Sunday, April 5, 2020

మనో ధైర్యాన్ని మించిన మందు మరొకటి లేదు

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి.దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి.

అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి.

నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు.. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు...!

భగవాన్..!! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి..??

ఏమి జరగబోతోంది..?

లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా..? బిడ్డ బతుకుతుందా..? సింహం లేడిని తినేస్తుందా..?

వేటగాడు లేడిని చంపెస్తాడా..? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా..?

ఒకవైపు నిప్పు.. రెండో వైపు నది.. మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం..

కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..

అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి..

పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి.. గురి తప్పి బాణం సింహానికి తగిలింది..

వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి..

లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యాంగా వుంది. ఏదైతే జరగనీ, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని.. లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి వుండి వుంటే ఏమి జరిగేది..??

మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే వుంటాయి. నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము.. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది. ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది సమస్యలను ఏదుర్కోనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆత్మవిశ్వాసముతో, ధైర్యముతో, ధృఢనిశ్చయముతో, దేవునిపై విశ్వాసముతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యము..
కరోనా గుప్పెట్లో భూగోళం అని, కన్నీటి గాథలను ప్రపంచ వ్యాప్తంగా వింటున్నాం. కాబట్టి మనం కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఎలాగో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నాం. మన ఇంట్లో ఉన్న మన మత గ్రంథాలు అయినా భారతం, భాగవతం, రామాయణం,
శివపురాణం, దేవిభాగవతం లాంటి మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు పురాణ ఇతిహాసాలు, ఖురాన్ మరియు బైబిల్ వంటివాటిని చదువుతూ భగవన్నామ స్మరణ చేస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు, మన తర్వాత తరమైన మన పిల్లలకు మంచి నీతి బోద చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుదాం, ప్రశాంతమైన మనస్సు రోగనిరోధక శక్తిని పెంచడంలో మరింత తోడ్పాటు నిస్తుంది వీలైనంత ఎక్కువగా ఈ యోగా, ధ్యానం వంటి వాటిని చేద్దాం మనల్ని మనం రక్షించుకుందాం.
చెట్టుకు నీరు పోసినా దేవుడికి పూజ చేసిన వృధాగా పోదు అంటారు పెద్దలు ప్రయత్నం మన వంతు ఫలితం ఇవ్వడం భగవంతుడు వంతు.
మనో ధైర్యాన్ని మించిన మందు మరొకటి లేదు

సర్వేజనా సుఖినోభవంతు*

దీపం పాపాన్ని హరిస్తుందంటా దీపం వెలిగిద్దాం కరోనా పాపాన్ని తరిమేద్దాం.

No comments:

Post a Comment