Thursday, February 13, 2020

శివా..!! సత్యం భోదించే నీకన్నా అందగాడు వేరెవరు “శివా”

శివా..!!

నువ్వేమీ అందగాడివి కాదు నా కళ్ళకు!

ఒంటికి సుగంధ లేపనాలు లేవు
పులుముకునే బూడిద తప్ప!

కట్టుకోను వస్త్రం లేదు
చచ్చిన పులి చర్మం తప్ప!

కేశాలకు ఒద్దికలేదు
‌మర్రి ఊడల్ని పోలు జడలు తప్ప!

మెడలో నగలే లేవు
కఠిన పాషాణాలైన రుద్రాక్ష హారాలు తప్ప!

పూమాలల అలంకరణే లేదు
‌నిత్యం మెదిలే కాల సర్పాలు తప్ప!

అరమూతలైన ఆ కళ్ళకు తోడు
లలాటాన ఆ మూడో నేత్రమొకటి!

ఒక చేత త్రిశూలం!
మరో చేత కపాలం!!

నిత్యం మరణ మృదంగ ధ్వనినాలపించే
ఢమరుక ధారుడవై స్మశానాన సంచరించే

నువ్వేపాటి అందగాడివి “శివా” నా కళ్ళకు!

కానీ....

నా మనో నేత్రంతో చూస్తే –

మా పాపలను భస్మరాసిగ పోసి
నీ శరీరనికి లేపనంగా
పూసుకుంటూ
నీతో చివరికంటూ వచ్చేది ఏదీ లేదని,

పైపై అందాలన్ని ప్రాణాలున్నంత వరకేనని,

పరమ పదాన్ని చేరే దారులన్ని కఠినతరమేనని,

స్వార్ధమనే కాలకూట విషంలో నిలువెల్లా కూరూకోకని,

నీ కళ్ళను ఏమార్చే నిజాలను మనోనేత్రంతో చూడమని,

త్రికాలాలు నన్ను ధ్యానిస్తేనే –
కర్మఫలాలను మోసే మీకు కపాల మోక్షమని,

నాది,నాది అని గొప్పలుపోయే నీకు
నీదంటూ ఇక్కడ ఏదీలేదని,

నీవెంత ఎత్తుకు ఎదిగినా
ఇక్కడి మన్నులో కలాల్సినవాడివేనంటూ

స్మశానవాసివై సంచరిస్తు
నిరంతరం నన్ను జాగురపరచే నా తండ్రి...

సత్యం భోదించే నీకన్నా అందగాడు వేరెవరు “శివా”!!

ఓం నమఃశివాయ🙏🏻

No comments:

Post a Comment