Monday, March 9, 2020

సర్వం ఖల్విదం బ్రహ్మ

🙏🙏🙏🙏 ఓం 🙏🙏🙏🙏

22.2.2020

సర్వం ఖల్విదం బ్రహ్మ.
---------------------------------

నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిమ్
విశ్వాతీతం గగన సదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ !
ఏకం సత్యం విమలమచలం సర్వ ధీ సాక్షి భూతమ్
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి !!

శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్ !
నమామి భగవత్పాద శంకరం లోక శం కరమ్ !!

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం !
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరామ్ !!

"సర్వం ఖల్విదం బ్రహ్మ, తజ్జలానితి శాంత ఉపాశీత", అని ఛాందోగ్యోపనిషత్తులోని తృతీయ ప్రపాఠకము, చతుర్దశ ఖండములోని మంత్రము బోధిస్తున్నది. "ఇదం సర్వం బ్రహ్మ ఖలు" ఈ కనిపిస్తున్న విశ్వమంతా పరబ్రహ్మమే ! సర్వము బ్రహ్మము లోనుంచే వస్తున్నాయి, బ్రహ్మము వల్లనే వర్ధిల్లుతున్నాయి, బ్రహ్మము లోనే లీనమవుతున్నాయి.
'తస్మాత్' జాయతే, 'తస్మిన్' లీయతే, 'తేన' అస్తి ఇతి తజ్జలాని. 'తజ్జలాని' అని తెలుసుకుని శాంతముగా ఉపాసించ వలెను. 'తజ్జలాని' అంటే, తజ్జత్వాత్, తన్నిష్ఠత్వాత్, తల్లత్వాత్ - అని తెలుసుకోవాలి. 'తత్' అంటే ఆ పరబ్రహ్మము. 'జన్ - జా' అను ధాతువునకు అర్ధము పుట్టుట, అనగా సృష్టి, తజ్జత్వము. 'ల, లీ- లయ్' అను ధాతువునకు కలిసిపోవుట, కరిగిపోవటము అని అర్ధము. అనగా లయము, తల్లత్వము. 'అన్' అనగా ఉండటము, సృష్టి కొనసాగటము. స్థితి అని అర్ధము. తన్నిష్ఠత్వము. నిష్ఠ అనగా అందులోనే ఉండటము, పోషింపబడటము అని అర్ధము. కనుక ఈ దృశ్య జగత్తంతా "తజ్జలాని".

నీరు అధిష్ఠానముగా కలిగిన అలలు, బుడగలు, సుడిగుండాలు మొదలైనవన్నీ సముద్రంలో నీటిలో పుట్టి, నిలిచి, లయించిపోయినట్లుగానే, ఈ దృశ్య జగత్తంతా తనకు అధిష్ఠానమైన బ్రహ్మము నుంచి ఉద్భవించి, వర్ధిల్లి, బ్రహ్మములో లయించిపోతున్నది. ఇలా చెప్పటము కూడా మన వ్యవహారానికి మాత్రమే ! ఉన్నది కేవలము బ్రహ్మమే ! ఈ జ్ఞానము కలగటమే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'మును అనుభవించటము, అర్ధం చేసుకోవటము.

"ఇదం సర్వం యదయమాత్మా". ఈ కనిపించే సర్వము ఆ ఆత్మయే ! పరబ్రహ్మమే !
"బ్రహ్మైవేదం సర్వం"!
అనగా ఈ సర్వము బ్రహ్మమే ! పరమాత్మయే ! మహా మహిమాన్వితమైన "సర్వం ఖల్విదం బ్రహ్మ " అన్న ఒక్క సత్యాన్ని, నిత్య సత్యాన్ని చెప్పటానికే నాలుగు మహావాక్యములు వచ్చాయి. ఈ నాలుగు మహావాక్యములను వివరించటానికి అనేకమైన మహావాక్య సదృశ వాక్యములు వివరింపబడ్డాయి. ఈ ఉపనిషత్సార వాక్యార్ధ బోధ కొరకే ఇంతటి వేదరాశి, ఇతిహాస పురాణాలు, శాస్త్రాలు అన్నీ ఏర్పడ్డాయి. అనంతమైన స్తోత్రాలు గద్యపద్య రచనలు అన్నీ అనుగ్రహించబడ్డాయి. అనగా సర్వ శాస్త్ర సారము ఉపనిషత్తులలో జ్ఞాన బోధక వాక్యములుగా బోధింపబడుతున్నది. అనంతమైన ఆ వాక్యముల సారము సూత్ర సదృశమైన, బీజ భూతములైన నాలుగు మహావాక్యములుగా చెప్పబడినది. నాలుగు మహావాక్యముల సారమే ఛాందోగ్యోపనిషత్తులోని "సర్వం ఖల్విదం బ్రహ్మ". దీనిని మనం "మూలాధార మహావాక్యము" గా చెప్పవచ్చును.

శ్రీ శుక రహస్యోపనిషత్తులో ఈ నాలుగు మహావాక్యములు ప్రస్తావించ బడ్డాయి. వేదవ్యాస మహర్షి తన కుమారుడైన శ్రీ శుకునకు బ్రహ్మోపదేశం చెయ్యమని పరమేశ్వరుని ప్రార్ధించారు. సాంబసదాశివుడు శ్రీ శుక మహర్షికి శాశ్వతము, కైవల్య ప్రదమగు బ్రహ్మోపదేశమును, ప్రణవ సహితముగా నాలుగు మహావాక్యముల రూపమున ఉపదేశించారు.

"అథ మహావాక్యాని చత్వారి. యథా, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, ఓం అహం బ్రహ్మాస్మి, ఓం తత్త్వమసి, ఓం అయమాత్మా బ్రహ్మ ".

