పరమార్థ కథలు - 103
పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
దైవశక్తి - మానవశక్తి
ఒకనొక గ్రామమునందు బంగారు ఆభరణములు తయారు చేయు స్వర్ణకారుడు ఒకడు కలడు. తన వృత్తియందతడు మహాకౌశలము కలవాడు. కనుకనే చుట్టుప్రక్కలగల గ్రామవాసులందరును వారికి ఏ ఆభరణము కావలసినను అతని యొద్దకే వచ్చి చేయించుకొని పోవుచుందురు. ఆభరణనిర్మాణ కుశలత్వము వలన అతనికి ఆ పరిసరములలో గొప్పఖ్యాతి లభించినది. ఒకతూరి యతడు తన బుద్ధికుశలతను ఉపయోగించి ఒక అపురూపమైన ముక్కుపుడకను బంగారుతో నిర్మించెను. కొన్ని నెలలు తదేకదృష్టితో నతడు దానియొక్క రూపురేఖలను గూర్చి పదేపదే చింతనజేసి అంతవఱకును ఎక్కడలేని రూపలావణ్యమును ఆ యాభరణమునకు తెచ్చిపెట్టిను. స్వర్ణకారుని తీక్షణబుద్ధియంతయు ఆ నవ్యభూషణమునందు చక్కగ ప్రతిబింబించి దానికొక విలక్షణత్వమును చేకూర్చినది.
తత్ఫలితముగ జనులు తండోపతండముగ దానిని వీక్షించుటకై అరుదెంచసాగిరి. ముఖ్యముగ స్త్రీలు సుదూరప్రాంతముల నుండియు బండ్లు కట్టుకొని వచ్చి ఆ ముక్కుపుడకయొక్క సౌందర్యమును కనులపండువగ వీక్షించి పరమానందభరితులగుచుండిరి. “అహా! ఎట్టి అపూర్వ సౌందర్యము! ఎట్టి అద్భుత నిర్మాణపటిమ! ఇంతవఱకు మన జీవితములందిట్టి ఆభరణనిర్మాణదక్షతను ఎచటను గాంచి యుండలేదే! ఆ స్వర్ణకారుడెంతటి అనుభవశాలియో! అతని పుణ్యమా అనుచు ఈ దినము నేత్రోత్సవముగ ఒక అపురూపఆభరణమును దర్శించు అదృష్టము మాకు లభించినది.! జన్మధన్యమైనది! - అని ఈ ప్రకారముగ జనులు తమ అదృష్టమును కొనియాడుచుండిరి. సువర్ణకారుడు నిర్మించిన ఆ యాభరణకారణముగా ఆ గ్రామమునకే గొప్పఖ్యాతి అభించినది. ఇక్కారణముుగ ఆ గ్రామస్థులందఱును ఒకనాడు సమావేశమై ఏ వ్యక్తివలన తమ గ్రామమున కింత ప్రతిష్ఠ కలిగినచో అటువంటి ఆ మహనీయమూర్తిని సన్మానించుటకు, సత్కరించుటకు ఏకగ్రీవముగ తీర్మానించుకొనిరి. ఆ తీర్మానము ననుసరించి వారందరును నడుము కట్టుకొని చందాలు వసూలుచేసి ఒకానొక శుభదినమున బ్రహ్మాండమైనరథమును పుష్పములతో, తోరణములతో, రంగుకాగితములతో బాగుగ అలంకరించి, మేళతాళములతో, భజనపార్టీలతో స్వర్ణకారుని గృహము చెంతకు విచ్చేసిరి. రథమును బయట నిలిపి సన్మాన సంఘకార్యదర్శిగారు, సన్మానసంఘసభ్యులతో లోనికేగి స్వర్ణకారునితో నిట్లనెను -
“మహాశయా! తమరు గొప్ప కళాకుశలురు. ఆభరణనిర్మాణ మందు తమకు తమరే సాటి. తమయొక్క భూషణనిర్మాణకౌశల మహిమచే మన గ్రామమునకు మహత్తరకీర్తి లభించినది. దూరప్రాంతములందలి జనులందరును మనగ్రామమునే స్మరించుచున్నారు. ఇంతటి కీర్తిప్రతిష్టలను మన గ్రామమునకు నిత్యస్మరణీయముగ నొనర్చుటకు కారణభూతులైన తమకు ఈ గ్రామము తరపున మేము ఘనముగ సత్కరింపదలంచి ఒక మహారథమును అలంకరించి తెచ్చినాము. తమరు దయచేసి దానియందు కూర్చొనినచో మేము మిమ్ములను భక్తిపురస్సరముగ ఊరేగించి మా కర్తవ్యమును, విధ్యుక్తధర్మమును నెరవేర్చుకొందుము. కాబట్టి దయయుంచి త్వరితముగ వచ్చి రథముపై ఆసీనులు కండు.”
కార్యదర్శి గారి ఆ వాక్యములు వినుట తోడనే స్వర్ణకారుడు పకపక నవ్వసాగెను. ఎందుల కాతడు నవ్వెనో ఎవరికిని అర్థము కాలేదు. కొన్ని క్షణములు గడచిన వెనుక సన్మానసంఘ కార్యదర్శిగారు “మహాశయా! తమరీసమయమున నవ్వుటకు కారణమేమి?” అని అడుగగ స్వర్ణకారు డీప్రకారముగ పలికెను - “ఓ పెద్దలారా! ముక్కుపుడక తయారుచేసిన నన్ను ఊరేగించుట కంటె ముక్కును తయారుచేసిన దేవుని ఊరేగించిన ఎంతబాగుండును? ముక్కుపుడకకు ఆధారమైన ముక్కులేనిచో, ముక్కుపుడక నిలచునా! సామాన్యమైన ఒక చిన్న ముక్కుపుడకను తయారుచేసిన నన్నే ఇంత గౌరవించదలంచుచున్నచో, దానికాధారమై, మానవునకు ఎంతో ముఖ్యమైన ప్రాణాధారమై, అతని మనుగడకే ఆలవాలమైనట్టి ముక్కును తయారుచేసిన సాక్షాత్ ఆ పరమాత్మను ఎంత గౌరవించవలెను?! ఇంతమాత్రపు ఊహ మిాకు కలుగలేదే - అని తలంచి నాకు నవ్వు వచ్చినది. కాబట్టి ఓ గ్రామ పెద్దలారా! దేవునిపటమును ఆ రథముపై బెట్టి భక్తితో ఊరేగించుడు”అని హితవు చెప్పెను. స్వర్ణకారుని ఆ మహత్తరబోధను విని కార్యకర్తలందఱును అట్లే కావించి పరితృప్తిని బడసిరి.
నీతి:- పరమాత్మయొక్క శక్తి అనంతమైనది. అద్దానిముందు మానవుని శక్తి బహుఅల్పము. మానవుడు ఎంత ఘనకార్యము సాధించినను, అది గొప్పయని తలంచక, దానిచే అహంభావమును బొందక, అదియంతయు భగవత్కృపాకటాక్షసంజనితమే యని భావించి నిగర్వముతో మెలగుచు, భగవానునియెడల భక్తిశ్రద్ధలను ఇతోధికముగ అభివృద్ధి పరచుకొనుచుండవలెను.
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
No comments:
Post a Comment