Tuesday, February 11, 2020

పుష్పక విమానం

పుష్పక విమానం

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.
సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు.
నిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో 'పుష్పకం' అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట.
ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదుట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములుగల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట.

No comments:

Post a Comment