మహావాక్యములను షడంగములతో వివరించారు. పరమేశ్వరుని చేత రహస్యోపనిషదుపదేశమును పొందిన శ్రీ శుకమహర్షి జగత్తు పరబ్రహ్మములో లీనమగుటను అనుభవించి, తానే జగత్స్వరూపులుగ, బ్రహ్మ స్వరూపులుగ పరిణమించి, పరమ వైరాగ్య భావమును పొంది, బ్రహ్మానంద మగ్నుడై అడవిలో వెళ్ళిపోతుంటే, బ్రహ్మ సూత్రములను, అష్టాదశ పురాణములను, శ్రీ మహాభారతాది గ్రంథరాజములను రచించిన, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపులైన వేదవ్యాస భగవానులు పుత్ర మోహంతో 'హా కుమారా ! నన్నొదిలి వెళ్ళకు నాయనా !' అంటూ ఎలుగెత్తి అరుస్తూ కొడుకు వెంట పరుగెత్తారట. శ్రీ శుక బ్రహ్మము సకల జగత్స్వరూపమును పొందుట వలన, అప్పుడు సర్వ భూతములు ఆయన పలుకులకు ప్రతిధ్వనించాయి. తన పుత్రుడు సర్వమయుడని గ్రహించి వ్యాసమహర్షి పరమానందం పొందారు. శ్రీమద్భాగవతము రచించి పరమ శాంతిని పొందారు.

అసలు మహావాక్యము అంటే ఏమిటి ? గొప్ప వాక్యము. 'మహత్ చ ఇదం వాక్యం మహావాక్యమ్'. పరమోత్కృష్టమైన వాక్యము. జ్ఞాన కాండ అయిన ఉపనిషత్తులు పరబ్రహ్మమును 'మహతో మహీయాన్' అంటాయి. గొప్పవాని కంటే గొప్పది.

వాక్యము అనగా చెప్పబడినది. వచ్ - చెప్పుట, వాచ్యము - చెప్పదగినది, చెప్పబడినది. 'మహత్' అయిన పరతత్త్వమును గురించి చెప్పబడిన వాక్యము మహావాక్యము. పరబ్రహ్మమును గురించి చెప్పునవి కనుక మహావాక్యములు అత్యంత రహస్యములు. ఇంద్రియాతీత జ్ఞానము కనుక అది రహస్యమైనది.
అపౌరుషేయ వేదముల యొక్క గూఢ భావము మహావాక్యములలో చెప్పబడినది. అవాఙ్మానస గోచరమైన, అనుభవైక వేద్యమైన పరబ్రహ్మమును గ్రహించుటకు ఉపకరించు బోధలు మహావాక్యములు. మహర్షులకు, యోగులకు తపస్సమాధి స్థితిలో సాక్షాత్కరించిన, స్ఫురించిన నిత్య సత్యముల సారము మహావాక్యములు.

నాలుగు వేదములకు సంబంధించిన ఉపనిషత్తుల నుండి ఒక్కొక్క వేదము యొక్క సారముగా ఆ వేదమునకు సంబంధించిన ఒక్కొక్క ఉపనిషత్తు నుండి ఒక్కొక్క మహావాక్యము స్వీకరింపబడినది.

ఋగ్వేదమునకు సంబంధించిన ఐతరేయోపనిషత్తులోని "ప్రజ్ఞానం బ్రహ్మ", యజుర్వేదమునకు చెందిన బృహదారణ్యకోపనిషత్తులోని "అహం బ్రహ్మా2స్మి", సామవేదాంతర్గతమగు ఛాందోగ్యోపనిషత్తులోని "తత్త్వమసి", మరియు అథర్వణ వేదాంతర్గతమగు మాండూక్యోపనిషత్తులోని "అయమాత్మా బ్రహ్మ " అనునవి నాలుగు మహావాక్యములు.

ఉపనిషత్తులలో అనేకములైన గొప్ప వాక్యములున్నను, ఈ నాలుగే మహావాక్యములు అని మనకు శుకరహస్యోపనిషత్తు వలన తెలియుచున్నది. మరి ఈ నాలుగు మహావాక్యములకు, ఇతర ఉపనిషద్వాక్యములకు గల తేడా ఏమిటి ? అని పరిశీలిద్దాము. ఉన్న ఒకే ఒక్క పరబ్రహ్మమును, పరతత్త్వాన్ని మనం అనేక నామరూపాలతో కొలుస్తున్నాము. అలాగే ఉపనిషత్తులలోని గొప్ప గొప్ప వాక్యములన్నీ ఆ ఒకే ఒక్క పరబ్రహ్మమును గురించే చర్చిస్తున్నాయి. అన్ని వాక్యములు పరబ్రహ్మమును గురించే వివరిస్తున్నాయి. కానీ ఈ నాలుగు మహావాక్యములు కలిసి సంపూర్ణముగా, సమగ్రముగా పరబ్రహ్మమును బోధపరుస్తున్నాయి. ఈ మహావాక్యములు అరణి సదృశములై, సూత్రప్రాయములై, బీజ రూపములై సర్వ వేదోపనిషత్సారమైన మూలాధార మహావాక్యమును, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన "సర్వం ఖల్విదం బ్రహ్మ" ను బోధిస్తున్నాయి. 'సా కాష్ఠా సా పరా గతిః' అన్నట్లుగా అదే పరమమైనది. దీనికి మించి మరొకటి లేదు.

మొదటి మహావాక్యము "ప్రజ్ఞానం బ్రహ్మ ". ప్రకృష్టమైన జ్ఞానము ప్రజ్ఞానము. దీనిని "వివరణ వాక్యము" అంటారు. జ్ఞానము అనేదే బ్రహ్మము. జ్ఞానము అంటే తెలివి, తెలుసుకొనుట. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అను త్రిపుటి జ్ఞానమే ప్రజ్ఞానము. త్రిపుటి ఏకమవటమే ప్రజ్ఞానము. జ్ఞానము అంటే ఎరుక. జ్ఞానము అనేది లౌకిక జ్ఞానము, పారలౌకిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము కూడా. జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానములు మన అనుభవములోనివే. పంచ జ్ఞానేంద్రియముల ద్వారా, పంచ కర్మేంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా, పఠన, శ్రవణ, మనన, నిదిధ్యాసనల ద్వారా జ్ఞానము కలుగుతున్నది. వాక్కు ద్వారా జ్ఞానము కలుగుతుంది. వాక్కు చేత, బుద్ధి చేత చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, యజ్ఞ యాగాలు, సర్వ జ్ఞానము తెలియుచున్నది. విశ్వము గ్రహించబడుచున్నది. సర్వ జీవరాశి గురించి, స్థావర జంగమాత్మక ప్రకృతి గురించి తెలియుచున్నది. భూతభవిష్యద్వర్తమానములను తెలుసుకుంటున్నాము. అటువంటి వాక్కు వల్ల, బుద్ధి వల్ల తెలియబడు జ్ఞానము ప్రజ్ఞానము. సృష్టిలో వేటివేటి నుంచి జ్ఞానము పొందుతున్నామో అవన్నీ బ్రహ్మము యొక్క అంశములే. సృష్టి రూపములో ప్రకటితమవుతూ, యావద్విశ్వానికీ ఆధారమయి, విశ్వ స్వరూపమయి, విశ్వాతీతమైన చిచ్ఛక్తే పరబ్రహ్మము అని అనుభవముతో తెలుసుకోవటమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానమే బ్రహ్మ. భౌతిక స్థితిలో తెలిసే జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము. అది అపరోక్షమవాలి.

తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లిలో అపరోక్ష జ్ఞానము తపస్సు ద్వారా సిద్ధిస్తుందనీ, అంతర్ముఖ స్థితిలో విజ్ఞానము గోచరిస్తుంది కనుక విజ్ఞానమే బ్రహ్మమని చెప్పబడింది.
"విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్".

"యదేతద్హృదయం మనశ్చైతత్. సంజ్ఞాన, మాజ్ఞానం, విజ్ఞానం, మేథా, దృష్టిర్ధృతిర్మతిర్మనీషా, జూతిః, స్మృతిః, సంకల్పః, క్రతురసుః, కామో, వశ ఇతి సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవన్తి. సర్వం తద్ప్రజ్ఞా నేత్రం. ప్రజ్ఞానే ప్రతిష్ఠితం. ప్రజ్ఞా నేత్రో లోకః. ప్రజ్ఞా ప్రతిష్ఠా. "ప్రజ్ఞానం బ్రహ్మ".

సర్వము ప్రజ్ఞానమునందే ప్రతిష్ఠింపబడి, ప్రజ్ఞానము ఆధారముగా ఉన్నది కనుక "ప్రజ్ఞానమే బ్రహ్మ".

రెండవ మహావాక్యము "అహం బ్రహ్మాస్మి". నేనే ఆ పరబ్రహ్మమును అయి ఉన్నాను. దీనిని "అనుభవ వాక్యము" అంటారు. ఏ విశ్వ చైతన్యము అఖండము, అనంతము, నిర్గుణము, నిరవద్యము, నిరంజనమో, ఆ విశ్వ చైతన్యమే యావద్విశ్వానికీ అతీతము, విశ్వాధారము, విశ్వాంతర్గతము. అదే సర్వ జీవులందు, సర్వ ప్రాణులందు, సమస్త వస్తు సంజాతమందు ప్రకాశిస్తున్నది. అదే మన దేహేంద్రియాదులకు, మనో బుద్ధులకు, సర్వమునకు ఆధారము. అదే పరబ్రహ్మము. మన దేహేంద్రియములను ప్రకాశింపజేస్తూ ఆ పరంజ్యోతే మనలో 'నేను' అనే స్ఫురణతో ఉన్నది. అవిద్యలో ప్రతిఫలించిన ఆ చైతన్యమునే 'నేను' అని వ్యవహరిస్తున్నాము. ఈ 'నేను'యే బ్రహ్మమని గుర్తించటమే, అనుభవించటమే "అహం బ్రహ్మా2స్మి".

"బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి". బ్రహ్మజ్ఞాని నిత్య ముక్తుడే ! భేద దృష్టి నుంచి అభేద దృష్టికి వెళ్ళగలిగినప్పుడు 'అహం బ్రహ్మా2స్మి' అనే అనుభవ జ్ఞానం వస్తుంది. 'అహమస్మి' అనే స్పృహ బ్రహ్మమునకున్నది. దేహమునకు లేదు. 'నేను ఉన్నాను' అని మనలోని బ్రహ్మము వల్లనే అంటున్నాము. మనము మనస్సుతో 'నేను' అని భావిస్తున్నాము. ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తున్నాము. కనుక ఇంద్రియాలతో కూడిన ఈ దేహమే నేను అనుకుంటున్నాము. "అహం బ్రహ్మా2స్మి" అనుభవంలోకి రావటానికి అంతర్ముఖులమవాలి. మన ఈ దేహము చైతన్యము వల్ల పని చేస్తున్నది. పరబ్రహ్మమును ఆధారం చేసుకుని ప్రవర్తిస్తున్నది. బ్రహ్మము అనే చైతన్యము జీవుని ద్వారా ప్రసరిస్తూ, దేహం ద్వారా బైటకు వస్తున్నది. "నేను" అనే చైతన్యము పరబ్రహ్మమని గ్రహిస్తే 'నేను' అనేది అనుభవంలోకి వస్తుంది.

విద్యుచ్ఛక్తి కంటికి కనపడదు. కానీ లైట్లు, మైకులు, మిక్సీలు, ఫాన్లు మొదలైన పరికరముల ద్వారా ప్రకటిత మవుతుంది.

చక్కెర కలిపిన నీటిని చూపించి 'ఇదేమిటీ? ' అని అడిగితే, చూడగానే మంచినీరని చెప్తాము. కాస్త రుచి చూపిస్తే త్రాగి, పంచదార కలిపిన నీరని చెప్తాము. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం. మంచినీరని చెప్పేవి భౌతిక విద్యలు. చక్కెర నీరని గ్రహించేలా చేసేది ఆత్మ విద్య. ఆత్మవిద్య వల్ల బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుంది. "సర్వం ఖల్విదం బ్రహ్మ" అర్ధమవుతుంది.

"బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్. తదాత్మానమేవావైత్. అహం బ్రహ్మా2స్మీతి. తస్మాత్ తత్ సర్వమభవత్."

జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదులు తమ మహావాక్య దర్పణంలో ఇలా చెప్పారు...
"బ్రహ్మైవాహమిదం విశ్వం
ఇతి విశ్వస్యచాత్మనః !
బ్రహ్మ మాత్రత్వ విజ్ఞానం
నిరర్గళమనారతమ్"!!

నేను బ్రహ్మమును. ఈ విశ్వమంతా బ్రహ్మము చేత నిండి ఉండి, బ్రహ్మము తప్ప ఇతరము లేనిది. కనుక ఈ జ్ఞానముతో ప్రపంచమును దర్శించే వారు, ప్రవర్తించు వారు భవ బంధముల నుంచి ముక్తులవుతారు.

