*సతీ సావిత్రి - 1*
రచన : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య
(నేటి నుండి ప్రారంభం)
యముని చేతుల్లో పడ్డ ప్రాణాలు తిరిగి వస్తాయా ? మృత్యు ముఖంలో ప్రవేశించిన జీవి మళ్లా బ్రతుకుతుందా ? ఎలా బ్రతుకు తుంది? ఇవన్నీ అసంభవమైన విషయాలు. కాదు కాదు. వినయ విధేయతలతో, పాతివ్రత్యంతో, యమధర్మరాజును మెప్పించి భర్త ప్రాణాలను తిరిగి సంపాదించిన ఒక రాకుమార్తె మన చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. మహా పతివ్రతగా కీర్తింప బడింది. ఒక సంవత్సరం కంటె అతడు బ్రతకడని తెలిసి కూడా వివాహం చేసుకొని, సిరిసంపదల్లో పుట్టిందైనా భర్తతో ఆశ్రమంలో సామాన్య జీవనం గడపింది. అటు అత్తమామల ఆదరాన్ని, ఇటు తల్లిదండ్రుల అభిమానాన్ని నమానంగా పొందగల్గిన ఆ యువతి ఎవరో తెలుసా ? సత్యవంతుని భార్య సావిత్రి.
*అశ్వపతి నంతాపం :*
ప్రాచీనకాలంలో మద్రదేశం సకల సంపదలతో తులదూగుతూ వుండేది. అశ్వపతి అనే రాజు ఆదేశాన్ని పరిపాలించేవాడు. ఆయనకు అన్ని విధాలా తగివ యిల్లాలు మాళవి. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకొనేవాడు. ప్రజలు కూడ ఆయన్ను కన్న తండ్రిలాగా ప్రేమించేవారు.
అశ్వపతికి భోగభాగ్యాలలో ఏకొరతా లేదు. అయినా సంతానం లేకపోవడం వల్ల ఆయనకు సంతోషం కరువైంది. ఆయన తనలో తాను ఇలా చింతించేవాడు —"నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? రాజు లేకపోతే ప్రజలకు రక్షణ వుండదు. అరాజకమైన దేశం దుష్టుల పాలవుతుంది. అప్పుడు ప్రజలు కష్టాల పాలవుతారు. ఇందుకు నేను ఏంచేయాలి." ఇలా చింతిస్తూ ఆయన ఎలాగయినా సంతానం పొంది తీరాలని అనుకొన్నాడు.
*నీకు కూతురే పుడుతుంది :*
సంతాన కాంక్షతో ధర్మపత్నీ సమేతంగా అశ్వపతి సావిత్రీదేవిని ఉపాసించాడు. ఉపానన పద్దెనిమిది సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగింది. చివరికి దేవి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నది.
రాజు జగన్మాతకు సాష్టాంగ నమస్కారం చేసి “దేవీ! పుత్రుణ్ణి ప్రసాదించు” అని ప్రార్థించాడు.
"రాజా! నీకు పుత్రిక కలుగుతుంది” అని దేవి చెప్పింది. తన కోరిక పుత్రుడి మీదనే ఉన్నదని రాజు మళ్ళీ విన్నవించుకొన్నాడు.
అప్పుడు దేవి "రాజా! నీవు కుమారుణ్ణి కోరి నన్ను సేవించావని నాకు తెలును. బ్రహ్మ దేవుడితో ఈ విషయం ప్రస్తావించాను. ఆ దేవుడు నీకు పుత్రికనే అనుగ్రహించాడు. నీకు కలుగబోయే కుమార్తె మహా పవిత్ర చరిత్ర. ఆమె సౌశీల ప్రభావం వల్ల తర్వాత నీకు కొడుకులు గూడ పుడతారు” అని చెప్పి అంతర్ధానమయింది.
*సావిత్రి పుట్టింది:*
తర్వాత కొంత కాలానికి మాళవి గర్భం ధరించి శుభలగ్నంలో పుత్రికను ప్రసవించింది. సావిత్రీదేవి వరప్రసాదం కాబట్టి రాజు బిడ్డకు 'సావిత్రి' అని నామకరణం చేశాడు. రాజదంపతులు గారాబంతో అమ్మాయిని పెంచుతున్నారు. శుక్లపక్షంలో చంద్రకళలాగా సావిత్రి దినదినాభివృద్ధి పొందింది. చదువులో నూ, సౌందర్యంలోనూ, సౌశీల్యంలోనూ ఆమె సాటిలేని మేటి అనిపించుకొన్నది.
