*సతీ సావిత్రి - 3*
రచన : శ్రీ సముద్రాల లక్ష్మణయ్య
*అడవికి ప్రయాణం :*
దంపతులిద్దరూ అడవికి బయలుదేరారు. మనసులోని తాపాన్ని బలవంతంగా అణచుకొని ముఖంపై చిరునవ్వులొలికిస్తూ సావిత్రి భర్త అడుగుజాడలో నడిచింది. మెల్లగా నడుస్తూ వాళ్లు పరిసరంలో వున్న అరణ్యం చేరుకొన్నారు.
సత్యవంతుడు అందమైన అక్కడి దృశ్యాల ను భార్యకు చూపుతూ ఇలా అన్నాడు — "సావిత్రీ! ఆ మడుగులో అలలపై విలానంగా విహరిస్తున్న రాజ హంసలెంత అందంగా వున్నాయో చూడు. ఈ చెట్టు పూలూ, ఆ తీగ చిగుళ్ళు ఎంత ముచ్చటగా వున్నాయి! మనం నాటి పెంచిన చెట్లూ, తీగలూ ఇంత మనోహరంగా వుంటాయా? ఈ తీగ ఆ చెట్టును ఎలా పెనవేసుకొన్నదో చూసావా? పూదేవెలు ఆస్వాదిస్తూ ఝుమ్మంటున్న తుమ్మెదలూ, పండ్లు రుచి చూస్తూ కిలకిల మంటున్న చిలుకలూ కళ్ళకింపు గొల్పుతూ వీనులకు విందు చేస్తున్నాయి.”
సావిత్రి అతనితో ఉచితమైన మారు మాటలు పలుకుతూ అతని వాలకం గమనిస్తూ వెంట నడిచింది.
అక్కడ నత్యవంతుడు రకరకాలైన తియ్యని పండ్లుకోసి బుట్ట నింపాడు. తర్వాత గొడ్డలితో కట్టెలు చీలుస్తూ అలసిపోయినట్లుగా కనిపించాడు. క్రమంగా అతడి బడలిక తీవ్రమయింది. ఇక ఎంత మాత్రం నిలవలేక వశం తప్పి గొడ్డలిని నేల పై వదిలేశాడు. ముఖవికాసం కోల్పోయి భారంగా నిట్టూర్పులు విడుస్తూ విషాదంతో అర్ధాంగిని చూచి ఇలా అన్నాడు..
" సావిత్రీ! నాకేమో ఒంట్లో బాగాలేదు. తల గిర్రున తిరుగుతున్నది. మనసు స్వాధీనం తప్పుతున్నది. ఎవరో శూలంతో పొడిచినట్లు ఉన్నది. ఇక నిలబడలేను. కొంతసేపు ఇక్కడ పడుకొంటాను.'' అన్నాడు.
వెంటనే సావిత్రి భర్త శిరన్సుకు తన వొడిని దిండుగా చేసింది. రాజపుత్రుడు ఆమె పై తల వ్రాలుస్తూ సోలిపడిపోయాడు. మరుక్షణంలో అతడి శరీరం చైతన్యం కోల్పోయినట్లయింది.
*యమ సందర్శనం :*
ఆ మరుక్షణంలో సావిత్రి తన ఎదురుగా ఒక దివ్యపురుషుణ్ణి చూసింది. అతని శరీరం కాటుకలా నల్లగా వున్నది. పండ్లు వాడిగానూ, భీకరంగానూ వున్నాయి. కళ్లు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి. అతడి వైపు చూడటానికే భయం వేస్తున్నది. అతడి చేతిలో ఒక పాశం కూడా ఉన్నది.
ఆ పురుషుడు వడివడిగా సత్యవంతుణ్ణి సమీపించాడు. సావిత్రి భర్త తల నేల పై వుంచి భయంతో లేచి నిలబడింది. ఆ దివ్య పురుషుడికి నమస్కరించి " అయ్యా ! మీరెవరు? ఏమి చెయ్యాలని ఇక్కడికి వచ్చారు?" అని వినయంతో ప్రశ్నించింది.
అతడు ఆమె తనను చూడగలిగినందుకు ఆశ్చర్యపడి ఇలా అన్నాడు " అమ్మా ! నేను యమధర్మరాజును. జీవుల కర్మగతిని బట్టి ప్రాణాలు హరించేవాణ్ణి నేనే. వాళ్లను నా లోకానికి తీసుకుపోయి వాళ్ల వాళ్ల పాప కర్మలకు తగిన శిక్షలు విధిస్తూ వుంటాను. సాధారణంగా నేనెవరికీ కనిపించను. పాతివ్రత్య మహిమ వల్లనే నీవు నన్ను చూడగలిగావు. నీ భర్తకు అంత్యకాలం సమీపించింది ఇతడు మహా పుణ్యాత్ముడు. ఎన్నో ధర్మకార్యాలు చేసినవాడు. అందువల్ల ఇతని ప్రాణాలు హరించటానికి భటులను పంపక నేనే న్వయంగా వచ్చాను” అన్నాడు.
అలా చెప్పి యముడు వెను వెంటనే నత్యవంతుని దేహం నుండి జీవుణ్ణి వేఱు చేసి భయంకరమైన పాశంతో బంధించి పట్టుకొని దక్షిణ దిశగా పయనించాడు.