మూడవ మహావాక్యము "తత్త్వమసి". దీనిని "ఉపదేశ వాక్యము" అంటారు. "తత్" అనగా అది, ఆ పరమాత్మ. "త్వం" అనగా నీవు, జీవుడు. "అసి" అనగా అయి ఉన్నావు. ఇది క్రియాపదము. "తత్త్వమసి" అనగా అది నీవే అయి ఉన్నావు. పరబ్రహ్మము నీ సహజ స్వభావము. అది నీవే అయి ఉన్నావు. ఈ మహావాక్యమును "జీవ బ్రహ్మైక్య బోధక వాక్యము" అని కూడా అంటారు. 'అసి ' అన్న పదము ఐక్యతను తెలియజేస్తున్నది. "తత్" కి "త్వం" కి ఐక్యత చెప్పబడింది.

గురువు గారు, తండ్రి అయిన ఉద్దాలక మహర్షి, తన కుమారుడు, శిష్యుడు అయిన శ్వేతకేతువునకు "యద్విజ్ఞానేన సర్వమిదం విజ్ఞాతం స్యాత్, తద్బ్రహ్మ" అని చెప్పి, ఏది తెలిస్తే సర్వము తెలుస్తున్నదో ఆ విజ్ఞానమును, బ్రహ్మమును గురించి అనేక ఉపపత్తులతో వివరిస్తూ తొమ్మిది సార్లు "తత్త్వమసి శ్వేతకేతో" అంటూ
బోధించారు.
"యథా సౌమ్యైకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్వాచారంభణం వికారో నామధేయమ్, మృత్తికేత్యేవ సత్యమ్".

ఓ సౌమ్యా ! మట్టి ముద్దను తెలుసుకుంటే, మట్టితో తయారైన కుండలు, మూకుళ్ళు, ముంతలు, కుండిలు మొదలైనవన్నీ తెలుస్తున్నాయి. ఉన్నది ఒక్క మట్టే. అదే సత్యం. దాని నుండి తయారైనవన్నీ అసత్యములు. మూల సత్యము యొక్క వికారములు, మార్పు కలిగినవి, నశించిపోయేవి. ఏ మార్పు లేని అవికారము మట్టి. నామరూపములు వికారములు. నామరూపాలకు ఆధారమైన పరబ్రహ్మము సత్యము, అవినాశి, మార్పు లేనిది. అదే విధంగా బంగారము మూల పదార్ధము. ఆభరణములు దాని వికారము. అలాగే ఇనుము మూల పదార్ధము. దానితో చేయబడిన వస్తువులు వికారములు.

"స య ఏషో2ణిమైతదాత్మ్యమిదగ్ం సర్వం తత్సత్యం స ఆత్మా, తత్త్వమసి శ్వేతకేతో"! అని వివరిస్తూ, సత్తును అసత్తును వివరిస్తూ, పరబ్రహ్మ లక్షణములను గురించి తెలియపరచి, "నీవు ఆ పరబ్రహ్మమువే అయి ఉన్నావు" అని బోధించారు. జహదజహల్లక్షణా వృత్తితో 'ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు' అనీ, 'సో2యం ద్విజ' ఉదాహరణతో, బాల్యములో తప్పిపోయిన రాజకుమారుడు, మేకల గుంపులో పెరిగిన సింహ కిశోరము వంటి ఉదాహరణలతోను, అనేక ఉపపత్తులతో "తత్త్వమసి" మహావాక్యమును వివరించ వచ్చును.

నిరంతరముగా గురూపదేశమును వినుట వలన, అనవరతము మహావాక్యములను మననము చేయుట వలన ముక్తి పొందగోరిన వ్యక్తికి - జీవునికి, "నీవు స్థూల, సూక్ష్మ, కారణ శరీరములకు భిన్నమైన వాడివి" అని బోధింపబడుచున్నది. ముముక్షువు 'తత్' పద అర్ధమును 'త్వం' పద అర్ధమును బాగుగా మననము చేసి, 'తత్' 'త్వం' ల ఐక్యతను అనుభవించ వలెను.

నాల్గవ మహావాక్యము "అయమాత్మా బ్రహ్మ". ఈ వాక్యము కూడా "వివరణ వాక్యమే". ఈ మహావాక్యమును "సాక్షాత్కార వాక్యము"గా కూడా పండితులు పరిగణిస్తారు.

"మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే" అన్నారు.
12 మంత్రములతోనే పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానమును బోధిస్తున్న మాండూక్యోపనిషత్తుకు శ్రీ గౌడపాదాచార్యులవారు కారికలను వ్రాశారు. జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు దశోపనిషత్తులకు భాష్యము వ్రాశారు. వాటి సహాయముతో మనం ఉపనిషత్తులను అధ్యయనం చేసి, అర్ధం చేసుకోవాలి. ఈ మాండూక్యోపనిషత్తు ఓంకారమును వివరిస్తూ, 'అయమాత్మా బ్రహ్మ'ను బోధిస్తున్నది.

'నామము' 'నామీ' అవిభక్తములు. నామము ఓంకారము, పరబ్రహ్మ వాచకము. నామీ ఈ విశ్వము.
"సర్వం హ్యేతద్బ్రహ్మా. అయమాత్మా బ్రహ్మ". ఈ సర్వము బ్రహ్మమే. ఈ ఆత్మయే బ్రహ్మ. మన కంటికి కనుపించేది, కనుపించనిది అంతా బ్రహ్మమే. మనలో ఉన్న జీవాత్మ కూడా బ్రహ్మమే ! ఈ జీవాత్మ జాగ్రదవస్థలో విశ్వుడుగా, స్వప్నావస్థలో తైజసుడుగా, సుషుప్త్యవస్థలో ప్రాజ్ఞుడుగా వ్యవహరిస్తూ తురీయావస్థలో సమాధి స్థితిలో తనను తానే ఆత్మనని గుర్తిస్తాడు. అది గుర్తింపు కూడా కాదు. కేవల ఆత్మగా, పరమాత్మగా, సచ్చిదానందముగా, శుద్ధ చైతన్య రూపంగా భాసిస్తాడు. అన్ని పాదములలోను, అన్ని అవస్థలలోను ఉన్నది ఆత్మ అనీ, జీవాత్మకు, పరమాత్మకు చైతన్య రూపములో భేదము లేదనీ ఈ ఉపనిషత్తులోని మహావాక్యము "అయమాత్మా బ్రహ్మ" బోధిస్తున్నది.

