*శ్రీరమణీయభాగవత కథలు- 21 - (2)*
( బాపు-రమణ )
జరిగిన కథ:
శ్రీశుకమహర్షి పరీక్షిత్తునకు అంబరీషుని గాధ ను తెలుపుచున్నాడు.
ఇక చదవండి
******
*అంబరీషోపా ఖ్యానము-2*
*చక్కని వనం*
పెద్ద ఉసిరి చెట్లు. చుట్టూ తోరణాలు. పూలతో అలంకరించిన తిన్నెలు. తులసి మొక్కలు. పూజాద్రవ్యాలు.
ప్రతీ కార్తీకంలో పన్నెండు సంవత్సరాలపాటు అంబరీషుడు ఏకాదశీవ్రతం నిర్వహించేవాడు.
పన్నెండవ కార్తీకంలో వ్రతం ముగిసింది. బ్రాహ్మణులకు సంతర్పణ చేసి గో గోవత్స సువర్ణ దానాలిచ్చాడు. అమర్నాడు ద్వాదశి.
అంబరీషుడు భోజనానికి కూర్చునే వేళకు దుర్వాసుడు శిష్యులతో ఆయన వద్దకు వచ్చాడు. అంబరీషుడు ఆయనను అర్చించి భోజనానికి రమ్మని కోరాడు. స్నానం చేసి వస్తానన్నాడు దుర్వాసుడు. శిష్యులు స్నానం ముగించి గట్టుమిదకి చేరినా దుర్వాసుడు నీటిలో జలక్రీడలాడుతూ తాత్సారం చేశాడు.
అంబరీషుడు పురోహితులతో ఎదురు చూస్తున్నాడు. ద్వాదశి ఘడియలు ముగియడానికి ఇక కొన్ని ముహూర్తాలే వుంది.
అవి దాటేలోగా ప్రసాదం తీసుకొనకపోతే ఏడాదిపాటు చేసిన వ్రతం వృధాఅయిపోతుంది. అతిధి దుర్వాసుడు ఇంకా రాలేదు. రెండు ఉద్దరిణులు మంచి తీర్ధం పారణకై స్వీకరిస్తే తప్పు కాదన్నారు పురోహితులు. అంబరీషుడు అలాగే చేశాడు.
అంతలో దుర్వాసుడు వచ్చాడు. జరిగినది తెలిసి అది తనపట్ల అపచారం అనీ అవమానమనీ కోపంతో మండి పడ్డాడు. అక్కడున్న పెద్దలు చెప్పినా వినలేదు. తన శిరసులోంచి ఒక జటను వూడ పెరికి నేలకేసి కొట్టాడు. కాలాగ్ని వంటి మహాకృత్య అనే శక్తి ఆవిర్భవించింది.
ముని ఆనతిపై శూలం ధరించి అంబరీషుని సంహరించ బోయింది. అతని రక్షణకై వున్న విష్ణు చక్రం అతని భ్రుకుటిలోంచి విసురుగా వచ్చి ఆ మహాకృత్యను నరికి వేసింది. అక్కడితో ఆగక దుర్వాసుని పైకి వురికింది. దుర్వాసుడు పరుగెత్తాడు.
సుదర్శనం అగ్నిచ్ఛటలు వెదజల్లుతూ అతన్ని వెంట తరిమింది. శరణు శరణు అంటూ అతడు పరుగులు పెట్టాడు.
మీదకు వస్తుంది. కానీ తాకదు. చంపదు.
*భువిదూరన్ భువిదూరు నబ్ధిజార నభ్ధిం జొచ్చు సుద్విగ్నయై దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులనుబో దిగ్విధులంబోవు జిక్కనెసన్ గ్రుంకన్ గ్రుంకు- నిల్వనిలున్ కేడింపకేడించు నొక్కివడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్య దుర్వక్రమై*
దుర్వాసుడు బ్రహ్మలోకం వెళ్లి శరణు కోరాడు. నాకు సాధ్యం కాదు మహాశివుని శరణుకోరు అన్నాడు బ్రహ్మ.
ఋషి కైలాసం పరిగెత్తాడు. విష్ణువు అందరికీ పూజనీయుడు. ఆయన చక్రానికి అడ్డు నిలచే శక్తి సాహసం లేవు అన్నాడు. శివుడు.
దుర్వాసుడు వైకుంఠం చేరి శ్రీహరి శరణుకోరాడు.
విష్ణువు : ఇపుడా సుదర్శనం నా చెప్పుచేతలలో లేదుగదా. ఎప్పుడో అంబరీషునకు రక్షగా ఒప్పగించాను. ఇంతకీ ఆయనను అడిగావా? అన్నాడు.
లేదన్నాడు ఋషి.
ఆయన వేసిన చక్రాన్ని ఇతరులెలా ఆపగలరు! నేను భక్తుల దాసుడిని. గోవు వెంట దూడలా వారి నంటి వుండే వాడిని.
నిన్ను కాపాడేది ఆ అంబరీషుడే. నాకు తెలిసి ఆయన చాలా మంచివాడు. పాపభీతే కాదు 'కోపభీతి' కూడా కలవాడు. మహాశాంతమూర్తి. ఆయన దగ్గరకే వెళ్లు అన్నాడు. విష్ణుమూర్తి.
దుర్వాసునికి కళ్లు తిరిగిపోయాయి. ఆగి ఆలోచించే శక్తి లేదు. తిరిగి పరుగెత్తాడు.
'దుర్వాసుడు, దూసుకొచ్చే బాణంలా వచ్చి అంబరీషుని పాదాలు పట్టుకున్నాడు. అంబరీషుడు కంగారుపడి ఆయనను లేవనెత్తి లెంపలువేసుకుని శ్రీహరి సుదర్శనానికి నమస్కరించాడు. దుర్వాసుని విడవమని వేడుకున్నాడు. చక్రం శాంతించింది.
మహర్షీ! అలసి వచ్చారు. గత సంవత్సరం కార్తీక ద్వాదశినాడు తమరు వెళ్లారు. నేడు తిరిగి ద్వాదశి వచ్చింది. నాటి నుండి నేను కూడా భోజనం చేయలేదు. మీకోసమే వేచి వున్నాను. దయచేయండి.
దుర్వా:
రాజా! రాజోత్తమా! ఈ భోజనం కోసం పన్నెండు మాసాలు నా చేత పరుగులెత్తించారు.
నువ్వు నీ శ్రీహరీని! ఆ లీలా వినోదుడికి సాటి ఆయనే! ఆయన భక్తులలో నీకు సాటి నువ్వే!
*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)
No comments:
Post a Comment