నేనెవడను? అనేది ప్రశ్నకాదు, అదే అంతిమసమాధానం.
అన్నిటికీ అవకాశంగా ఉండే ఆకాశానికి
తన రూపమేమో తెలియనట్లు...
రమణుడికి-
తానున్నానని తెలుస్తోందిగాని...
తానెవరో తెలియడం లేదు...
అందుకే తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కణ్ణీ అడిగాడు-
"నేనెవడను?" అని.
విన్నవారు అదొక సాధనాప్రక్రియ అనుకుని...
ఎవడి స్థానాల్లోకి వాళ్లు వెళ్లి, నేనెవడను? అని సాధన మొదలుపెట్టేశారు...
ఆత్మవిచారం మీద చాలా పుస్తకాలు వ్రాసేశారు...
అనుభూతులు, అనుభవాలు అంటూ ఏకరువు పెడుతున్నారు...
అదంతా ఉత్తదే...
"ఏ అనుభవమూ లేకపోవడమే ఆత్మానుభవం"
అని సత్యాన్ని బద్దలు కొట్టి చెప్పిన మహనీయుడు
సద్గురు సుబ్రహ్మణ్యులు.
* * *
నీవు నీవుగా ఉండడమే సాధన.
నీవు నీవుగా ఉండడమే సిద్ధి.
"ఉన్నరీతిన ఉండు..."
ఇదే సారవంతమైన ఉపదేశం.
ఉన్నరీతిన ఉంటే, మనసు-
ఇటు గతంలోకి...అటు భవిష్యతులోకి...జారదు...
అలా జారకుండా...
"ప్రస్తుతం"లో ఉండే మనసు పేరే ఆత్మ.
"ప్రస్తుతం"లో ఉండే స్థితి పేరే మోక్షం.
ఇటు గతంలోకి జారక, అటు భవిష్యత్తులోకి జారక...
సదా "వర్తమానం"లో సంస్థితమై ఉండేవాడికి...
ఏ అనుభవమూ ఉండదు.
నిజానికి తానెవరో తనకే తెలియనివాణ్ణి గుఱించి
"ఫలానావాడు" అని మనం ఎలా నిర్థారించగలం?
అది ఎంత తెలివితక్కువ పని?
అలా తానెవరో నిర్థారించుకోలేకే...
నేనెవడను? అని వచ్చిన ప్రతి ఒక్కణ్ణీ అడిగాడు
భగవాను.
దానికి సమాధానం ఎవరూ చెప్పలేదు, చెప్పలేరు...
మనమేమో మన ప్రశ్నను తీసుకెళ్లి సమాధానం కోసం
రమణుణ్ణి అడిగితే, ఆయన మళ్లీ ప్రశ్ననే ఇచ్చినట్లైంది.
నిజానికి నేనెవడను? అనేది ప్రశ్నకాదు.
అదే అంతిమసమాధానం.
తానెవరో తనకు తెలియకపోవడమే - ఆత్మజ్ఞుని లక్షణం.
తానెవరో తనకు తెలిసినట్టు అనిపించడమే - అజ్ఞాని లక్షణం.
కాబట్టి-
ఏదో తెలుసుకోవడానికి, ఏదో అవడానికి సాధన చేయడం మాని,
ఏమీ తెలియకుండా ఉండడానికి, ఏమీ కాకుండా ఉండడానికి
సాధన చేయండి...
నీవెవడవు? అని నిన్నెవరైనా అడిగితే,
"నేను ఫలానా" అని నీవు చెప్పగలిగితే,
నీకు తెలియవలసింది తెలియనట్టు.
నీవు పొందవలసినదానిని పొందనట్టు.
నీవు ఏది కావాలో అది కానట్టు
"నాకు తెలియదు" అని నీవు సమాధానం చెప్పగలిగితే,
నీకు తెలియవలసింది తెలిసినట్టు.
నీవు పొందవలసింది పొందినట్టు.
నీవు ఏది కావాలో అది అయినట్టు.
***
ఏకోహం...
ఉండేది నేనొక్కణ్ణే.
నాకు అన్యమేమీ లేదు.
కనుక నన్ను నేను తెలుసుకోవడానికి నేనెవరినయ్యా?
* * *
No comments:
Post a Comment