"నాంతః ప్రజ్ఞం, న బహిః ప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, న ప్రజ్ఞాన ఘనం, న ప్రజ్ఞం, నా2ప్రజ్ఞం, అదృశ్యమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచింత్యమవ్యపదేశ్యమేకాత్మ ప్రత్యయ సారం ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం చతుర్ధం మన్యన్తే స ఆత్మా స విజ్ఞేయః"।

నాలుగు మహావాక్యములు అనబడే నాలుగు స్థంభముల మీద, అనేక ఇతర మహావాక్య సదృశ వాక్య రూపమైన గోడలు, కిటికీలు, తలుపులు, కప్పులాంటి వాటితో నిర్మింపబడిన భవ్య, దివ్య, రమ్య హర్మ్యమే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనబడే మూలాధార మహావాక్యము. ఈ భవంతికి పునాది వేదములే ! ఉపనిషత్తులే ! మూలాధార మహావాక్యమే !
మూలాధార మహావాక్యమనబడే గొప్ప పునాది పైన, నాలుగు మహావాక్యములనబడే స్థంభముల ఆధారంగా నిర్మింపబడిన దివ్య భవన సదృశమే అద్వైతము, వేద సారము.

ఈ కనిపించే సర్వము బ్రహ్మమే ! "అయమాత్మా బ్రహ్మ" అయినప్పుడు, ఈ జ్ఞానము కలగటమే బ్రహ్మము "ప్రజ్ఞానం బ్రహ్మ" అయినప్పుడు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు, "తత్త్వమసి" అని గురువు శిష్యునికి బోధించగా, జీవాత్మే పరమాత్మ అనీ, నేనే పరబ్రహ్మమును, "అహం బ్రహ్మాస్మి" అని సాధకుడు గుర్తించినప్పుడు, అది, ఇది, నువ్వు, నేను, సర్వము, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, జిజ్ఞాసువు, కర్త, కర్మ, క్రియ, కరణము బ్రహ్మమే అయినప్పుడు, జీవాత్మ, పరమాత్మలు బ్రహ్మమే అయినప్పుడు, బోధకుడు, బోధ అందరూ, అన్నీ బ్రహ్మమే అయినప్పుడు, బ్రహ్మాండము - అండాండము, పిండాండము బ్రహ్మమే అని నిరూపించ బడినప్పుడు, "అది తప్ప వేరొకటి లేదు" "ఏకమేవాద్వితీయం బ్రహ్మ" అని శ్రుతి చెప్తున్నప్పుడు, ఇవన్నీ కలిసి బోధిస్తున్నది "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనే కదా ! దీనికి "మూలాధార మహావాక్యము", అని పేరు పెట్టవచ్చును కదా ! నాలుగు మహావాక్యముల సారము - "సర్వం ఖల్విదం బ్రహ్మ". "ఇదం సర్వం బ్రహ్మ ఖలు"." ఖలు ఇదం సర్వం బ్రహ్మ". ఈ కనుపించే సర్వము - ప్రపంచమంతా - విశ్వమంతా, సృష్టి అంతా పరబ్రహ్మమే !

ఈ మూలాధార మహావాక్యమును "విధి వాక్యము" అంటారు. అనగా ఎదురు ప్రశ్నించకుండా వేద ప్రమాణము వలన తప్పనిసరిగా అందరూ పాటించవలసిన వాక్యము, దైవ శాసనము. ఈ విధి వాక్య సారమే సర్వోపనిషత్తుల సారము, సర్వ వేద సారము, వేదాంత సారము. మనకు కనిపించే ఈ విశ్వము, స్థావర జంగమాత్మకమైన ప్రపంచము, సర్వ ప్రాణికోటి, ఇదంతా ఆ పరబ్రహ్మము యొక్క వ్యక్త రూపము.

"సర్వం ఖల్విదం బ్రహ్మ. తజ్జలానితి శాంత ఉపాసీత." "అథ ఖలు క్రతుమయః పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి స క్రతుమ్ కుర్వీత".
"మనోమయః ప్రాణ శరీరో భారూపస్సత్యసంకల్ప ఆకాశాత్మా సర్వ కర్మా సర్వకామస్సర్వగంధస్సర్వ రసస్సర్వమిదమభ్యాత్తో2 వాక్య నాదరః".

నామరూపాత్మకమగు ఈ జగత్తంతయు పరబ్రహ్మమే అయి ఉన్నది. సృష్టి, స్థితి, లయములు బ్రహ్మమునందే కలుగుచున్నవి. కనుక ఈ భావమును మనసులోనుంచుకుని, ఆత్మనిగ్రహము కలిగి అహంకార మమకారాదులను వదిలి పరబ్రహ్మము యొక్క తత్త్వమును తెలుసుకుని శాంతముగా ఉపాసించవలెను. పరమాత్మ యజ్ఞమయుడు. ఈ లోకములో మానవులు ఎటువంటి పుణ్యకర్మలు చేయుదురో, అందుకు తగిన పుణ్యలోకములను మరణానంతరము పొందుతున్నారు. ఆ బ్రహ్మము మనోమయుడు, ప్రాణశరీరుడు, మహాకాంతి కలవాడు, సత్యసంకల్పుడు, ఆకాశమే ఆత్మగా కలవాడు. సర్వ కర్మలు, సర్వ కామనలు, శబ్దస్పర్శరూపరసగంధములు బ్రహ్మమే. ఆయన సర్వ వ్యాపకుడు. వాగాది ఇంద్రియములు లేకయుండియు సర్వేంద్రియ కార్యములు చేయగలవాడు.

అందరి హృదయములలో నివసించు నీ యాత్మ నీవార సూకము కంటె సూక్ష్మమైనది, అన్ని లోకముల కంటె పెద్దది. ఈ సత్యమైన శ్రద్ధ కలిగినవారికి ఏ సందేహములు ఉండవని శాండిల్య మహర్షి ప్రకటించెను.

"తజ్జలాన్" వలన "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనే మహావాక్యము నిరూపింపబడుతున్నది.

"సర్వం ఖల్విదం బ్రహ్మ, తజ్జలానితి శాంత ఉపాసీత" అను ఈ మహావాక్యమును మహామహులు ఎలా వివరించారో తెలుసుకుందాము.

జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఈ వాక్యమును ఇలా వివరించారు - తైత్తిరీయోపనిషత్తు వివరించినట్లు, "తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశస్సంభూతః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, ఆపః పృథివీ, పృథివ్యాం ఓషధయః, ఓషధీభ్యోన్నమ్, అన్నాత్పురుషః."ఇలా ఈ సృష్టి అంతా ఒక క్రమ పద్ధతిలో బ్రహ్మము నుంచి ఏర్పడినది. 'తద్' బ్రహ్మము నుంచి, ఈ విశ్వము 'జ' పుట్టింది. కనుక ఇది "తజ్జ". ఏ విధంగా బైటికి వ్యక్తమయిందో, అదే విధంగా తిరోగమనంలో పరబ్రహ్మములో చేరింది. లీనమయ్యేప్పుడు బ్రహ్మములోనే అదృశ్యమవుతున్నది కనుక 'ల', "తల్ల". ఈ తజ్జ, తల్ల, ల మధ్యలో అస్తిత్వముతో నున్నప్పుడు ఆ బ్రహ్మమునకు అనన్యమై, బ్రహ్మమునందే ఊపిరి తీసుకుని జీవిస్తూ పని చేస్తున్నది కనుక "తదన". ఈ విధముగా సృష్టి, స్థితి, లయలు మూడు స్థితులు బ్రహ్మమునకు అభిన్నముగా చూడబడటము వలన సృష్టి, ప్రపంచము బ్రహ్మమే అగుచున్నది.

తైత్తిరీయోపనిషత్తు కూడా బ్రహ్మమునకు ఇదే నిర్వచనమును ఇలా చెప్పింది - యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవన్తి, యత్ప్రయంత్యభిసంవిశంతి తద్ బ్రహ్మ".

బాదరాయణుని బ్రహ్మ సూత్రము కూడా" జన్మాద్యస్య యతః" అని జన్మ, మొదలైనవి ఎవరి నుంచి జరుగుతున్నాయో, దానినే బ్రహ్మమని చెప్తోంది.

అద్వైతము ప్రకారము ప్రపంచము అయథార్ధము. నిజం కానిది. అంటే ప్రపంచం లేదని కాదు, ప్రపంచము ఎలా కనిపిస్తున్న, అది దాని యథార్ధ స్వరూపం కాదని తెలుసుకోవాలి. బ్రహ్మము తన శక్తి అయిన మాయ వలన, అది కాని దానిలా, ప్రపంచంలా కనిపిస్తోంది.

కనుక, "దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్బ్రహ్మమయం జగత్" అని తేజోబిందూపనిషత్తు చెప్పినట్లుగా జ్ఞానమయమైన దృష్టిని పొంది, ప్రపంచమును బ్రహ్మమయముగా దర్శించాలి.

సకల శ్రుతుల, స్మృతుల లక్ష్యమేమిటంటే పరబ్రహ్మమునకు భిన్నమైనదేదీ లేదనే ఎరుకను, గుర్తింపును కలిగించటమే !

పురుషసూక్తము "పురుష ఏవేదగ్ం సర్వం" అని, సర్వము పురుషుడే, బ్రహ్మమేనని చెప్తోంది.

నారాయణ సూక్తములో "విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్", "విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి" అని ఉంది. దీని వలన ఈ విశ్వమంతా నారాయణుడేననీ, పరబ్రహ్మమైన నారాయణుడు తప్ప అన్యము లేదనీ నిరూపితమైనది.

ముండకోపనిషత్తులో
"బ్రహ్మైవేదమమృతం పురస్తాద్
బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ
ప్రసృతం అథశ్చోర్ధ్వం చ బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం" !!
అని దృశ్యమాన జగత్తంతా అమృతమైన ఆ బ్రహ్మమే ! అని ఉన్నది.

యజుర్వేదములోని రుద్రాధ్యాయము స్థావర జంగమాత్మకమైన సర్వము ఈశ్వరుడేనని చెప్తున్నది.

అథర్వవేదములో "త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార్ ఉత వా కుమారీ త్వం జీర్ణో2సి..." అన్న ఈ వాక్యము వలన సృష్టిలోని సర్వము బ్రహ్మమేనని గ్రహించాలి.

విష్ణుపురాణం "భూతాని "విష్ణుః, భువనాని విష్ణుః," అని చెప్తోంది.

స్వామి నిఖిలానంద తాము ఛాందోగ్యోపనిషత్తు తృతీయ ప్రపాఠకము, చతుర్ధ ఖండమునకు వ్రాసిన అనువాదములో ఏ భౌతిక చిహ్నము లేకుండా సగుణబ్రహ్మమును ఉపాసించుటను గురించి "సర్వం ఖల్విదం బ్రహ్మ" బోధిస్తున్నదని చెప్పారు.

స్వామి నిత్య స్వరూపానంద గారు ఇలా చెప్పారు -
ఈ ప్రపంచంలో మనిషి 'నేను ముక్తుడను' అనుకుంటే, ముక్తుడుగానే ఉంటాడు, 'నేను బద్ధుడను' అనుకుంటే బద్ధుడవుతాడు. ఎలా ఆలోచిస్తే, అలా పరిణమిస్తారని ఈ 'క్రతుమయః పురుషో..' మంత్రము బోధిస్తున్నది.

శ్రీరమణమహర్షి - 'నామరూపాలు మారిపోతూ ఉంటాయి. కనుక నామరూపాత్మకమైన ప్రపంచం యదార్థం కాద' ని చెప్పారు.

శ్రీమద్భగవద్గీతలో పరమాత్మ ఇలా చెప్పాడు -

"మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ!
మయి సర్వమిదం ప్రోతం
సూత్రే మణిగణా ఇవ" !!

తాను తప్ప ఇతరమేమీ లేదనీ, దారముతో మణులు కూర్చబడినట్లుగా, తనయందే ఈ విశ్వమంతా ఉన్నదని పరమాత్మ చెప్పాడు. ఇది "సర్వం ఖల్విదం బ్రహ్మ"మని చెప్పటమేగా !

"సమం సర్వేషు భూతేషు
తిష్ఠంతం పరమేశ్వరమ్!
వినశ్యత్స్వవినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి"!!

నశ్వరములైన చరాచర ప్రాణులయందు సమముగా స్థితుడైయున్న, నాశరహితుడైన పరమేశ్వరుడిని చూచువాడే నిజమైన ద్రష్ట.

భగవద్గీతలోని 9 వ అధ్యాయములోని 16, 17,18 & 19 శ్లోకములు బ్రహ్మమే స్థావర జంగమాత్మకమైన సర్వ ప్రపంచమునని బోధిస్తున్నాయి.

