*శ్రీరమణీయభాగవత కథలు- 21 - (1)*
( బాపు-రమణ )
జరిగిన కథ:
ధృవుడు తన తండ్రి ఒడిలో కూర్చోనీకుండా తన పినతల్లి సురుచి లాగివేస్తుంది.
ధృవుని తల్లి సునీత, ధృవుని మహావిష్ణువును ప్రార్థించమంటుంది.
ధ్రువుడు ఇరవైఆరువేల సంవత్సరాలు చల్లగా పరిపాలన జరిపాడు. తగినసమయం రాగానే విష్ణు దూతలు తెచ్చిన విమానం పై ధ్రువమండలం నందు శాశ్వత నివాసం పొందాడు.
ఇక చదవండి
******
*అంబరీషోపా ఖ్యానము-1*
*అంబరీషుడి కథ - యాగశాల*
శుక : అంబరీష వరద! గోవిందోహరి!
పరీ : శుక దేవా!
గోవిందుడు భక్తులందరికీ వరదాయకుడే. విశేషించి అంబరీష వరదుడనడానికి కారణం?
శుక:
తప్పుచేసిన వారికి దండన విధించడంలో కూడా ఆ లీలావినోది చమత్కారాలు గమనించు.
పరీ :
శిక్ష అనేది బాధాకరమైన విషయం కదా! ఇందులో వినోదానికి ఆస్కారం ఎక్కడ?
శుక :
(నవ్వి) శ్రీకృష్ణావతార వేళ, 'నిన్ను చంపేవాడు నీచెల్లెలి అష్టమ సంతానంగా పుడతాడు' అని కంసుని హెచ్చరించాడు. పుట్టిన పధ్నాలుగేళ్ల వరకూ ఆ దుష్టుడిని చంపకుండా జాగు చేశాడు. తనను చంపేవాడు ఎవడు - ఎక్కడున్నాడు - ఎప్పుడొస్తాడు అన్నది తెలియక - తిండి నీరు నిద్ర కూడా సవ్యంగా అనుభవించలేక నరకయాతన పడ్డాడు. జీవచ్ఛవం అయాడు కంసుడు. అప్పుడు చంపాడు. అలాగే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుని గర్భశత్రువుగా ఏర్పాటు చేశాడు. కన్న కొడుకు హరినామస్మరణ కంటిలో నలుసై కాలిలో ముల్లై ఇంటిలో పోరై కొడుకుని చంపలేక తాను చావలేక గిలగిల తన్నుకున్నాడు. అది ఆచమత్కారి దారి.
పరీ : బోధపడింది. తలచిన వెంటనే చంపగలడుగాని ఆ శిక్ష చాలదని, ఇతరులను పెట్టిన బాధలు తామూ అనుభవించాలని, ఇలా వినోదలీలలు నడిపాడన్న మాట
శుక : అంబరీషుడికి హాని చేసిన దుర్వాసుడినీ అంతే. ఒక సంవత్సరం పాటు ప్రాణాలు చేత పట్టుకుని పరుగులెత్తేలా చేశాడు.
పరీ: దుర్వాస మహర్షి సాక్షాత్తు శివుడి అవతారం కదా!
శుక: అవును. అంతటి గొప్పవాడికి సూటిగా హితవు చెప్పడం కష్టం. దండించటం ఇంకా కష్టం. అందుకే అతి చమత్కారంగా ఆ కథను నడిపాడు భగవంతుడు. దుర్వాసుడు శివుడి పూర్ణావతారం కాదు. అంశావతారం.
ఒకసారి శివుడు బ్రహ్మదేవునితో తగవాడినపుడు ఆయనలోని రౌద్రాంశం క్రోధాగ్నిగా విజృంభించింది. ఆ తాపాన్ని తట్టుకోలేక బ్రహ్మదూరంగా వెళ్లి పోయాడు. ఈశ్వరుడిలోని అర్థశరీరం అయిన పార్వతి కూడా *'దుర్వాసం భవతిమే*' - 'నీకు దగ్గరగా నేను వసించ లేను స్వామీ' అంటూ తొలగి వెళ్లింది. అపుడు
శివుడు తనలోని క్రోధాన్ని వర్జించాడు. ఆ క్రోధమే దుర్వాసునిగా రూపొందింది.
పరీ: శాంతమూర్తి, పరమ భక్తుడు అయిన అంబరీషుడికి, దుర్వాసునికి కలహమెందుకు వచ్చింది? శైవ వైష్ణవాల ఘర్షణా?
శుక:
కాదు. కేవలం అహంకార విజృంభణ. అంబరీషుడు పరమ ధార్మికుడు విష్ణుపూజనమే అతని ఊపిరి. ఆ భక్తవత్సలుడు శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని ఈ అంబరీషుడికి సర్వరక్షగా అతని మందిరంలోనే ఉంచి వేశాడు.
ఇంకా వుంది...2
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
No comments:
Post a Comment