Saturday, July 13, 2024

 *సతీ సావిత్రి - 4* 

రచన : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 


*మూడవ వరం – తండ్రికి పుత్రసంతతి :*

అయినా సావిత్రి తన పట్టు వదలలేదు. ధీరులు అనుకొన్న పని సాధించే దాకా వదలరు కదా! యముణ్ణి అనుసరించి నడుస్తూనే ఆమె ఇలా ఆయనకు విన్న వించింది.

"ధర్మరాజా ! ధర్మాత్ములు ఏది ఏమైనా ధర్మ కార్యాలు వదలరు. వాళ్ల హృదయాలలో మోహం మొదలైన దుర్గుణాలకు చోటు వుండదు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది. ధర్మం తప్పి చరించే వాళ్లకు కీడు తప్పదు.

పతిని అనుసరించడమే సతులకు పరమ ధర్మం. అలాంటి ధర్మం నేనెలా వదలగలను? ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పడం పాడి గాదని మీకు మాత్రం తెలియదా..?”

ఆ మాటకు యముడు ప్రసన్నుడై " అమ్మా! నీవు ధర్మం పాటిస్తున్నావు. అందువల్ల నీ మీద నాకెంతో ప్రీతిగా వుంది. నీకు మరొక వరం ఇవ్వాలనుకొన్నాను. భర్త జీవితం తప్ప నీకు కావలసిందేమైనా కోరుకో" అని అన్నాడు.

సావిత్రి ఆయనకు చేతులు జోడించి "దేవా! మీ దయ అపారం. మీ అనుగ్రహానికి పాత్రమై నా జీవితం ధన్యమయింది. మా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు కొడుకులు కలిగేటట్లు వరం ప్రసాదించండి! అని ప్రార్థించింది.

యమధర్మరాజు ఆమెకు మూడవ వరం కూడా ఇచ్చి "సావిత్రీ! నీవు చాలా దూరం వచ్చావు. ఎంతో అలసిపోయావు. ఇక పై దారి నీవు నడవటానికి వీలుగాదు. ముళ్లూ, రాళ్లతో నిండిన ఈ దారిలో నీవు కాలు పెట్టలేవు. పైగా క్రూర జంతువులూ, తేళ్లూ, పాములూ తిరిగే ప్రాంతమిది. నీ కోరికలన్నీ నెరవేర్చాను గదా! ఇంకా నన్నెందుకు వెంబడిస్తున్నావు. తిరిగి వెళ్లు” అని చెప్పాడు.

అప్పుడా పతివ్రత ధర్మదేవతతో ఇలా విన్నవించింది- "దేవా ! నా నాథుడి మీద తప్ప నా మనస్సు ఇంక దేని మీదా లేదు. భక్తితో నా భర్తనే ఎప్పుడూ స్మరిస్తున్నాను. సతులకు పతిని మించిన దైవం లేదు కదా! నా పతి దేవతను అనుసరించడం కంటే నాకు పరమ ధర్మం ఏమున్నది? అలాంటప్పుడు నాకు అలసట ఎలా కలుగుతుంది ?

అంతేకాదు ధర్మాత్ములూ, పుణ్యాత్ములూ అయిన మీబోటి పెద్దల దర్శనం దుర్లభం. మహనీయుల సంసర్గం వల్ల పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ భూమికి పవిత్రత చేకూర్చేది మీ వంటి మహానుభావులే. వాళ్ల ప్రభావం వల్లనే సూర్యచంద్రులు క్రమం తప్పక ఆకాశంలో సంచరిస్తున్నారు. సముద్రాలు హద్దు మీరక నిల్చి వున్నాయి. పర్వతాలు కదలకుండా స్థిరంగా వున్నాయి. మహాత్ముల అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో శాంతి సుఖము లభించదు.

నా పూర్వ పుణ్యం వల్ల ధర్మమూర్తులయిన మీతో సాంగత్యం కలిగింది. ఎలాంటి వారికైనా ఏడు మాటలతో పెద్దల చెలిమి లభిస్తుందని అంటారు. మీతో నేను ఎన్నో మాటలు పలికాను. అందువల్ల మన ఇద్దరికీ గట్టి మైత్రి కుదిరింది. మిత్రుల కోరికను పెద్దలెప్పుడూ కాదనరు. ధర్మాత్మా! నా కోరిక మన్నించి నన్ను కృతార్థురాలిని చెయ్యండి!”


*నాల్గవ వరం – భర్త జీవించాలి :*

ఈ మాటలు వినగానే యముడి హృదయం లో దయారసం ఉప్పొంగింది. వెంటనే ఆయన "సావిత్రీ! నీ ప్రార్థన నన్ను ప్రసన్నుణ్ణి చేసింది.. నీ కిష్టమైన మరొక వరం ఇస్తాను. కోరుకో” అని పలికాడు.

సంతోషంతో సావిత్రి కన్నులు విప్పారాయి. ఆమె యముని పాదాలపై వ్రాలి ఇలా ప్రార్థించింది. 

"దేవా ! ఇంతకుముందు వరాలు ప్రసాదిస్తూ మీరు నన్ను భర్త ప్రాణాలు తప్ప మరేమైనా కోరుకొమ్మనేవారు. ఇప్పుడా మాట లేదు. నిజంగా నా సుకృతం ఫలించింది. మీ దయను నేనేమని కొనియాడేది ? భర్త మరణించిన స్త్రీ బ్రతుకు బ్రతుకే కాదు. అలాంటి స్త్రీని ఎవరూ గౌరవించరు. మంగళ కార్యాలలో గూడా ఆమెకు ప్రవేశం లేదు. నా భర్త మహా కీర్తిశాలి, సద్గుణసంపన్నుడు. ఆయన లేకుండా నేను జీవించలేను. ధర్మాత్మా! నా నాథుడు జీవించేటట్లు అనుగ్రహించండి! ఇంతకంటే నాకు కావలసిందేమీ లేదు” అని వేడుకుంది.


*సత్యవంతుడు తిరిగి బ్రతికాడు :*

యమధర్మరాజు ఆమె ప్రార్థనను అంగీకరించాడు. సత్యవంతుణ్ణి పాశం నుండి విడిపించి "అమ్మా ! నీ కోరిక ప్రకారం నీ భర్తను విడిపిస్తున్నాను. ఇతడు చాలా కాలం లోకంలో జీవిస్తాడు. ఇతడు నూరు మంది కొడుకులను కంటాడు. తన కీర్తిని నాలుగు దిక్కులా వ్యాపింపజేస్తాడు. అనేక యజ్ఞాలు చేసి దేవతలకు తృపి  కలిగిస్తాడు. ఇతని వంశం చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయాడు.

సావిత్రి ఆనందంతో భర్త శరీరాన్ని ఉంచిన చోటికి వెంటనే తిరిగి వెళ్లింది. అక్కడ అతని తల తన తొడ పై పెట్టుకొని కూర్చున్నది. కొంత సేపటికి సత్యవంతునిలో చైతన్యం కల్గింది.


*ఎవడో నన్ను గట్టిగా లాగాడు :*

అతడు సావిత్రిని చూచి "సావిత్రీ! నేను చాలాసేపు నిద్రపోయాను. నన్ను నీవెందుకు మేల్కొలపలేదు? ఎవడో బలవంతుడొకడు గట్టిగా నన్ను పట్టి లాగినట్లున్నాడు. అతడు ఎవడో గమనించావా? అది కలగాదు. నిజంగా జరిగినట్లే వుంది. నాకెందుకో చాల భయం వేసింది. అసలు ఏం జరిగిందో చెప్పు" అని అడిగాడు.

అప్పుడు సావిత్రి ఇలా అన్నది "జరిగిన సంగతి అంతా రేపు చెబుతాను. ఇప్పుడు చీకటిపడింది. ఇంక ఇక్కడ ఈ అడవిలో మనం ఆలసించడం మంచిదికాదు అదిగో! రాక్షసులు అప్పుడే ఇటూ అటూ తిరగడం ప్రారంభించారు. నక్కలు అరుస్తున్నాయి. జింకల మందలు తమ నివాసాలకు తిరిగి వెళ్తున్నాయి. త్వరగా ఆశ్రమానికి తిరిగి పోదాం. ఇప్పటికే ఎంతో సమయం మించిపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఆదుర్దాతో ఎదురు చూస్తూ వుంటారు. శీఘ్రంగా వెళ్లి వాళ్లకు సంతోషం కలిగించాలి. లేకపోతే వాళ్లు బాధపడతారు.

సావిత్రి ఎంతగా చెప్పినా సత్యవంతుడు పైకి లేవలేకపోయాడు. అతడింకా శోకం నుండి తేరుకోలేదని గుర్తించి ఆమె మళ్లీ ఇలా చెప్పింది —

"నాథా! చీకటి క్షణక్షణానికి దట్టంగా క్రమ్ముకొంటున్నది. ఇక్కడికి మన ఆశ్రమం చాలా దూరం. మీకింకా శ్రమ తీరినట్టులేదు. ఇప్పుడు వెళ్ళటం వీలుగాని పక్షంలో ఈ రాత్రికి ఇక్కడే వుండిపోదాం. తెల్లవారగానే బయలుదేరిపోవచ్చు. ఏమి చేయాలో సెలవివ్వండి" 

అప్పుడు సత్యవంతుడిలా అన్నాడు —

“సావిత్రీ! తలనొప్పి తగ్గిపోయింది. నా శరీరం ఇప్పుడిప్పుడే శక్తి పుంజుకుంటూ వుంది. మెల్లగా నడుస్తాను. తల్లిదండ్రులను వదిలేసి మనం ఈ అడవిలో ఎలా ఉండగలం? నేనెప్పుడూ వాళ్లను వదలి ఇంతసేపు ఉండలేదు. ఇంతవరకూ మనం వెళ్లనందుకు వాళ్లు ఏమనుకొంటున్నారో? ఎలా ఉన్నారో?

సంధ్యా సమయంలో కూడా మా తల్లి నన్ను ఇల్లు వదలి వెళ్లనిచ్చేది కాదు. ఇప్పుడామె ఎంతగా దిగులుపడి వుందో? అసలే వాళ్ళు మూడుకాళ్ల ముసలివాళ్లు. పైగా కళ్లు లేని కబోదులై అల్లాడుతున్నారు. ఆశలన్నీ మన మీదే పెట్టుకొని జీవిస్తున్నారు. ఈ పరిస్థితిలో సమయానికి మనం ఇల్లు చేరకపోతే ఎంతగా విలపిస్తున్నారో ?

అడవికి రాగానే పళ్లు కోసుకొని మనం అప్పుడే తిరిగిపోయి వుండవలసింది. అనవసరంగా జాగు చేశాం. దైవం మనల్ని పరీక్షించటానికే ఈ చిక్కులు కలిగించినట్లు 
ఉంది! మా నాన్న చాలా కంగారుపడి వుంటాడు. నన్ను గురించి ఆశ్రమంలో ఉండేవాళ్లనందరినీ మాటిమాటికీ అడుగుతూ వుంటాడు. సావిత్రీ! ఇంకా వాళ్లు జీవించే ఉంటారా? వాళ్లకేమైనా విపత్తు జరిగి వుంటే మనమిప్పుడు వెళ్ళి మాత్రం లాభమేముంది ?"

ఇలా అంటూ సత్యవంతుడు కన్నీరు కారుస్తూ శోకించాడు. అప్పుడు సావిత్రికి కూడా దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా ఆమె ధైర్యం తెచ్చుకొని భర్తను వోదార్చింది. మెల్లగా తన చేతులతో అతణ్ణి పట్టుకొని పైకి లేపింది.
🪷

*సశేషం*



꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment