Thursday, March 12, 2020

అపకారికి - ఉపకారం చిన్నికథ

అపకారికి - ఉపకారం చిన్నికథ
రామ రావణ యుద్ధం ముగిసిన తరువాత సీతమ్మ దగ్గరకు హనుమంతుడు వెళ్లి
"అమ్మా! నిన్ను ఆనాడు ఈ రాక్షస స్త్రీలు అందరు బాధించారు. నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు తల్లి. వీళ్ళని ఇక్కడే నాపిడికిటి పోట్లతో కొట్టి చంపేస్తాను" అన్నాడు.

అప్పుడు సీతమ్మ "నాయనా! హనుమా! నీ -ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు. వీళ్ళ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారు. కనుక వీళ్ళని ఏమి చేయకు. పైగా అతిథి ఎలాంటి వాడైనా మన దగ్గరకి వచ్చి తప్పు చేసినా అథితి అతిదే. వారిని ఏమి అనకూడదు.

ఒకప్పుడు ఒక బోయవాడు వేటకి వెళ్లి అనేక జంతువులను వేటాడుతూ బ్రతికేవాడు. ఒకరోజు ఒకపులి అతడి వెంటపడింది. ఆ వేటగాడు దానిని చూసి భయపడి పరిగెత్తాడు.

చాలా దూరం పరిగెత్తి ఒక పెద్ద వృక్షం కనబడితే దానిమీదికి ఎక్కితే పులి చెట్టు ఎక్కలేదు కనుక నేను క్షేమంగా ఉంటాను అనుకోని ఆ చెట్టు ఎక్కాడు.

పైకి ఎక్కి చూస్తే అక్కడ ఎలుగుబంటు ఉంది. దానిని చూడడంతో పై ప్రాణాలు పైనే పోయాయి వేటగాడికి.

అప్పుడు ఎలుగుబంటి అతడి భయాన్ని చూసి "తెలిసో తెలియకో భయపడి నాదగ్గరికి వచ్చావు. నీకు అభయమిస్తున్నాను. భయపడకు అంది. దాంతో కొంచం ఊరడిల్లాడు.

అప్పటివరకు వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటుని చూసి మిత్రమా! అతడు మనిషి. మనిషికి కృతజ్ఞత ఉండదు. నువ్వు జంతువు, నేను జంతువుని. కనుక వాడిని కిందికి తోసెయ్. తినేసి వెళ్ళిపోతాను. నిన్ను ఏమి చేయను అంది.

అప్పుడు ఎలుగుబంటు మిత్రమా! అతడు భయంతో నావద్దకి వచ్చాడు. అతడు నాకు అతిథి. అతడిని మాటిచ్చాను. రక్షించడం నా కర్తవ్యం. అంది కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది.

అప్పుడు పులి.. మిత్రమా! ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం పన్నాగం పన్ని అథితివి అని నాటకాలు ఆడుతుంది. నేను వెళ్ళగానే అది నిన్ను తినేస్తుంది. కనుక దానిని క్రిందకి తోసెయ్. దానిని తిని నిన్ను వదిలేస్తాను. అని మాయమాటలు చెప్పింది.

పులి చెప్పింది నిజమనుకొని నిద్రపోతున్న ఎలుగుబంటిని అమాంతం క్రిందికి తోసేశాడు. వెంటనే మేల్కొన్న ఎలుగుబంటి ఛ ొ క్రిందపడబోతూ చెట్టుకొమ్మని పట్టుకుంది. పట్టుకొని పైకి ఎక్కి వచ్చి మిత్రమా!

నీభయం నాకు తెలుసు. పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావు. భయపడకు. నువ్వు నా అతిధివి. అని అక్కడే ఉన్న ఆహారం అతడికి ఇచ్చింది.

తరువాత పులి ఎలుగుబంటితో! మిత్రమా! చూశావా! ఈ నీచ మానవులు తమ స్వార్ధం కోసం తమకి ఆశ్రయం ఇచ్చినవారిని కూడా చంపడానికి వెనుకాడరు. వట్టి కృతఘ్నులు. అందుకే చెబుతున్నాడు. అతడిని క్రిందికి తోసేసేయ్ తినేసి వెళ్ళిపోతాను. అనగా ఎలుగుబంటి నవ్వి ఊరుకుంది. చేసేది లేక పులి అక్కడి నుండి వెళ్ళిపోయింది.

తమకి కీడు తలపెట్టినవారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం. కనుక హనుమ వీరి ప్రభువు వీరికి చెప్పినట్లు చేశారు అంతేతప్ప శత్రుత్వం ఏమిలేదు.

అప్పుడు హనుమ.. అందుకే తల్లి నీవంటి శీలవతి ఉత్తమురాలు ఈ యుగంలోనే కాదు. ఏ యుగంలోనూ పుట్టలేదు. పుట్టబోదు అన్నాడు.

శతృవైనా శరణు కోరి వస్తే అభయమివ్వడం మానవ ధర్మం..

Be Good...
Do Good...

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

No comments:

Post a Comment