Monday, July 1, 2024

 శ్రీమద్రామాయణము.

(214 వ ఎపిసోడ్),

"" యావత్పవనో నివసతి దేహే,
   తావత్ప్రుత్యచ్ఛతి కుశలం గేహే,
   గతపతి వాయౌ దేహా పాయే,
   భార్యా భిభ్యతి తస్మిన్కాయే,"""

తనవారెవరో మరణించారని దుఃఖపడడము పూర్తిగ అవివేకపు చర్య.మన శరీరములో గాలి అనగా ప్రాణము యున్నంతవరకు "" ఒరేయ్ శాస్త్రీ ఒరెయ్ శర్మా, ఒరేయ్ రెడ్డీ,అని అందరుమనలని పలకరించి కశల ప్రశ్నలు వేస్తారు.
కానీ మన శరీరములో ఆగాలి అనగా ప్రాణము ఉపాదిని వదిలి వెళ్లిపోతే అనగా మనము మరణిస్తే అలా పలకరించినవారే కాదు ఆ మరణించిన వాని భార్య కూడ ప్రాణములేని ఉపాదికి శవమని నామకరణము చేసి శవజాగరణ తనకి భయమని ఏడుస్తు ఆ రాత్రికి తోడు యుండమని ఇతరులని అభ్యర్థిస్తుంది.

కావున ఓ మానవులారా! ఈ  భంధనాలు  బాంధవ్యాలు ఏర్పరచుకొని కాలాన్ని వృధా చేయక గోవిందుని భజించమని శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారు తమ భజగోవిందములోనలని హెచ్చరిస్తున్నారు.

రామాయణములో అయోధ్యాకాండములో  చిత్రకూటపర్వతములో రామదర్శనము చేసుకొని తండ్రియైమ ధశరథుని మరణవార్త భరతుడు రామునికి  తెలియచేస్తాడు.

''నిష్క్రాంతమాత్రే భవతి సహసీతే  సలక్ష్మణే,
దుఃఖశోకాభిభూతస్తు రాజా త్రిదివమభ్యగాత్||,(102-06)

"అశ్వమేధాది యజ్ఞములను ఎన్నో నిర్విఘ్నముగ నిర్వహించిన మన తండ్రి ధశరథమహారాజు నేను కేకయరాజ్యమున నా మాతామహుని యింటయుండగ,నీవు,వదినగారైన సీతామాత లక్ష్మణుడు వనవాసములకు బయలదేరగానే పరలోకగతుడైనాడని చెప్పి అనేక రకములుగ విలపిస్తుంటాడు.

ఆ సమయములో రాముడు లక్ష్మణుని సహాయముతో తండ్రికి తర్పణాలు వదిలి దుఃఖిస్తున్న భరతుని ఓదారుస్తాడు.ఓ భరతా! విధి బలీయము.

"" యథా~గారం దృఢస్తూణం జీర్ణం భూత్వా~వసీదతి,
తథైవ సీదంతి నరా జరామృత్యువశంగతాః (105-18),

నాయనా భరతా! దృఢమైన స్తంభములతో నిర్మించిన సౌధముకూడ కొంతకాలమునకు శిధిలమై కూలిపోవును. అట్లే మానవులు ఎంత వారైననూ ముసలివారై మరణించుట తథ్యము.గడచినరాత్రి తిరిగి ఎలా రాదో,యమున నీరు సముద్రాన చేరినతర్వాత నదికి ఎలా చేరలేదో ఉపాధిని వదిలిన జీవి తిరిగిరాడని భరతుని ఓదారుస్తూ,

"" సర్వే క్షయంతా నిచయాః పతనాంతాః సముచ్చ్రయాః,
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితమ్||,(105-16),

మనము కూడబెట్టిన సంపదలన్నియు నశించునవే.మన ఔన్నత్యములన్నియు పతనమగునవియే.పుత్ర,మిత్ర,కళత్రాది సంబంధములన్నియు తెగిపోవునట్టివే.ఎంతటివారికైనా మరణము తథ్యము.కనుక మరణము గురించి శోకించుట అవివేకము అని చెపుతు,

"" ఆత్మానమనుశోచ త్వం కిమన్య మనిశోచసి,
ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ||,(105-21),

  ఓ భరతా ఈ జననమరణాలగురించి శోకించక ధర్మగ్లాని కలుగకుండగ నీవు ఆత్మోధ్దరణను గూర్చి యోచన చేయవలెను.నీవు శోకిస్తున్నను నిలిచియున్నను కాలము ఆగదు.ఆవిధముగ యోచనచేయని వాని ఆయువు కూడ క్షీణించుచునే యుండును.కాన నీవు వెంటనే తిరిగి వెళ్లి తండ్రి అప్పగించిన కార్యమున సఫలీకృతడవు కమ్మని రాముడు దీవిస్తాడు.

కనుక మరణముతో బంధుత్వాలు బంధనాలు తెగి పోతాయి.మరణించిన వారి గురించి విలపించక అందరము ఆత్మోధ్దరణ వైపు మరలాలని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.
అదే శంకరభగవత్పాదులవారు కూడ వ్యర్థమైన బంధనాలగురించి ఖేధ పడక ఆత్మోధ్దరణ వైపు దృష్టి మరల్చమని  బోధిస్తున్నారు.
జగద్గురువుల హితవు రామాయణములోని హెచ్చరికలు గమనించుకొని మసులుకుందాము.
జై శ్రీరామ్, జై జై శ్ర్రీరామ్.

No comments:

Post a Comment