ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻
ప్రశ్న :
భగవాన్! మానవులకు దుఃఖము ఎందుకు కలుగుతున్నది?
మహర్షి :
ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మనం చూసే వస్తువులన్ని మన నుండి విడిగా కనపడవు. కాగితం మీద అక్షరాలను మాత్రమే చూస్తూ ఉంటే, ఆ అక్షరాలకు ఆధారమైన కాగితాన్ని అంతగా చూడలేము కదా!
అలానే అన్నింటికీ మూలాధారమైన దానిని(ఆత్మను) చూడకుండా దానిమీద మనం పేర్చుకున్న వాటిని చూడటం వలనే దుఃఖం కలుగుతున్నది.
*రమణభాషణము*
భక్తుడు :: గురువును కనుగొనటం ఎలా?
మహర్షి :: సర్వవ్యాపకుడైన భగవంతుడు అవ్యాజమైన కృపచేత, తన ప్రియభక్తునిపై జాలి వహించి, అతని పరిణతికి అనుగుణమైన రీతిలో ప్రత్యక్షమవుతాడు.
భక్తుడా గురువును మానవ మాత్రుడని భావించి, రెండు భౌతిక దేహాల నడుమ ఉండే విధంగా ఆయనతో సంబంధాన్ని పెట్టుకో జూస్తాడు.
మానవదేహాన్ని దాల్చి వచ్చిన భగవంతుడు లేక ఆత్మ అయిన ఆ గురువు భక్తుని హృదయంలో మార్పు తెస్తాడు;
తాను పోయే దారి తప్పు అని అతడు గ్రహించేలా చేస్తాడు;
అతడు తనలోని ఆత్మను సాక్షాత్కరించుకొనేంతవరకు సరియైన దారిలో అతనికి మార్గదర్శనం చేస్తాడు.

No comments:
Post a Comment