Wednesday, August 12, 2026

 💐శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామీజీ విరచిత💐
🏵️మంత్రమూలం గురోర్వాక్యం🏵️

 Part-78
                           🌹శిథిల విగ్రహాలు🌹

సిద్ధగురువులకు నమస్కారములు. ఈ యంత్ర విధానానికి సంబంధించినంత వరకు పూజలు చేసేటప్పుడు యంత్రాలు, విగ్రహాలు మొదలైన వాటిని పూజచేస్తూ ఉంటారు. చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇంట్లో శ్రీచక్రం పెట్టుకొని పూజ చేయవచ్చునా అని చాలా మంది అడుగుతూ వుంటారు. మేరుప్రస్తారం మామూలుగా స్పటికంతో చేసినటువంటివి, వెండితో చేసినవి, పంచలోహాలతో చేసినవి, బంగారంతో చేసినవి ఇట్లా రకరకాలుగా అమ్ముతూ వుంటారు. వాటిని ఇంట్లో పెట్టుకోవచ్చునా! అంటే ఇంట్లో పూజ చేసుకోవాలన్న కోరిక ఉన్నపుడు తప్పకుండా పెట్టుకోవచ్చు. దాంట్లో దోషమేమీ లేదు. దానికి ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యం నైవేద్యములు పెట్టాల్సి వుంటుంది. 

పూజ చేసేవాళ్ళకు మరొక పరిస్థితి వస్తుంది. అనేక సంవత్సరాలు పూజ చేసిన తరువాత కొన్ని యంత్రాలు పాడైపోతూ వుంటాయి. అంటే వంగిపోవడం, చిల్లులు పడడం, అట్లనే విగ్రహాలు కూడా ఏదో చెయ్యి విరగడం, కాలు విరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏం చేయాలండీ అని అడుగుతూ ఉంటారు.అంటే మామూలుగా శాస్త్రం ప్రకారం అయ్యేటట్లైతే వాటిని జీవశక్తి ఉన్నటువంటి నదిలో సమర్పించడం చిరకాలంగా వస్తున్నటువంటి ఆచారం. అలా దేవాలయాలలో కూడా ఆ విధంగా అనేక విగ్రహాలను సమర్పించడం జరుగుతుంది. అలా జరిగి కొన్ని సంవత్సరాలైపోయి మరిచిపోయిన తరువాత ఆ విగ్రహాలు ఎవరికైనా దొరికితే నాకు నదిలో ఆ విగ్రహం దొరికింది అని తెచ్చుకొని పూజించుకుంటున్న వాళ్ళు ఉంటారు. అక్కడక్కడ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. నదిలో మనకోసం భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటూ ఉంటారు.

 కలకత్తాలో అన్నదాఠాకూర్ కథ ఒకటి ఇట్లానే ఉన్నది. అన్నదాఠాకూర్కు ఒకరోజు కల వచ్చింది. కలవస్తే అందులో కాళీదేవి నేను గంగానదిలో ఫలానాచోట ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి పూజించు అని అన్నది. వెదికితే కాళీ విగ్రహం కనిపించింది. కాళీదేవిని తెచ్చి పెట్టుకున్నాడు. పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుంటే చాలా మంది వచ్చారు. ఇది పురాతనమైన విగ్రహం, నీకు చాలాడబ్బు ఇస్తాము, కొన్ని వేలు ఇస్తాము నీ జీవితమంతా గడుస్తుంది ఆ విగ్రహాన్ని ఇవ్వమని వచ్చారు. నేను ఇవ్వలేను అని అన్నదాఠాకూర్ అన్నాడు. తరువాత ఏం జరిగిందో ఏమో నాలుగోరోజు కాళీదేవి కలలో కనిపించి ఇక చాలు, నేను ఉండదలుచుకోలేదు, నాకేమిటో సంతృప్తిగా లేదు, ఈ పూజలు, ఈ గందరగోళాలు నచ్చలేదు. నన్ను మళ్ళీ తిరిగి గంగలో వేసేయి అని అన్నది. అమ్మా! ఇంతకాలం పూజ చేస్తున్నాను, తల్లీ అనుగ్రహించు అన్నాడు. నేను చెప్పిన పని చెయ్యకపోతే నేను నిన్ను చంపుతాను, అని కాళీదేవి అన్నది. దాంతో భయపడిపోయి ఆ విగ్రహాన్ని నదిలో వేసేశాడు. కలకత్తాలో అన్నదాఠాకూర్కు ఆశ్రమం కూడా ఉన్నది. 