*సత్యవంతునిపై వలపు :*
క్రమంగా సావిత్రికి పెండ్లి వయను వచ్చింది. అశ్వపతి కుమార్తెకు అన్ని విధాలా తగిన వరుణ్ణి అన్వేషించే ప్రయత్నం ప్రారంభించాడు.
సాళ్వదేశానికి రాజు ద్యుమత్సేనుడు. ఆయన కొడుకు సత్యవంతుడు. అతడు అందంలో మన్మథుణ్ణి మించినవాడు. గుణవంతులలో అతనితో సమానుడు మరొకడు లేడు. ఆ రాజపుత్రుణ్ణి గూర్చి కర్ణాకర్ణికగా విని సావిత్రి అతని పై వలపు పెంచుకొన్నది. అయినా సిగ్గు వల్ల ఆమె ఎవరితోనూ తన అభిప్రాయం వెల్లడి చేసింది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
*నీకు నచ్చినవాణ్ణి కోరుకో ! :*
ఒక రోజు త్రిలోకనంచారి నారదమహర్షి అశ్వపతి చెంతకు వచ్చాడు. రాజు మునీంద్రుణ్ణి యథావిధిగా పూజించాడు. ఇంతలో శృంగారాధిదేవతలా వున్న సావిత్రి చెలికత్తెలతో విలానంగా విహరిస్తూ అక్కడికి వచ్చి తండ్రికీ, మునీంద్రుడికి నమస్కరించింది.
నారదుడు ఆమెను చూచి "రాజా! పెళ్ళి ఈడు వచ్చిన ఈ కన్యకను తగిన వరుడికిచ్చి వివాహం చేయకుండా ఇలా ఎందుకుంచా వు?" అని ప్రశ్నించాడు.
"మునీంద్రా! ఆప్రయత్నంలోనే వున్నాను" అని రాజు సమాధానం చెప్పాడు. తర్వాత కుమార్తెను చూచి "అమ్మా! అదే పనిగా అంతటా వెదుకుతున్నాను. కాని నీకు తగినవాడు కనిపించలేదు. నీకు నచ్చినవాణ్ణి నీవే కోరుకో, సంతోషంగా వివాహం జరిపిస్తాను" అని చెప్పాడు.
సావిత్రి సిగ్గుతో తల వంచుకొన్నది. అయినా తన కోరిక ప్రకటించటానికి తగిన సమయం అదే కాబట్టి సిగ్గును కాస్తా ప్రక్కకునెట్టి సత్యవంతుణ్ణి తాను ప్రేమించిన విషయం మెల్లగా తెలియపరిచి ఇలా అన్నది—
“నాన్నా! ద్యుమత్సేవ మహారాజు దైవయోగం వల్ల కన్నులు పోగొట్టుకున్నాడనీ, రాజ్యం కూడా శత్రువుల వశమైందనీ, భార్యా పుత్రుల తో గూడి ఆయన ఇప్పుడు అడవులలో నివసిస్తున్నాడని నాకు తెలిసింది. అయినా ఆయన కుమారుణ్ణి వేను మనసారా ప్రేమిస్తున్నాను.” అన్నది.
అశ్వపతి నారదుణ్ణి చూచి "మునీంద్రా! మూడు లోకాలలోనూ మీకు తెలియని సంగతి లేదు. సత్యవంతుని గుణం, రూపం, శీలం మొదలైన విశేషాలను దయచేసి వివరించండి! '' అని ప్రార్థించాడు.
నారదుడు ఇలా చెప్పాడు. "రాజా! మీ అమ్మాయి కోరుకొన్న రాజకుమారుడు ఎప్పుడూ సత్యమే పలుకుతాడు కాబట్టి 'సత్యవంతుడు' అని పేరు పొందాడు. అతణ్ణి 'చిత్రాశ్వుడు' అని కూడ అంటారు. అతడు మహా తేజస్వి, మహా బుద్ధిమంతుడు, మహా శూరుడు. సౌందర్యంలో కానీ, సౌజన్యంలో కానీ - అతణ్ణి మించిన వాడు మరొకడు లేడు.
అన్నాడు.
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment