థాయి ఎరుకలో ఉంటుంది. అప్పుడు కళ్ల ముందున్నది, కళ్లకు వెనక ఉన్నదీ కచ్చితంగా కనబడుతుంది.

మనిషి ఒక పనిలో ఉన్నపుడు మరో దాని గురించి ఆలోచనలో పడటాన్ని పరధ్యానం అంటారు. ఒక విషయంపై సంపూర్ణంగా దృష్టి నిలిపినప్పుడు వేరొక అంశానికి సంబంధించిన ఆలోచనకు తావుండదు. కానీ, మనసు ఒక చోట స్థిరంగా నిలవదు. పరి పరివిధాలా పరుగులు తియ్యడం దాని మౌలిక స్వభావం. మనసు అనవసర విషయాల గురించి ఆలోచించినంత కాలం అది కలుషితం అవుతూంటుంది.

బంగారపు గోడ అయినా మట్టి గోడ అయినా ఒకటే. గోడ అంటేనే అవతల ఉన్నదాన్ని కనపడనీయకుండా అడ్డుపడేది. అలాగే, ఆలోచించడం మనసును మసక బారుస్తుంది. కానీ ఆలోచించకుండా మనిషి మనుగడ సాగదు. అది అనివార్యమైంది.
అడ్డూ అదుపూ లేకుండా ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెడితే అనతికాలంలోనే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ తరవాత ఇబ్బందుల పాలు కావాల్సివస్తుంది. అందు వల్లే ఆచి తూచి ఖర్చుపెడుతుంటారు. ఆలోచన విషయంలోనూ అంతే. అది చైతన్య స్వరూపం. అనవసర ఆలోచనలు ఎక్కువయ్యే కొద్దీ ఆనంద నిధి తరిగిపోతుంది. కాబట్టి ఆలోచనాశక్తిని వృథాగా ఖర్చు పెట్టకూడదు. బాల్యంలో జీవితం ఆనందంగా 
గడిచిపోవడానికి కారణం ఆలోచనల సాంద్రత తక్కువుండటమే. వృద్ధాప్యంలో బతుకు మనోవేదనతో నిండిపోవడానికి మూలం ఆలోచనల సాంద్రత ఎక్కువ కావడం.

గాలిని ప్రత్యక్షంగా చూడలేం. అందుకని చెట్ల కొమ్మల కదలికలు గమనించి గాలి వీస్తున్న భావనకు గురవుతాం. అదే రీతిన మనసు కూడా. అది ఆలోచనల రూపంలో చలిస్తూ ఉంటుంది. నిర్విరామంగా కదిలే ఆలోచనల సమాహారాన్ని ధ్యానసాధనతో తదేకంగా గమనించడం వల్ల చూసేవాడు (కర్త), చూసేది (కర్మ)... రెండూ విడిపోతాయి. అప్పుడు ఆలోచనా ప్రవాహం శక్తి సన్నగిల్లుతుంది. ఆలోచనల భారం లేనందువల్ల మనసు తేలికపడి పునరుత్తేజితమవుతుంది. పరిశుద్ధమైన అద్దంలా పనిచేస్తుంది. అందులో మనిషి తన అంతరంగాన్ని అవలీలగా దర్శించుకోవచ్చు.

 మానస సరోవరం 👏

No comments:

Post a Comment