ఇలా విగ్రహాలను నదిలో వేయడం, సరస్సులో వేయడం, జీవశక్తి ఉన్నచోట విరిగిపోయినటువంటి వాటిని వేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏమిటని అంటే ఆ దేవతలకు ఆ విగ్రహంలోనుంచి పోవడం అంత ఇష్టం ఉండదు. కానీ శాస్త్రంలోనేమో పూజ చేయకూడదు అని ఉన్నది. అందరికీ దివ్యదృష్టి ఉండదు. ఆ దేవత ఏమి చెబుతుందో తెలుసుకునేంత శక్తి వుండదు. అట్లాంటప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటని అంటే, కొందరు చేసే మార్గం పాతవిగ్రహాన్ని అక్కడే వెనుక పెట్టి, కొత్తవిగ్రహం ముందుపెట్టి పూజ చేస్తూ వుంటారు. అంటే ఆ క్రొత్త విగ్రహానికి అందేటటువంటి పూజలు, దాని మీద వేసే పూలు, పాత విగ్రహం మీదకూడా పడుతూ వుంటాయి. అందువల్ల దేవత సంతోషిస్తుందని చెప్పి, ఇట్లా పాత విగ్రహాల ముందు క్రొత్త విగ్రహాలు పెట్టడం అనేటటువంటి పద్ధతి వచ్చింది. కాశీలో విశాలాక్షి మందిరంలో కన్పిస్తుంది. ఆ విగ్రహాలను తొలగించడం, ఏదైనా చెడిపోయేటట్లైతే పారవేయడం అనేక కష్టనష్టాలతో కూడినటువంటి పని. ఎందుకంటే ఆ పురాతన దేవతలు వాళ్ళంత తొందరగా ఆ మందిరంలోనుంచి, ఆ విగ్రహంలోనుంచి పోవడానికి ఇష్టపడరు. వాటిని చాలా జాగ్రత్తగా తెలుసుకోక పోయేటట్లైతే దానివల్ల ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. 

కాగా యంత్రాలు, విగ్రహాలు ఇంట్లో పూజ చేసుకోవచ్చును అన్నదాంట్లో మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదు. చెడినవాటిని పారేయడం ఇష్టం లేకపోయేటట్లైతే ఏదో కొత్తవిగ్రహం క్రింద పాతవిగ్రహం పెట్టుకోవచ్చు. ఈ విధంగా దేవాలయాల్లో అయ్యేటట్లైతే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పాతవిగ్రహం పోయినపుడు గర్త నిక్షేపణము అని అంటారు. అంటే గొయ్యి తవ్వి ఆ పాడైపోయిన యంత్రాలను, విగ్రహాలను పాతేసి దానిపైన క్రొత్త విగ్రహాన్ని, క్రొత్త యంత్రాన్ని పెట్టేటటువంటిది. దీనికి ఏ ఆక్షేపణా లేదు. ఆ విగ్రహం అక్కడే వుంటుంది కానీ ప్రజలకు కనబడదు. కనుక ఈ విగ్రహాలను, యంత్రాలను పూజచేయడం అనేటటువంటిది తెలుసుకొని చాలా జాగ్రత్తగా చేయవలసి వుంటుంది.

( సశేషం )

No comments:

Post a Comment