సావిత్రికి శోకం పెల్లుబికింది. అయినా అలాంటి పరిస్థితుల్లో దుఃఖిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమిటి? వెంటనే ఆమె ధైర్యం తెచ్చుకొని కర్తవ్యం నిర్ణయించుకొన్నది. భర్త శరీరాన్ని ఒక చోట సురక్షితంగా ఉంచింది. తొట్రుపాటుతో పాదాలు వణకుతున్నా లెక్క చేయకుండా యముణ్ణి అనసరించి నడిచింది.
వెంట వస్తున్న సావిత్రిని చూసిన యమ ధర్మరాజు " అమ్మా ! ఎందుకిలా వస్తున్నావు. ఈ దారిలో నడవటం చాలా కష్టం. తిరిగి వెళ్లు" అని మృదువుగా చెప్పాడు.
అందుకు సావిత్రి ఇలా అన్నది- "ధర్మరాజా! పతులు పోయే చోటికి సతులు పోవడం ధర్మం. పతినే గతిగా భావించిన నేను పతిని విడచి ఎలా వుండగలను? మీ అనుగ్రహం ఉంటే నేనెక్కడికైనా రాగలను. లోకంలో అన్నింటికన్నా ధర్మం ప్రధానమంటారు. అలాంటి ధర్మాన్ని రక్షించేవారు మీ వంటి సజ్జనులే. మీబోటి మహానుభావుల దర్శనం వ్యర్థం కాదు. మిమ్మల్ని సందర్శించి మీ అనుగ్రహం పొందకుండా నేను ఊరక తిరిగిపోతానా ?” అన్నది.
ఆ మాటలకు యముడు సంతోషించి ఇలా అన్నాడు.
*మొదటివరం - మామగారికి దృష్టి :*
" అమ్మా! నీవు చాలా తెలివైనదానివి. నీ మాటలు నాకెంతో ముచ్చటగా వున్నాయి. నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకేదైనా ఒక వరం కోరుకో! ఇస్తాను''
సావిత్రి ఆయనకు నమస్కరించి "దేవా! మీరెంతో దయామూర్తులు. మిమ్మల్ని ఎలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. అంధుడై రాజ్యం పోగొట్టుకొని అరణ్యంలో వున్న మా మామగారు ద్యుమత్సేన మహారాజుకు చూపు వచ్చేటట్టు అనుగ్రహించండి!" అని వేడుకొన్నది.
యముడు ఆమె కోరిక అనుగ్రహించి "ఇక నీవు నాతో రావద్దు. మాట విని తిరిగిపో" అని చెప్పి చరచరా సాగిపోయాడు. సావిత్రి అంతటితో విడవక ఆయన వెంట మళ్ళీ పయనించింది.
*రెండవ వరం – మామగారికి తిరిగి రాజ్యం:*
అలా పయనిస్తూ ఆయనను ఇలా ప్రార్థించింది- "మహానుభావా! ఆర్యులు ఎవ్వరికీ అపకారం తలపెట్టరు. దీనులను దయతో కాపాడుతారు. ఎవ్వరు ఏది కొరినా ఇవ్వటానికి వెనుకాడరు. ఆశ్రయించిన వారిని ఎట్టి పరిస్థితులలోనూ విడనాడరు. ఇవి మీ లాంటి పెద్దలు పాటించే ధర్మాలు. మీరు సాక్షాత్తూ ధర్మదేవతలు, మీకు తెలియని ధర్మం ఏమున్నది? అందరి పట్ల మీరు సమ భావంతో వ్యవహరిస్తారు. అందువల్లనే లోకమంతా మిమ్మల్ని పూజిస్తుంది. జీవుల పాపాలు పోగొట్టేవారు మీరే, మీ దయ లేకపోతే ఇక మమ్మల్ని కాపాడేదెవరు?”
అప్పుడు యముడు “ సావిత్రీ! ఎండలో దప్పిగొన్న వాడికి చల్లని పానీయం లాగా ఉచితమైన నీ పలుకులు నాకెంతో ఆనందం కలిగిస్తున్నాయి. నీకు మరొక వరం ఇవ్వదలచాను. సత్యవంతుడి ప్రాణాలు తప్ప ఇంక ఏదైనా కోరుకో” అని చెప్పాడు.
ఆమె “ దేవా! శత్రువుల చేజిక్కిన రాజ్యం మళ్లీ ద్యుమత్సేన మహారాజు వశమయ్యేట్లు కరుణించండి!” అని ప్రార్థించింది. ధర్మదేవత ఆమె రెండవ కోరికను గూడా ప్రసాదించాడు.
తర్వాత యముడు “సావిత్రీ! ఇంక నీవు నిలువు. ఈ దారి చాలా కష్టమైనది. నీ సుకృతం ఫలించింది. భర్త మీదా, అత్త మామల మీదా నీకున్న భక్తి సార్థకమైనది. ఇక మీద నీవు రావటానికి ఏ మాత్రం వీలులేదు. ఇది మానవులు నడిచే దారి కాదు. ఇక్కడి నుండి తిరిగిపో” అని హెచ్చరించి చకచకా ముందుకు కదిలిపోయాడు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment