శ్రీమద్రామాయణము.
(233 వ ఎపిసోడ్),
""మారుతః కాలసంపక్వం వృంతాత్ తాళఫలం యథా""
గాలి బాగుగా వీచినప్పుడు బాగుగపక్వమునకు వచ్చిన తాటిపండు తన తొడిమనుండి ఊడిపడిపోతుంది.
""ఉర్వారుక మివబంధనాత్,
మృత్యోర్మోక్షీయ మామృతాత్""
ఇది తైత్తరీయోపనిషత్తులోని అనువాకము.
ఓ ముక్కంటీ! పక్వమునకు వచ్చిన దోసపండు తొడిమ నుండి ఎలా వేరుచేస్తున్నావో నన్ను కూడ నా దేహము నుండి దేహిని అలా వేరు చేయవయ్యా అనే విన్నపము గోచరిస్తుంది.
రామాయణములో హనుమంతుని చేతిలో దేవాంతక త్రిశిరులు,నీలుని వల్ల మహోదరుడు,ఋషబుని శౌర్యంచే మహాపార్శ్వులు నిహతులవగానే రావణాసురుని కుమారుడైన అతికాయుని లక్ష్మణుడు ఎదుర్కొంటాడు.
"" స్వబలం వ్యథితం దృష్ట్వా తుములం రోమహర్షణమ్,
భ్రాత్రూంశ్చ నిహతాన్ దృష్ట్వా శక్రతుల్యపరాక్రమాన్""(యు.కాం.71-01)
రావణకుమారడైన ఈ అతికాయుడు పర్వతసమానమైన దేహము కలవాడు.చతుర్ముఖుని నుండి వరములు పొంది దేవదానవుల గర్వమణిచినవాడు.తన తమ్ములైన నరాంతక,దేవాంతక త్రిశిరులు,పినతండ్రులైన మహోదర,మహాపార్శ్వులు మృతికి చింతించి రాముని హతమార్చాలని రణభూమికి వస్తాడు.ఇతడు వేదశాస్త్రములను ఔపోసన పట్టినవాడు.అస్త్రశస్త్ర నిపుణుడు.
కానీ యుద్దరంగాన తనతో యుద్దానికి తలపడుచున్న యోధులని చూచి
"" రథే స్థితో~హం శరచాపపాణిః న ప్రాకృతం కంచన యోధయామి,
యశ్చాస్తి కశ్చిద్వ్యవసాయయుక్తో దదాతు మే క్షిప్రముహాద్య యుద్దమ్""(యు.కాం.71-45),
ఓయీ రామా ! నేను రథమును అధిరోహించి యున్నాను.ధనుర్భాణములు చేబూని యుండగ నేను సామాన్య యోధులతో తలపడను.మీలో యుద్దవిద్యలయందు నైపుణ్యము కలవారు మాత్రమే నాతో పోరుకి సిద్దపడి ముందుకు రండని బీరాలు పల్కగా లక్ష్మణుడు అతికాయుని ముందు నిల్చెను.దానికి ఆ రాక్షసుడు,
""" బాలస్త్యమసి సౌమిత్రే విక్రమేష్వవిచక్షణః,
గచ్ఛ కిం కాలసదృశం మాం యోధయితుమిచ్ఛసి,||,(71-51),
ఓయీ లక్ష్మణా! నీవు పసిబాలుడవు.మృత్యుతుల్యుడనైన నాతో నీకు పోరెందుకు? వచ్చిన త్రోవనే వెనుకకు మరలమని హెచ్చరిస్తాడు.
దానికి లక్ష్మణుడు "" న వాక్యమాత్రేణ భవాన్ ప్రధానో న కత్థనాత్ సత్పరుషాభవంతి"" ఓ నీచరాక్షసాధమా! ప్రగల్భవచనములతో యోధుడవనిపించుకొనలేవు.శక్తిసామర్థ్యాలతో నాతో తలపడమని హెచ్చరిస్తు ఆ సందర్భములో
"""తతః శరస్తే నిశతైః పాతయిష్యామ్యహం శరైః,
మారుతః కాలసంపక్వం వృంతాత్ తాళఫలం యథా||,[71-61],
ఓ దుర్మధాంధా! కేవలము" గాలి " బాగుగ పక్వమునకు వచ్చిన తాటిపండును తొడిమనుండి పడగొట్టిన విధముగ నేను నా వాడియైన నా శరములతో నీ శరీరమునుండి నీ ప్రాణములను వేరు చేసెదనంటు,
"" బాలో~యమితి విజ్ఞాయ న మా~వజ్ఞాతుమర్హసి""(71-63),
నన్ను బాలునిగ పలికిన నీవు ఈ క్షణములో నేను బాలుడనో వృధ్దుడనో గ్రహించులోపలే నీ పాలిట మృత్యువుగ మారెదనని హెచ్చరించి బ్రహ్మాస్త్రముతో అతికాయుని శిరస్సును ఖండించెను.
లక్ష్మణుడు తాను వచించినట్లుగానే అతికాయుని శిరస్సుని అతి సునాయాసముగ(ఉర్వారుక రీతి),తన శరములతో దేహమునుండి వేరుచేసెను.
వేదశాస్త్రపారంగతుడు,ధనుర్విద్యాదురంధరుడు,పెద్దలను సేవించువాడుగ పేరొందిన అతికాయుడు తన బల,తపోగర్వాలతో ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకొనలేక ప్రాణాలను కోల్పోయాడు.
రామాయణము ఎంతటివారైనా తాము చేసే పనులలో నైపుణ్యముతో బాటు శ్రధ్దాభక్తులు వినయము కలిగియుండాలని ఎదుటివారి శక్తియుక్తులను సైతము గమనించుకొంటు గౌరవించాలని హెచ్చరిస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment