Wednesday, April 15, 2020

అమృతం

👉 చదవటం మిస్ అవకండి

అమృతం
""""""""""""""""""
ఒరేయ్ నాయనా,
నీకు సమయం ఆసన్నమైంది, ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి, సిద్ధంకా!

అంటూ సమవర్తి భటులు,
నా పక్కకొచ్చి పద అంటూ పిలుపునిచ్చారు.

మరీ ఇంత హఠాత్తుగా గానా? విస్తుపోయి అన్నాను.

తప్పదురా! వెళ్ళాలి.

సెకనులో వెయ్యోవంతు కూడా లేటు కాకూడదు.

క్రమశిక్షణలో మాకు మేమే సాటి.

మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు.‌
కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధం కా అన్నారు.

సమయం చాలా కొద్ది గా ఉంది. ఏం చేయను?

అప్పటివరకూ నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలై పోయాయి.

నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు,
ఏం బంధం నన్ను నిలువరించ లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏంచేస్తే బావుంటుందా అని ఆలోచించా.

ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు.

ఆయన లేకపోతే నాజీవితం ఎట్లా వెడుతుందొ వదినా,
పసుపు కుంకాలు లేని బ్రతుకెందుకు? అని భార్య రోదిస్తోంది.

పసుపు కుంకాల రూపంలో నిత్యం ననుమోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడకెంత అవసరమో తెలుస్తోంది.

అప్పటివరకూ చాకిరీ చేసి అలసిన కొడుకు, డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక,

నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నామీద ఉన్నప్రేమతో పాటు, రేపు అనే దాని మీద వాడికి కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది.

చివరి చూపుకొచ్చిన అల్లుడు, మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు,
అసలే లీవు తక్కువ శాంక్షనయ్యిందని బాధపడుతున్నాడు.

అతని బాధలో వాస్తవం నాకు అర్థం అవుతోంది. అందుకే బాధ కలగటం లేదు.

ఇంకా బతుకుతాడనే నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తుంది,
రేపో,మాపో పోతాడని రూఢిగా తెలిస్తే పోవడమే
కరెక్ట్ కదా.

ఇది ఎలాంటిదంటే బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతూంటే బాధ కలుగుతుంది.

వెళ్ళటం తప్పదని తెలిసినపుడు బస్టాండు వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాం.

బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని నిరీక్షిస్తాం.

ఆ సమయంలో మాట్లాడేది, అక్కడే ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు.

అందుకే బస్సు ముందు ఏవ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదూ‌!

అంటే దానర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు,
ఉండి ఏమీ చేయలేనప్పుడు,
వెళ్ళటం మంచిదే కదా అని అనుకోవటం లాంటిది.

ఇదీ అంతే అందుకే అల్లుడి ఆలోచనలో సబబుగా ఉందనిపించింది‌

ఈ గొడవలో పడి పిల్లల ఆలనా పాలనా మర్చిపోయానని తనను తాను నిందించుకుంటూ నా మనవలకు తిండి పెట్టే స్తోంది కోడలు.

ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు,
అపుడు హడావిడి మొదలవుతుంది.

ఆ గొడవలో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతోంది.
నాకు తప్పనిపించలేదు.

పోయేవాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా కోడలూ కరెక్టే అనిపించింది.

అమ్మా! తాతకు ఏమయ్యిందీ? తల్లిపెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు‌,
నాపేరు పెట్టిన నా మనవడు.

తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరకు వెళతారు నాన్నా అంటోంది కోడలు.

మళ్ళీ ఎప్పుడు వస్తారు? అడుగుతున్నాడు‌.

ఇంక రారు.

మరి సెలవల్లో మనం తాతయ్యా వాళ్ళూరు రామా!

లేదు, మామ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం.

వద్దమ్మా, తాతను మనతోనే ఉండమను, ప్రతీ సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం.

ఈ మాట విన్న నా కూతురు పొగిలి, పొగిలి ఏడుస్తూ, ఇంక ఆ అదృష్టం మనకు లేదంటూ... బాధ పడుతోంది.

బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది.

నేను పెడితేనే తినటం దాని కలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం.

ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవచేసేస్తోంది.

ఒక మనిషి అస్థిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది.

నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి, నేనెప్పుడూ సేదతీరే మా ఇంటి పెరటిలో ఉన్న వేపచెట్టుకింద పడుకో బెట్టారు.

ధనిష్టా పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే, నన్ను చాపవేసి పడుకోబెడుతున్నారు.

ముచ్చటపడి కట్టుకున్న ఇంటినుంచి చివరిసారిగా బయటకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంక దీనికి నాకు ఋణం తీరిందని తెలుస్తోంది.

చెట్టుకింద పుట్టల్లో ఉన్న చీమలు నామీద పాకుతున్నాయి.

ప్రాణం ఇంకా పోలేదు కదా, అవి కుట్టినప్పుడు దేహం విలవిల లాడుతోంది.

ఎవరైనా గుక్కెడు నీళ్ళు పోస్తే బావుండు ననిపిస్తోంది.
మాట పెగలటం లేదు‌ ఎవరి గొడవలో వాళ్ళున్నారు.

అపరకర్మలు చేసే ఆయనకోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్లీ రా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు.

పోయాక ఏది జరిగినా తెలియదు, ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి.

ఆ సలహా మంచిదే అనిపించింది.

నా శరీరం సాగనంపడానికి చివరి సారిగా బేరసారాలు జరుగుతున్నాయి.

ఎవరో తులసి తీర్థం పోయమంటున్నారు.
నేను రోజూ సంధ్యావార్చి,
ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసిచెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తి తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.

రెండు గుక్కలు మింగాక,
నా మనవడు ఒక్కసారి
నా దగ్గరికొచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తనూ నీళ్ళు పోస్తానని పట్టు బట్టాడు.

వాడిని వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక, విధిలేక వాడితో తులసినీళ్ళు నా నోట్లో పోయించారు.

వాడి చేతినీటితో ఆవకాయ రుచి నా నాలికకు తగిలి ప్రాణం లేచి వచ్చింది.

పోతుందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయ్యింది.

నాకొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి, నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు.

ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నాభార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని, డాక్టర్ కి కబురు చేయమంది.

డాక్టర్ వచ్చాడు. చివరిసారిగా ప్రయత్నించాడు.

అప్పటివరకూ గొలుసుతెంపుకునేందుకు తాపత్రయపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు.

అది పరుగున వచ్చి నా వంటిపై పాకుతున్న చీమలని కోపంగా చూసి, నాలుకతో నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది.

నాన్నని లోపలికి తీసుకొని వెడదామంటోంది నా కూతురు.

డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్దిగంటల్లో తిరిగి స్పృహలోకొచ్చా.

మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు.

నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు.

కొద్దిరోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యా.

మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు.

నాకోసం వచ్చిన యమభటులు ఎవో లెక్కలు సరిచూసుకుని, వీడు అమృతం తాగాడు,

శాస్త్ర రీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు.
అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు.

చూస్తూండగానే తిరిగి వసంతం వచ్చింది.
నా ఇల్లు పిల్లాపాపలతో కలకలలాడుతోంది‌.

నాకు పునర్జన్మనిచ్చిన అమృతాన్ని తిరిగి తయారుచేయటం మొదలు పెట్టాను.

మామిడికాయలు ముక్కలు కొట్టి, వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చి కి, బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగనూనె కలిపి ఒకజాడీలో ఆ అమృతాన్ని భద్రపరుస్తున్నా.

నిజం చెప్పొద్దూ బ్రతికి ఏం సాధిస్తాం అంటాం కానీ, బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది.

వేతకాలేకానీ ఆనందం ప్రతీ దాంట్లో ఉంటుంది.

పెంపుడు జంతువుల సాంగత్యంలో,

పెంచే మొక్కల
సాన్నిహిత్యం లో,

సంతానంతో కలిసి గడపటంలో,

రుచికరమైన వంటలో,

సుందరమైన ప్రకృతిలో,

ఆవకాయ అన్నంలో,

దోరగా కాలిన దొసెలో,
కరకరలాడే గారెలో.......

మక్కువగా ఆస్వాదిస్తే, అన్నింటిలోనూ ఆనందమే!

ఆనందంమైన అనుభవం, ఎన్నటికీ మృతంలేనిదే!

జీవితం అంచులకు చేరిన వాళ్ళకే తెలుస్తుంది,
జీవితం విలువ.

ఎందుకంటే జీవించడం అంటె తెలిసేది అప్పుడే.

అరవైలుదాటిన జీవితం, బోనస్ లాంటిది.

ఏభైల్లో ఉన్నజీవితం, అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది.

నలభైల్లో జీవితం,
ఆనందం గురించి అవగాహన కలిగించేది.

ముప్ఫైల్లో జీవితం,
దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది,

ఇరవైల్లో జీవితం,
మన జీవిన విధానమే ఆనందం, అనే భ్రమకలిగించేది,

ఇరవై లోపు జీవితం
ఏది జరిగినా, అదే ఆనందం అని మురిసిపోయేది.

ఆనందం కోసమే జీవితం, దాన్ని
మిస్సవ్వకండి.
ఆనందంగా గడిపిన ప్రతీక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి.
🙏🙏🌹

Source: whatsapp forwarded message

No comments:

Post a Comment