Monday, March 2, 2020

హృదయ సంస్కారం

హృదయ సంస్కారం

హృదయంలో పవిత్రత ఉంటే ప్రవర్తనలో ఉదాత్తత ప్రతిఫలిస్తుంది. ప్రవర్తనలో ఉదాత్తతవల్ల కుటుంబంలో సామరస్యం పరిఢవిల్లుతుంది. కుటుంబంలో సామరస్యం సమాజంలో క్రమబద్ధతగా ప్రతిబింబిస్తుంది. సమాజం క్రమబద్ధంగా సాగితే ప్రపంచమే శాంతిమయమవుతుంది. ఒక్క ముక్కలో ప్రపంచం ప్రశాంతంగా ఉండటానికి హృదయంలోని నిర్మలత్వమే ప్రధాన కారణం. హృదయంలో చీకటి ఉంటే ప్రపంచంలోనూ చీకటి కనిపిస్తుంది. అక్కడ వెలుగు ఉంటే అంతటా వెలుగే గోచరిస్తుంది. హృదయంలో మెరిసే మెరుపునకు ప్రపంచం ఒక ప్రతిబింబం. అక్కడి ధ్వనికి ప్రపంచం ఓ ప్రతిధ్వని. అందుకే ప్రపంచ పరిశీలనకన్నా ముందు మన హృదయ పరిశీలన ప్రధానమైంది. ప్రపంచ ప్రక్షాళనకన్నా ముందు మన హృదయప్రక్షాళన ముఖ్యం.


సాధారణంగా మనం ఆ ప్రక్షాళన ఏదో ప్రపంచం నుంచి ముందు ప్రారంభం కావాలనుకుంటాం. లోకాన్ని చూసినంత తీక్షణంగా మన లోనికి తొంగి చూసుకోవడానికి సాహసించం. లోవెలుగులు ప్రకాశింపజేసుకునేందుకు ప్రయత్నించం. లోకాన్ని ఎత్తిచూపడంలో కన్నా, మనల్ని మనం నిలదీసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అందుకే రమణ మహర్షి ‘లోపల అన్వేషించు; నీ ఆనందమయ స్థితిని గ్రహించు. నిర్మలం, శాంతియుతం అయిన నీ జీవనం, నీ ఆలోచన- నీవు ఊహించని రీతిలో లోకాన్ని సుసంపన్నం చేస్తాయి’ అనేవారు.

నిజానికి మన తక్షణ కార్యాచరణ అంతరంగం నుంచి బహిరంగంవైపు సాగిపోవాలి. పరిసరాలను మార్చినంత మాత్రాన ప్రపంచం మారిపోదు. ముందు మన మనస్తత్వం మారాలి. సరిచేసుకోవలసిన అగత్యం సమాజానికి లేదు. సర్దుకోవలసిన అవసరం మనకే ఉంది. నిరంతరం సాటి వ్యక్తుల నుంచి, వ్యవస్థ నుంచి మనం సానుకూలమైన అంశాలనే ఆశించడం వల్ల భంగపాటు తప్పదు. ‘ఇవి ఇలానే ఉండాలి. వీళ్ళు ఇలా వ్యవహరించాలి’ అని ఆజ్ఞాపించే అధికారం మనకెవరికీ లేదు. అన్నింటినీ ఆమోదించి, అంగీకరించడంలోనే మన విజ్ఞత, విశిష్టత, పరిణతి, ప్రశాంతత ఆధారపడి ఉన్నాయి. పరిమితమైన అనుభవంతో ఆలోచిస్తే మనకు ఎదురైన సంఘటనలు కొన్నిసార్లు అసాధారణంగా, అసంబద్ధంగా తోచవచ్చు. దృష్టిని విశాలం చేసుకుంటే ఏదీ అసాధారణం కాదని అవగతమవుతుంది. అలా అని అన్నింటినీ సమర్థించమని కాదు. నిశ్చలమైన మనసుతో వాటి నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. మేధాపరమైన ప్రణాళికలతో పోలిస్తే హృదయపరమైన ప్రణాళికలతో శాశ్వతమైన, సానుకూలమైన శుభపరిణామాలు సంభవిస్తాయి. ‘ఆ భగవంతుడి సృష్టిలో ఏదైనా సంభవించవచ్చు. దేనికీ ఉద్రేకపడకూడదు’ అని యుక్త వయసులో తన తండ్రి చేసిన సూచన- జీవితపర్యంతం మార్గదర్శక సూత్రమై నిలిచిందన్నారు స్వామి వివేకానంద. అందుకే ఏ పరిణామమూ, ఎవరి ప్రవర్తనా తనను ఆశ్చర్యపరచకపోయేవని చెప్పేవారు.


మనకు, సమాజానికి మధ్య తరచూ సంఘర్షణ తలెత్తుతోందంటే లోపం ఎక్కడో మనలోనే ఉందని గుర్తించాలి. మనలో మనం సమాధానం పడలేకే, సంఘంతో సమాధానపడలేకపోతున్నాం. గడియారంలోని సాంకేతిక అమరికపై అవగాహన లేని వ్యక్తికి లోపలి భాగాలన్నింటినీ చూసినప్పుడు అవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయనిపిస్తుంది. కానీ, ఆ ఘడి యంత్రంపై పరిజ్ఞానమున్న వ్యక్తికి అవన్నీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయని అర్థమవుతుంది. అలాగే పరిమితమైన దృష్టి కలిగిన వారికి ప్రపంచమంతా అసమగ్రంగా తోస్తుంది. పరిణతి కలిగిన వారికి అంతా సర్వసాధారణంగానే కనిపిస్తుంది. సమాజం మొత్తానికి ప్రతి మనిషీ ఒక నమూనా! అందుకే ఏ మార్పు అయినా ముందు మనలోంచే ప్రారంభం కావాలి. సమాజ సంస్కరణకు తొలుత మన హృదయసంస్కారం నుంచే శ్రీకారం చుట్టాలి.👏

No comments:

Post a Comment