Monday, February 10, 2020

విజేత విశ్వాసం

విజేత విశ్వాసం
🕉🌞🌎🏵🌼🚩

విశ్వాసం, విజయానికి సంబంధం ఏమిటి? విజేతలను వారి విజయరహస్యాల గురించి ప్రశ్నించినప్పుడు దాదాపు అందరూ ఒకే విషయం చెప్పారు. నీలో నీకు విశ్వాసం ఉండాలి. నీకు కలలు కనడం రావాలి. నీ కలలో విశ్వాసం ఉండాలి. అంతకంటే ముఖ్యం- భగవంతుడిలో విశ్వాసం ఉండాలి.

హైందవ సంస్కృతిలో విశ్వాసానికి ప్రాధాన్యం ఉంది. ఇతర మత గ్రంథాలు విశ్వాసం మీద ఆధారపడి బోధిస్తాయి. విశ్వాసానికి నిఘంటువు అర్థం ఇలా వివరిస్తుంది. పూర్తి నమ్మకం, అభయం: దృఢమైన నమ్మకం, సందేహంలేని నమ్మకం... దేవుడి పట్ల, దేవుడి ప్రేమ పట్ల.

విశ్వాసం అంటే మనకు వెలుగునిచ్చి, శక్తినిచ్చే, ప్రోత్సహించే భావన. ఒడుదొడుకుల్లో మనల్ని రక్షించే ఒక సృష్టికర్త ఉన్నాడనే అవగాహన. అన్నింటిలాగే విశ్వాసం కూడా ఒక నిర్ణయం.

విశ్వాసాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పట్టించుకోరు. ఆ కారణంగా లాభం పొందలేరు. ప్రతిరోజూ మనకు తెలియకుండానే మనం విశ్వాసం ప్రదర్శిస్తుంటాం. విశ్వాసాన్ని చూడలేరు కనుక చాలామంది విశ్వాసం అనేది అసలు ఉందా అని సందేహిస్తారు. మనం చూడని, చూడలేకపోయినా ఫలితాలను చూడగల నమ్మకం విశ్వాసం. మన ఇంట్లోకి విద్యుత్తు రావడం మనం చూడలేం. లైటు వెలిగినప్పుడు మాత్రమే మనం దాని ఫలితం చూస్తాం. అయినా మనం విద్యుచ్ఛక్తి గురించి ప్రశ్నించం. మనం గాలిని చూడలేం కానీ, తుపాను ఫలితాలు మాత్రం చూడగలం.

జీవిత సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. ఆ సందర్భాలు మనందరి అనుభవంలోనూ ఉంటాయి. విశ్వాసం తప్ప ఆధారపడటానికి మరేదీలేని సందర్భాలు ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత పలుకుబడి, అధికారం ఉన్నా మనం నియంత్రించలేని సమస్య వచ్చినప్పుడు జీవితం మరింత కష్టంగా ఉంటుంది. ఆ సందర్భాల్లో మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం పట్ల నిబద్ధత కావాలి.

జీవితంలో గడ్డు క్షణాలుంటాయి. తుపానులు మీద పడతాయి. విశ్వాసం కలిగి ఉండాలి. తప్పక రక్షణ దొరికి బయటపడతాం. సందేహంలేదు.
జీవితం అనుకోనిచోట దెబ్బకొడుతుంది. అప్పుడప్పుడు కింద పడేస్తుంది. కానీ, దెబ్బను సహించడానికి భవిష్యత్తు గతంలా ఉండదని తెలుసుకోవడానికి మనకు విశ్వాసం కావాలి. భవిష్యత్తులో మంచి అవకాశాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి .
జీవితం మనల్ని కిందపడేస్తే, శ్రీకృష్ణుడు లాంటి స్నేహితుడు ఒకడుండి భుజాలు పట్టుకులేపి మనకు ధైర్యాన్ని నూరిపోసే పరిస్థితి ఎదురైతే మంచిదే. కాకపోతే మనకు మనమే అంతరంగంలో స్ఫూర్తిని కలగజేసుకొని పరమాత్మను తలచుకొని పైకిలేవాలి. ఎందుకంటే ‘మనం పైకి చూడగలిగితే పైకి లేవగలం’ అంటాడు ఒక ఆధ్యాత్మిక చైనా గురువు.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ విశ్వాసాన్ని, పట్టుదలను పరీక్షించే సమస్యలుంటాయి. సమస్యలు ఎదురైనా, అవి ఇక్కడ ఉండిపోవడానికి రావు. అవి వెళ్ళితీరాలి. నమ్మడానికే విశ్వాసం ఉంది. దానివల్లే మనం ఎదుగుతాం. మనందరికీ సమస్యలున్నాయి. మనందరికీ కష్టాలున్నాయి. కానీ, అవి వెళ్లడానికే వచ్చాయి. అవి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోలేవు. విశ్వాసం కలిగి ఉండాలి. పట్టువదలకూడదు.*

🕉🌞🌎🏵🌼🚩

విశ్వరూప సందర్శనం తరవాత అర్జునుడు యుద్ధం చెయ్యలేదు. విశ్వాసమే ప్రాతిపదికగా కురుక్షేత్ర సంగ్రామంలో ఓ పనిముట్టుగా మారాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని తోలితే, అర్జునుడు శరణాగతి అనే రథంలో కూర్చుని జరుగుతున్నదాన్ని సాక్షిగా వీక్షించాడు. అంతటి అద్భుతమైన విశ్వాసమే నిజమైన విజేతగా అతణ్ని నిలిపింది.

No comments:

Post a Comment