చతుశ్లోకీ భాగవతంలో మొదటి శ్లోకంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు -

"అహమేవాసమేవాగ్రే
నాన్యద్యత్ సదసత్పరమ్ !
పశ్చాదహం యదేతచ్చ
యో2వశిష్యేత సో2స్మ్యహమ్" !!

నేనే సృష్టికి ముందర, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లయించినప్పుడు కూడా ఉన్నాను. ఇతరమైనది వేరొకటి లేదు. ఏదైతే సత్ కి, అసత్ కి పరమైనదో అది వేరే ఏదీ లేదు. 'అహమేవ అగ్రే ఆసమ్'. అన్నింటి కంటే, అందరి కంటే ముందు ఉన్నది నేనే.
అంటే సద్రూపంలో ఉన్న నిర్గుణ నిరంజనమైన పరమాత్మే, అసత్తు రూపంలో అనగా సృష్టి రూపములో ఉన్నాడు. కనుక మనము ఆ సత్యమును "సదసదతీత సత్" అనవచ్చును. సత్తుకు, అసత్తుకు కూడా అతీతముగా ఉన్న సత్. ఉన్నది ఒక్క 'సత్' మాత్రమే ! ఆ సత్తే పరమాత్మ. ఆ సత్తే విశ్వము. ఆ సత్తే సర్వము.

మహావాక్యములన్నింటి సారము అద్వైత జ్ఞానమే ! అఖండమైన, ఏకమేవాద్వితీయమైన, సర్వవ్యాపక, సర్వశక్తిమత్వ, సర్వజ్ఞత్వ పరబ్రహ్మమే విశ్వ వ్యాపక చైతన్యమని గుర్తించటమే !
పరమాత్మ ఈ విశ్వంలో అంతస్సూత్రంలా, అంతర్యామిగా ఉన్నాడు.
ఈ అంతర్యామిని గుర్తించాలంటే, "సర్వం ఖల్విదం బ్రహ్మము"ను, అనగా ఈ సృష్టంతా పరబ్రహ్మమేనని తెలుసుకోవాలంటే, బ్రహ్మ తత్త్వాన్ని శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, నిదిధ్యాసనం చెయ్యాలి. సాధన ద్వారా బ్రహ్మ తత్త్వాన్ని అర్ధం చేసుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు
"నేహ నానాస్తి కించన", ఇక్కడ నానాత్వం లేదు,
"మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి" ఇక్కడ నానాత్వాన్ని చూస్తున్న వారు జన్మ పరంపరలను పొందుతారు, అన్న ఉపనిషణ్మంత్రాల అర్ధం బోధపడుతుంది. సృష్టిలో ఎక్కడా నానాత్వం గోచరించదు. అంటే బాహ్యేంద్రియాలకు నానాత్వం గోచరిస్తున్నా, ఈ నానాత్వంలో ఉన్న ఏకత్వం కేవలం బ్రహ్మమేనని తెలుస్తుంది.
"ఈశావాస్యమిదం సర్వం" అని గ్రహిస్తారు.
"అనేక కోటి బ్రహ్మాండగ్ం సర్వం మిథ్యేతి నిశ్చిను" అని చెప్తోంది ఉపనిషత్తు. ప్రపంచంలో ద్వైతం ఉంది, అనేకత్వం ఉంది. నానాత్వాన్ని మనం చూస్తున్నాము. కానీ మనం దేనిని చూసినా, ఎవరిని చూసినా ఉపాధి భేదమేనని గ్రహించాలి. ఉపాధులకు తగిన గౌరవమిచ్చి ప్రవర్తించాలి.అన్ని ఆభరణాలలో ఉన్నది బంగారమేనని మనకు తెలుసును. కానీ ఉంగరాన్ని వేలికి పెట్టుకుంటాము, గొలుసు మెడలో వేసుకుంటాము, గాజులు చేతికి తొడుక్కుంటాము. అలాగే ఈ ప్రపంచమంతా విభిన్న ఉపాధులలో కనిపించే పరబ్రహ్మమే అయినా, తల్లిని తల్లిగా, చెల్లిని చెల్లిగా, ఎవరిని వారి అనుబంధానికి తగినట్లుగానే గౌరవించాలి. ఉపాధులను ఉపాధి ధర్మాలతోనే చూడాలి. అలాగే వ్యవహరించాలి. కానీ ఉపాధులలోని అంతర్యామిని గుర్తించగలగాలి. సర్వత్ర బ్రహ్మమునకు అభిన్నతను దర్శించాలి. నామరూపాలను మనం వ్యవహారానికి పెట్టుకున్నాము. నామరూపాలు బ్రహ్మము కాదు. బ్రహ్మము నామరూపాలతో అభివ్యక్తమవుతున్నది. దేని వలన నామరూపాత్మక జగత్తు అభివ్యక్త మవుతున్నదో అది బ్రహ్మము.

శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు సర్వత్ర హరి దర్శనం చేశాడు.విశ్వాన్ని విష్ణు స్వరూపంగా దర్శించాడు. కనుకనే అన్నింటిలోను అతనికి హరియే దర్శనమిచ్చాడు.

మ।। కలడంభోధి కలండు గాలి కలడాకాశంబునం గుంభినిం
గలడగ్నిన్ దిశలం బగళ్ళనిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్
గలడీశుండు గలండు తండ్రీ ! వెదకంగానేల యీయాయెడన్ !

కం।। ఇందు గలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన
నందందే గలడు దానవాగ్రణి వింటే !

ఎక్కడ చూచినా ఉన్నది పరతత్త్వమే ! అదే "సర్వం ఖల్విదం బ్రహ్మ". మనము ఉపాధులలో ఉంటున్నంత కాలము, ఉపాధులలో ఉంటున్నామని భావిస్తున్నంత కాలము ఉపాధి ధర్మాలను తప్పక పాటించాలి. కానీ బ్రహ్మ తత్త్వాన్ని గ్రహించి, దర్శించి, అనుభవించ గలిగిన వారికి, బ్రహ్మ నిష్ఠులకు, అద్వైతులకు ప్రపంచంలో నానాత్వం గోచరిస్తున్నా, వారికి నానాత్వం గోచరించదు. బ్రహ్మమే సాక్షాత్కరిస్తుంది. కుమ్మరివానికి మట్టితో చేయబడిన సమస్త పరికరాలలో మట్టే గోచరిస్తుంది. స్వర్ణకారునికి సమస్త స్వర్ణాభరణాలలోను బంగారమే గోచరిస్తుంది, ఆభరణ రూపం గోచరించదు. అలాగే అద్వైతికి, బ్రహ్మజ్ఞానికి విశ్వంలో సర్వత్ర పరమాత్మే గోచరిస్తాడు. సర్వంలో తనను చూస్తాడు, తనలో సర్వాన్నీ చూడగలుగుతాడు. అలా అనుభవించ గలగటమే "సర్వం ఖల్విదం బ్రహ్మ" దర్శనం !!

