రామాయణానుభవం....378
అకంపనుడి వధతో క్రోధమూ భయమూ ఒకేసారి తనను ఆవేశించగా రావణుడు మంత్రులతో ఆలోచించి, లంకాపట్టణంలోని సైనిక స్థావరాలన్నింటినీ పరిశీలించి, అత్యధికసైన్యంతో ప్రహస్తుడిని యుద్ధానికి పంపించాడు.
మహావీరా! ప్రహస్తా! నేనుగానీ, కుంభకర్ణుడుగానీ, సర్వసేనాపతివైన నీవుగానీ, ఇంద్రజిత్తుగానీ లేదా నికుంభుడు గానీ మాత్రమే ఇక ఈ భారాన్ని వహించగలం. మహాసైన్యంతో నీవు కదలివెళ్ళు. నిన్ను చూస్తూనే వానరసైన్యం పారిపోతుంది. చపలులూ చలచిత్తులూ అయిన వానరులు నీ సింహనాదం వింటూనే బెదిరిపోతారు. అదీకాక ఎప్పటికో ఒకప్పటికి నిస్సంశయంగా లభించే మృత్యువుకన్నా విజయమో వీరస్వర్గమో అనే సంశయంతో కూడి రణరంగంలో లభించే ఆపద గొప్పదని నా అభిప్రాయం. నీవూ ఇలాగే భావిస్తున్నావా? లేక ఇందుకు భిన్నంగా మరొకటేదయినా మనకు మేలనుకుంటున్నావా?
ఈ మాటలు విని ప్రహస్తుడు- మహారాజా! నిపుణులయిన మంత్రులతో దీనిని గురించి బాగా ఆలోచించాం. సుదీర్ఘంగా చర్చించాం. మనలో వివాదాలు కూడా తల ఎత్తాయి. సీతాదేవిని అప్పగించడం శ్రేయస్కరం లేదంటే యుద్ధమే అనుకున్నాం. అదే జరుగుతోంది. మహాప్రభూ! దానాలతో సన్మానాలతో నన్ను ఎంతగానో గౌరవించావు. అవసరమయిన సమయంలో నీకు నేను పాతం చెయ్యలేకపోతే ఇంక బ్రదికి ఏమి లాభం! ఈ జీవితం కానీ భార్యాపుత్రధనాదులు కానీ ఏవీ నాకు నేనై కాపాడుకోదగినవి కాదు. యుద్ధరంగంలో నీకోసం నా జీవితాన్ని హోమం చేస్తాను. నువ్వే చూద్దువుగాని,
అని మహాసైన్యంతో బయలుదేరాడు. ఈరోజు వానరుల మాంసఖండాలతో రాబందులకు గ్రద్దలకు కాకులకు విందు చేస్తానంటూ ప్రహస్తుడు బయలుదేరుతూంటే అభిమంత్రితాలైన పుష్పమాలలను మెడలలో ధరించిన రాక్షసవీరులు ఉత్సాహంతో కోలాహలంగా వెంట కదిలారు. ఉత్తమజాతి గుర్రాలను పూన్చి సూర్యబింబంలా మెరిసిపోతున్న రథాన్ని అధిరోహించి ఉరగద్వజంతో (పాము గుర్తున్నజెండా) ప్రహస్తుడు లంకనుంచి బయలుదేరి భేరీ భాంకారాలు మిన్నుముడుతుండగా తూర్పుద్వారం నుంచి బయటికి వచ్చాడు. కాలాంతకుడులాగా వస్తున్న అతడి రథంపైని ఆకాశంలో కాకులూ గ్రద్దలూ అప్రదక్షిణంగా ఎగురుతున్నాయి. నక్కలు భీకరంగా ఊళవేసాయి. టెక్కెంమీద ఒక గ్రద్దవాలి దక్షిణముఖంగా కూర్చుని ముక్కుతో తన రెండురెక్కలను పాడుచుకుంటోంది. అనుభవజ్ఞుడూ నేర్పరీ అయిన రథసారథి చేతిలోంచి కళ్ళెమూ కమిచీ జారిపోయాయి.
వానరపక్షంలో చెట్లను పీకుతున్న చప్పుడూ, మహాపర్వత శిఖరాలను పెకలిస్తున్న చప్పుడూ, శ్వేళధ్వనులూ, హుంకారాలూ, స్ఫోటనలూ భయంకరంగా వినిపిస్తున్నాయి.
దివ్యరథంమీద మహోన్నత శరీరుడై మహాబాహుపై తూర్పుద్వారంనుంచి వానరసేనవైపు దూసుకువస్తున్న ప్రహస్తుణ్ణి చూసి శ్రీ శ్రీరాముడు విభీషణా! ఎవరీ రాక్షస మహావీరుడు? అని ప్రశ్నించాడు. మహాప్రభూ! వీడే రావణాసురుడి సేనాపతి, ప్రహస్తుడు. లంకలోని మహాసేన మూడువంతులు వీడి అధీనంలోనే ఉంటుంది. వీడు మహావీరుడు అని విభీషణుడి సమాధానం పూర్తిఅయ్యేలోగానే యుద్ధం ప్రారంభమయ్యింది. శరాఘాతాలూ, గదాఘాతాలూ, వీటికి జవాబుగా వృక్షాఘాతాలూ శిలాఘాతాలూ, ఖడ్గధారులైన రాక్షసులు వానరులను రెండుచెక్కలుగా నిలువునా చీలుస్తున్నారు. శూలాలతో ప్రక్కనుంచి పొడుస్తున్నారు. వానరులు రాక్షసులను పట్టుకొని వజ్రాఘాతాలవంటి పిడిగుద్దులతో నెత్తురు కక్కిస్తున్నారు. ఒకరిది ఆయుధబలం, వేరొకరిది భుజబలం. ఉభయపక్షాలనుంచీ హాహాకారాలూ సింహనాదాలూ వినిపిస్తున్నాయి......
.............సశేషం..........
చక్కెర.తులసీ కృష్ణ.
No comments:
Post a Comment