ఉన్నది ఒక్క బ్రహ్మమే ! ఆ బ్రహ్మమే అందరిలో జీవాత్మగా ఉన్నాడు. విశ్వంలోని ప్రతి వస్తువుగా భాసిస్తున్నాడు. ఆయనే భోజ్యము, భోక్త. విరాట్స్వరూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మమే ! ఈ విశ్వ శక్తితో అనుసంధానం చేసుకోగలిగిన సాధకులు, బ్రహ్మజ్ఞులు తృప్తి పొందితే విశ్వం మొత్తం తృప్తి చెందుతుంది. అటువంటి వారు తమలోని ప్రకృతిని స్థంభింప జేస్తే, బైట విశ్వంలోని ప్రకృతి స్థంభించిపోతుంది. ఈ సత్యాన్నే ధృవ చరిత్ర స్పష్టం చేస్తున్నది. ఐదేళ్ళ పసి బాలుడు ధృవుడు శ్రీమన్నారాయణుని గురించి తీవ్రమైన తపస్సు చేస్తూ, తన ఊపిరిని స్థంభింప జెయ్యగానే, అతను విశ్వాత్మతో అనుసంధానించబడ్డాడు కనుక, విశ్వంలోని సర్వ ప్రాణికోటి స్తంభించి పోయింది, వాయువు స్తంభించిపోయింది. వెంటనే ధృవునికి అప్పటి వరకు అతని హృదయంలో దర్శనమిస్తున్న శ్రీ హరి అతని కళ్ళ ముందు సాక్షాత్కరించాడు.

శ్రీ కృష్ణ పరమాత్మ, ద్రౌపదీదేవి దగ్గర ఉన్న అక్షయ పాత్రలోని ఒక్క చిన్న శాకమును నోట్లో వేసుకుని "విశ్వం తృప్యతామ్" అనగానే, దుర్యోధనుడు పంపగా ధర్మరాజును పరీక్షించటానికి వచ్చిన పది వేల మంది శిష్యులతో సహా దుర్వాస మహర్షికి కడుపులు నిండిపోయాయి. అదీ పిండాండ బ్రహ్మాండముల సమన్వయము. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే, ఈ విశ్వమంతా బ్రహ్మమే కనుక ! "సర్వం ఖల్విదం బ్రహ్మ" కనుక !! అది తెలుసుకుని 'శాంత ఉపాసీత' అని చెప్పారు.

మానవ జీవిత పరమ గమ్యము శాన్తమే ! అన్ని గుణములు, మనోవికారములు, భావములు అన్నీ అణిగిపోయిన స్థితి శాంతము. మనస్సు అల్ల కల్లోలముగా నున్నప్పుడు, విషయ వాసనలతో కలుషిత మైనప్పుడు మనసుకు, చిత్తమునకు ప్రశాంతత కలుగదు. కొలనులో రాయి వేసినప్పుడు ఆ నీటిలో అలలు లేచి అల్లకల్లోల మవుతుంది. అలాగే మనస్సు కూడా లౌకిక వాసనలు అణిగి చిత్తము ప్రశాంత మవాలి. ప్రశాంతమైన చిత్తమున్నప్పుడే ధ్యానము, వివేకము, ఏకాగ్రత, యథార్ధ జ్ఞాన గ్రాహక శక్తి కలుగుతాయి.

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇలా చెప్పారు-
"ఆదౌ బ్రహ్మాహమస్మీత్యనుభవ
ఉదితే, ఖల్వహం బ్రహ్మ పశ్చాత్"।।
ముందు నేను దేహము కాదు, బ్రహ్మమును అనే జ్ఞానం కలిగితే, తరువాత ఈ సర్వము బ్రహ్మమనే జ్ఞానం కలుగుతుంది.

"సర్వం ఖల్విదం బ్రహ్మ" మనే మూలాధార మహావాక్యమును గ్రహించినప్పుడు "వసుధైక కుటుంబకమ్", అందరూ ఒక్క కుటుంబమేనన్న భావన స్థిరపడుతుంది. అందరిలోని ఆత్మ ఒక్కటేననీ, కేవలము ఉపాధులలోనే భేదమున్నది తప్ప, సర్వమునకు మూలమొక్కటేననీ, మనమందరమూ సమానమేనన్న జ్ఞానము కలుగుతుంది. సముద్రంలో ఆలలలో, నురుగులో సుడిగుండాల రూపంలో ఉన్నది నీరే అయినట్లు మనమందరము, సర్వ మానవాళి, సర్వ ప్రాణికోటి సమానమే ! భేదము కేవలము ఉపాధులకే ! ప్రతి ఒక్కరూ తమకు పకృతితో, తోటివారితో, పరమాత్మతో ఉన్న అనుబంధాన్ని, బంధాన్ని గుర్తించి, తాము, వారు సమానమే, అభేదమేనని గుర్తించినప్పుడు, తమలో ఉన్న ఆత్మే, తమలో ఉన్న చైతన్యమే అందరిలోను ఉన్నదని గుర్తించినప్పుడు, ఉపాధి ధర్మాలను గౌరవించాలనీ, పాటించాలనీ గుర్తించినప్పుడు అందరినీ తమతో సమానముగానే ప్రేమిస్తారు, గౌరవిస్తారు. సర్వే సర్వత్ర శాంతి, సామరస్యము నెలకొని పృథ్వియే స్వర్గముగా మారుతుంది. కలియుగం కృతయుగమవుతుంది.
"కృణ్వంతో విశ్వమార్యమ్" అన్న మహర్షి వాక్కులు నిజమవుతాయి. పరస్పరము ప్రేమ భావన, సుహృద్వాతావరణము, ఆనందము వెల్లి విరుస్తుంది. విశ్వశాంతి నెలకొంటుంది.

🙏🙏🙏 ఓం తత్సత్. 🙏🙏🙏

రచన :
డా.సోమంచి.(తంగిరాల)విశాలాక్షి.
-----------------------------------

No comments:

Post a Comment